చూస్తే ...అల్లాడిపోతాం(అల్లాడిస్తా రివ్యూ)
---సూర్య ప్రకాష్ జోశ్యుల
బ్యానర్ : మానస్ రుషి ప్రొడక్షన
నటీనటులు :ఉదయ్ కిరణ్, మీరా జాస్మిన్, రిషి, సుదర్శనా సేన్, వివేక్, రాధా రవి, రంభ, లారెన్స్, లక్ష్మీ రాయ్ తదితరులు.
సంగీతం: దేవ
కెమెరా: విజయ్ రాఘవ
కథ,స్క్రీన్ ప్లే: కరుణానిధి
దర్శకుడు : బాలీ శ్రీరంగం
నిర్మాత : కే.రోహిత్
విడుదల తేదీ: 25-06-2010
కొద్దిగా లేటుగా సినిమాని తీయటం అల్లాడిస్తాని దారుణంగా దెబ్బతీసింది. మినిమం ఓ ముప్పై ఏళ్ళ క్రితం ఈ చిత్రం రిలీజై ఉండే గ్యారెంటీగా హిట్ అయ్యిడేది. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి అప్పట్లో ఎమ్.జి.ఆర్ కోసమో,మరో హీరో కోసమో రాసుకున్న కథని తీసుకుని ఈ కాలం సెల్ ఫోన్స్, ల్యాప్ టాప్ లతో ఆధునీకరించి చేసిన ఈ ప్రయోగం దర్శకుడు ధైర్యానికి మచ్చుతునుక. ఎందుకంటే కెరీర్ ని పణంగా పెడితే గానీ ఇలాంటి చిత్ర రాజం తయారుకాదు. ఇక ఉదయ్ కిరణ్, మీరా జాస్మిన్,రంభ, రిషీ అంతా కథలాగే ఫేడ్ అవుట్ అయిపోయినవాళ్ళే కాబట్టి వాళ్ళ ఇమేజ్ కి పెద్దగా నష్టమేమీ జరగదు. ఈ మధ్యలో టైటిల్ ని జస్టిఫికేట్ చేస్తూ అల్లాడిపోయింది డబ్బులు పెట్టి ధియోటర్ లో దూరిన ప్రేక్షుకుడు మాత్రమే.
సూర్య(ఉదయ్ కిరణ్)ఓ యంగ్, డైనమిక్ పోలీస్ ఆఫీసర్. అడవుల్లో జరిగే అక్రమాలతో పోరాడుతూండే అతను మేఘ(మీరా జాస్మిన్) తో ప్రేమలో పడతాడు. ఆమె జీవితాశయమైన ఐపియస్ అవ్వటానికి సహకరిస్తూంటాడు. ఇలా ప్రశాంతంగా నాలుగు ఫైట్స్, రెండు పాటలతో సాగిపోతున్నసూర్య జీవితంలోకి అతని కాలేజ్ ప్రెండ్ నాగేద్ర(రిషి) ప్రవేశిస్తాడు. గోముఖ వ్యాఘ్రం లాంటి పైకి నీతులు చెప్తూ వెనక దుర్మార్గపు చేష్టలతో అందరినీ ఆకట్టుకుంటూంటాడు. ఆ క్రమంలో అతని మాయమాటలకు పడిపోయిన అమ్మాయి ప్రభావతి(సుదర్శనా సేన్). సూర్య దగ్గరుండి ఈ పెళ్ళి జరిపిస్తాడు. అయితే పెళ్ళయ్యాక అతని నిజ స్వరూపం అతనికి అర్ధమవుతుంది. కట్నం ఇమ్మని హెరాస్ చేస్తాడు. దాంతో అతను డబ్బు పిశాచి అని అర్దం చేసుకున్న ఆమె నో అంటుంది.ఈ విషయం తెలుసుకున్న సూర్య అడ్డుపడితే ఆమెను చంపేసి ఆ హత్యా నేరాన్ని సూర్యపై తోసేస్తాడు. అంతోటి ఫారెస్ట్ ఆఫీసర్ ఒక చిన్న ట్రిక్ కు బలై జైలు పాలై నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోవటానికి పరారవుతాడు. ఈ లోగా సూర్య ప్రేయసి మేఘ ..ఐపియస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఉద్యోగంలో జాయిన్ అవుతుంది. మరో ప్రక్క సూర్య తల్లి ఓ జడ్జి ఆవిడే ఈ కేసుని వాదించాల్సి వస్తుంది. అప్పుడు సూర్య ఎలా విలన్స్ అక్రమాలు బయిట పెట్టి తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకుని బయిట పడ్డాడనేది ఓపికుంటే తెరపై చూడాల్సిన కథ.
కరుణానిధి కథ,స్క్రీన్ ప్లే అందించాడంటూ వచ్చిన ఈ కథ మరీ ముతకగా ఉందని పై కథ చదివిన ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. టెక్నాలిజీ ఇంత డవలప్ అయిన ఈ రోజుల్లో కూడా హీరో ని మర్డర్ కేసులో ఇరికించటానికి యాభై ఏళ్ళ క్రితం పద్దతి ఉపయోగిస్తున్నారనప్పుడే దర్శకుడుకి డౌట్ వస్తే బావుండేది. అయితే దర్శకత్వం కూడా ఆ కాలం నాటి నే గుర్తు చేస్తూండటంతో ఆయన అక్కడే ఆగిపోయాడని అర్దమవుతుంది.కాబట్టి దీనిమీద ఇంతకు మించి విశ్లేషణ అనవరసం. ఇక ఉదయ్ కిరణ్ ఇప్పటికే దాదాపు ఫేడవుట్ అయిపోయాడు. దానికి తగ్గట్లు ఏరికోరి ఇలాంటి సినిమాల్లో చేస్తే ఇంతే సంగతులు. ఇక రంభ, మీరా జాస్మిన్ లు సినిమా వచ్చింది చేసేసాం అన్నట్లు చేసారు. ఉన్నంతలో రిషీనే బాగా చేసాడు. డైలాగులు..తమిళం అనువాదం కావటంతో అక్కడ వాతావరణాన్ని ప్రతిబింబించాయి. తెలుగు నిర్మాత అయితే ఇంతకు మించి దండగ అనుకున్నాడో ఏమో గాని తమిళం బోర్డులు కూడా మార్చకుండా ఉంచేసాడు.
ఏదైమైనా సాధ్యమైనంతా ఈ చిత్రానికి దూరంగా ఉండటం మేలు. ఉదయ్ కిరణ్...చిత్రం,నువ్వు నేను గుర్తు చేసుకుని ఈ సినిమాకి వెళ్తే కష్టం. మరో విషయం...పోస్టర్స్ పై లక్ష్మీరాయి, లారెన్స్ కనిపిస్తారు..టెప్ట్ అవటం అనవసరం. ఎందుకంటే వాళ్ళు కనపడేది కేవలం ఐటం సాంగ్ లో మాత్రమే.


Click it and Unblock the Notifications











