కాలక్షేపం సినిమా 'ఔనన్నా కాదన్నా'

సినిమా: ఔనన్నా కాదన్నా
నటీనటులు: ఉదయ్ కిరణ్, సదా, సుమన్ శెట్టి,
ధర్మవరపు సుబ్రమణ్యం, పిళ్ళా ప్రసాద్,
రాళ్ళపల్లి, దువ్వాసి మోహన్, రమాప్రభ తదితరులు.
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
సంగీతం: ఆర్పీ పట్నాయక్
సాహిత్యం: కుల శేఖర్
కథ, స్క్రేన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: తేజ
నిర్మాత: అట్లూరి పూర్ణచంద్రరావు
ఉదయ్ కిరణ్ ఏడాది విరామం తర్వాత సదాని హీరోయిన్‌ను చేసుకుని 'కమ్ బ్యాక్' సినిమాగా రూపొందిన సినిమా 'ఔనన్నా కాదన్నా'. తేజా తాజా చిత్రం 'పేదింటి అబ్బాయి- పెద్దింటి అమ్మాయి' వంటి పాత ఫార్ములాతో రూపొందింది. ఈ సినిమా విజయం సాధించే అవకాశాలు తక్కువగా ఉన్నా కాలక్షేపానికి చూడవచ్చు.
పాతకథనే మళ్ళీ చెప్పుకుంటే మంగరాజు (పిళ్ళా ప్రసాద్) గోదావరి లంక ప్రాంతాల జమీందారు. విలన్‌లాగా చిన్న రైతుల పొలాలను ఆక్రమిస్తూ ఉంటాడు. ఆ క్రమంలో రాము (ఉదయ్ కిరణ్) తండ్రికి చెందిన పాతిక ఎకరాలభూమిని ఆక్రమిస్తాడు. పాతికేళ్ళ తర్వాత రాము పెద్దవాడవుతాడు. అప్పుడేమవుతుంది? షరా మామూలే. రాము మంగరాజు మనవరాలిని ప్రేమించి, పోరాటాలు చేసి ఆమెను పెళ్ళాడుతాడు. హీరోయిన్ సదా పల్లెటూరి సుందరిగా కన్పిస్తుంది. ఫస్టాఫ్ అంతా ఉదయ్‌కిరణ్, సదాల ప్రేమాయణం, ధర్మవరపు కామెడీతో సినిమా సరదాగా సాగిపోతుంది. ఇంటర్వల్‌కే కథ ఓ కొలిక్కి వచ్చేయడం పెద్దలోపం. రెండో మలుపు తర్వాత హీరో పాసివ్‌గా మారడం సినిమాను దెబ్బతీసింది. ఈ లోపాలు లేకపోతే సినిమా ష్యూర్‌గా హిట్ అయిఉండేది. సంగీతం ఇళయరాజాని అనుకరించినా ఫర్వాలేదు. సినిమాలో కామెడీ బాగా పండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తేజా మార్కు 'అతి హింస ఉంది. ఉదయ్‌కిరణ్ కసితో నటించినట్టు కన్పించింది. పిళ్ళా ప్రసాద్ నటన కృతకంగా ఉంది. తేజ సినిమాలు 'జై' 'ధైర్యం' కంటే బెటర్ సినిమా ఇది. అయినా యావరేజి పరిధులు దాటని సినిమా. కాలక్షేపానికి చూడవచ్చు.


Click it and Unblock the Notifications











