Akkada Ammayi Ikkada Abbayi Movie Review: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: ప్రదీప్ మాచిరాజు, దీపిక పిల్లి, గెటప్ శ్రీను, బ్రహ్మాజీ, సత్య, వెన్నెల కిషోర్, జీఎం సుందర్, మురళీధర్ గౌడ్, బ్రహ్మనందం, జాన్ తదితరులు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నితిన్ భరత్
మ్యూజిక్: రధన్
సినిమాటోగ్రఫి: ఎంఎన్ బాల్‌రెడ్డి
ఎడిటర్: పవన్ కల్యాణ్ కోదాటి
డైలాగ్స్: సందీప్ బొల్లా
ఆర్ట్ డైరెక్టర్: ఆశీష్ తేజ్ పీ
బ్యానర్: మాంక్స్ అండ్ మంకీస్
రిలీజ్ డేట్: 2025-04-11
ఆంధ్రా, తమిళనాడు సరిహద్దులోని భైరి కోన గ్రామంలో 60 మంది అబ్బాయిలు పుట్టిన తర్వాత లేక లేక ఓ ఆడపిల్ల పుడుతుంది. ఆడబిడ్డ పుట్టిన తర్వాత కరువు కాటకాలు తగ్గి వర్షాలు పడుతాయి. దాంతో ఆ అమ్మాయిని ఆ ఊరి పొలిమేర దాటకుండా కట్టుబాటు చేస్తారు. ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికే పెళ్లి చేయాలని ఊరి పెద్ద రాజన్న (జీఎం సుందర్) తీర్పు చెబుతారు. ఆ అమ్మాయికి రాజకుమారి (దీపిక పిల్లి) పేరు పెడుతారు. అయితే హైదరాబాద్ నుంచి ఆ ఊరికి వచ్చిన ఇంజినీరు కృష్ణ ( ప్రదీప్ మాచిరాజు)తో రాజకుమారి ప్రేమలో పడుతుంది.

గ్రామ పెద్ద రాజన్న ఎందుకు పెళ్లి చేసుకోకుండా గ్రామం కోసం త్యాగం చేస్తాడు? రాజకుమారికి 60 మందిలో ఒక్కరు పెళ్లి చేసుకొంటే.. మిగితా 59 మందికి చేకూరే లబ్ది ఏమిటి? అలాంటి పరిస్థితుల్లో ఇంజినీరు కృష్ణతో ప్రేమలో పడిన తర్వాత రాజా అలియాస్ రాజకుమారి పరిస్థితి ఏమైంది? రాజా, కృష్ణ ప్రేమ వ్యవహారం తెలిసిన తర్వాత గ్రామ పెద్ద రాజన్న ఏం తీర్పు ఇచ్చాడు? రాజాను కృష్ణ పెళ్లి చేసుకొన్నాడా? గ్రామంలోని మిగితా 60 మంది యువకుల పరిస్థితి ఏమిటి? రాజా, కృష్ణ లవ్ స్టోరీకి ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా కథ.
ప్రదీప్ మాచిరాజు హీరోగా సినిమా అనగానే సహాజంగానే కామెడీ, లవ్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుందని ఎవరైనా ఊహిస్తారు. అలాంటి అంచనాలకు తగినట్టే దర్శకులు నితిన్ భరత్ రాసుకొన్న పాయింట్ కూడా మంచి వినోదానికి స్కోప్ ఉన్న పాయింట్‌నే ఎంచుకొన్నారనిపిస్తుంది. కానీ అలాంటి మంచి పాయింట్‌ను సన్నివేశాలుగా విస్తరించే క్రమంలో తడబాటుకు గురయ్యారనే సినిమా చూస్తే అర్ధమవుతుంది. జబర్దస్త్ కామెడీకి ఎక్కువ తక్కువ అనే విధంగా సీన్లు రాసుకోవడం వల్ల.. మంచి పాయింట్‌ను వృధా చేశారనే ఫీలింగ్ కలుగుతుంది.
ఫస్టాఫ్‌లో కథను ఎస్టాబ్లిష్ చేయడానికి సమయం తీసుకొన్న దర్శకులు ఆ తర్వాత ఇంటర్వెల్ తర్వాత మంచి ట్విస్టు ఇచ్చి స్టోరీలో జోష్ పెంచారు. ఆ తర్వాత కూడా నాసిరకంగా సీన్లను రాసుకోవడంతో ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్లేవర్ తగ్గిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్‌లో కొన్ని చోట్ల, సెకండాఫ్‌లో మరికొన్ని చోట్ల నవ్వించిన ప్రయత్నం బాగుంది. ఓవరాల్‌గా ఫర్వాలేదనే విధంగా సినిమాను ముగించే ప్రయత్నం చేశారు.

ఇక ప్రదీప్ మాచిరాజు తన క్యారెక్టర్‌కు తగిన కథనే ఎంచుకొన్నారని చెప్పాలి. ఇంజినీరు కృష్ణ పాత్రలో ఆయన ఒదిగిపోయి నటించారు. తన సహజ తరహాలో పంచులు విసిరుతూ.. లవ్ సీన్లలో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. ఇక తెలుగు అమ్మాయి దీపిక పిల్లి తనకు లభించిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొన్నారు. ప్రదీప్, దీపిక మధ్య లవ్ సీన్లలో కెమిస్ట్రీ అదిరిపోయింది. వారిద్దరూ ఈ సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు. బిలాల్‌గా సత్య, గెటప్ శ్రీను పోటీపడి నవ్వుల పూలు పూయించారు. మధ్యలో వెన్నెల కిషోర్, బ్రహ్మనందం మిగితా వారందరూ తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.
ఈ మూవీ విషయానికి వస్తే.. మంచి టెక్నికల్ వాల్యూస్ కనిపించాయి. ఆహ్లాదకరంగా కనిపించే సన్నివేశాలు చూపించిన సినిమాటోగ్రాఫర్, ఢిఫరెంట్ మ్యూజిక్ ట్రై చేసిన రధన్, గ్రామంలోను, సిటీలోను మంచి లొకేషన్లలో పాటలు చిత్రీకరణ బాగుంది. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టి, కథ, కథనాలు, సన్నివేశాలపై మరింత దృష్టిపెట్టాల్సి ఉందనిపిస్తుంది. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ అనుసరించిన నిర్మాణ విలువలు బెస్ట్‌గా కనిపిస్తాయి.
ఫన్, లవ్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో నాన్ స్టాప్ కామెడీకి ఆస్కారం ఉన్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. కానీ ఆ దిశగా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయలేకపోవడం వల్ల సగం వండి వండని వంటకంలా తయారైందనే ఫీలింగ్ ఈ సినిమా చూసిన తర్వాత అనిపిస్తుంది. అయితే నటీనటులు స్క్రిప్టుపరంగా ఉన్న లోపాలను తమ నటనతో కనిపించకుండా చేశారు. నేటివిటీతో కూడిన కామెడీ, ఫ్రెష్ లవ్ స్టోరి ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. స్క్రిప్టు పరమైన లోపాలు ఈ సినిమాకు మైనస్‌గా కనిపిస్తాయి. ప్రదీప్ మాచిరాజు, జబర్దస్త్ కామెడీని ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చడానికి అవకాశం ఉంది. అంచనాలు లేకుండా వెళ్లి చూడండి.. మీకు ఎలాంటి అనుభూతి దక్కుతుందో పరీక్షించుకొండి.


Click it and Unblock the Notifications











