twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యావరేజ్ బంగార్రాజు(రివ్యూ)

    By Srikanya
    |
    Betting Bangara Raju
    Rating
    -సూర్య ప్రకాష్ జోశ్యుల
    సినిమా: బెట్టింగ్ బంగార్రాజు
    సంస్థ:ఉషాకిరణ్‌ మూవీస్‌
    నటీనటులు: అల్లరి నరేష్‌, నిధి, కోట శ్రీనివాసరావు, గిరిబాబు, చలపతిరావు,
    ప్రగతి, రఘుబాబు, కృష్ణభగవాన్‌, అమిత్‌, జై వేణు, ఎల్బీ శ్రీరామ్‌, హేమ,
    సురేఖావాణి, కల్పన, విజయ్‌సాయి, ప్రవీణ్‌, ఫణి తదితరులు.
    డైలాగులు: గంధం నాగరాజు
    ఎడిటింగ్: గౌతం రాజు
    లైన్‌ ప్రొడ్యూసర్‌: పొట్లూరి సత్యనారాయణ
    సంగీతం: శేఖర్ ‌చంద్ర
    దర్శకత్వం: ఇ.సత్తిబాబు
    నిర్మాత: రామోజీరావు
    విడుదల తేది: 09/04/2010

    టైటిల్, హీరోని నమ్ముకుని మనం ధియోటర్ లోకి వెళితే డైరక్టర్ కూడా మనలాగే టైటిల్ ని, ఇంటర్వెల్ బ్యాంగ్ ని నమ్ముకుని సినిమా తీసినట్లు అర్ధమయ్యే చిత్ర రాజం బెట్టింగ్ బంగార్రాజు. బెట్టింగ్ ని టైటిల్ లో మాత్రమే ఉంచి ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్, సెకెండాఫ్ లో కొన్ని సీన్స్ బెట్టింగ్ పై వేసి అదే టైటిల్ జస్టిఫికేషన్ అనుకోమంటాడు. దాంతో మనం ధియోటర్ కి ఏది నమ్ముకుని వెళ్తామో అది దొరకక నిరాసపడి, ఉన్నదాంతో ఎడ్జెస్టై సైలెంట్ గా బయిటకు వస్తాం. దాంతో సినిమా బావుంది అనీ చెప్పలేం...బాగోలేదనీ చెప్పటానికి పూర్తిగా మనస్సు ఒప్పదు. ఎందుకంటే అక్కడక్కడా నవ్వించాడు కదా అనేది ఒకటయితే.. ప్రక్క ధియోటర్లో ఇంత కన్నా చెత్త ఆడుతోంది కదా అని మనలో మనం సమాధానపరుచుకుని మధ్యస్తంగా ఓకే అనేస్తాం. అదే బెట్టింగ్ బంగార్రాజు పరిస్దితి. కథ,కథనంలోనే లోపాలుతో తయారైనా అక్కడక్కడా రఘుబాబు లాంటి క్యారెక్టర్స్ తో నవ్వించి ఫరవాలేనిపించేస్తాడు. గట్టిగా బెట్ కాసి హిట్ అని చెప్పమంటే మొహం చాటేసేలా చేస్తాడు.

    అనగనగా మహా సుడిగాడుగా పేరు తెచ్చుకున్న సత్తుపల్లి బంగార్రాజు(నరేష్). అతనుఎప్పుడూ టైటిల్ కి తగ్గట్లు బెట్టింగ్ లు కడుతూ, గెలుస్తూ హ్యాపీగా తన పల్లెలో రోజులు గడిపేస్తూంటాడు. అలాంటి వాడికి ఓ రోజు హైదరాబాద్ వెళ్ళి అక్కడో అమ్మాయిని అర్జెంటుగా ప్రేమలో పడేసి పెళ్ళిచేసుకోవాలని బుద్ది పుడుతుంది(అంత తెలివైన వాడికి ఇదేం బుద్ది అనకండి). పుట్టిందే..తడువుగా హైదరాబాద్ లో వాలిపోయి...అక్కడ రోడ్డుపై కనపడ్డ దివ్య (నిధి) కి మనసిచ్చేస్తాడు. అయితే దివ్యకి అప్పటికే మరో ముగ్గురు (అమిత్, సమ్రాట్, శ్రీ అక్షయ్) ప్రేమ ప్రపోజల్ చేస్తారు. దాంతో తెలివైన(?) దివ్య ఈ నలుగురుని ఓ చోటకి రప్పించి...మీరు నలుగురు మా ఇంటికి రండి...అక్కడో పదిహేను రోజులు ఉంటే మా పెద్దవాళ్ళుకి ఎవరు నచ్చితే వారి చేత తాళి కట్టించుకుంటాను అంటుంది.అలాంటి పరిస్ధితుల్లో బంగార్రాజు తన తెలివితో ఎలా ఆమెను గెలుచుకున్నాడనేది మిగతా కథ.

    బెట్టింగ్ బంగార్రాజు అనే టైటిల్ చూడగానే...బెట్టింగ్ లే జీవితంగా గడిపే బంగార్రాజు ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నాడు...చివరకు ఎలా బయిటపడి..బెట్టింగులు కాయిటం తప్పు అని తెలుసుకున్నాడనే ఆలోచన టక్కున సగటు సినీ జీవికి వచ్చేస్తుంది. అయితే అలాంటి కథ రిపీట్ రాకుండా జాగ్రత్తపడ్డారు..కానీ పాయింట్ కొత్తగా తీసుకోలేకపోయారు. ఈ స్టోరీ లైన్ లో హీరోయిన్ కి నలుగురు ప్రేమ ప్రపోజల్స్ పెడితే వారిని తన ఇంటికి ఆహ్వానించి స్వయంవరం లా వారిని పరీక్షించి ఎంపిక చేసుకుంటాననటం. అయితే నలుగురూ ఆమెకు ప్రేమ ప్రపోజల్స్ పెడితే ఆమె నేను ఫలానా వారిని ప్రేమించాను..లేదా మిమ్మెల్ని ఎవరినీ ప్రేమించలేదు అని పొరపాటున అనలేదు. అనదు. దానికో విచిత్రమైన రీజన్ (నచ్చలేదంటే నా మీద యాసిడ్ పోస్తారు, కిడ్నాప్ చేస్తారు..) చెపుతుంది.అంతేగాని నా మనస్సులో ఇది ఉంది అనదు. అలాగే ఈ నలుగురు కూడా ఎవరూ అసలు మాలో నువ్వు ప్రేమించింది ఎవర్ని అని క్వచ్చిన్ చేయరు. అదే ఈ కథనాన్ని దెబ్బ తీసింది.

    అలాగే పల్లెలో మొదలైన కథ అక్కడ పాత్రలను అక్కడే వదిలేసి (తర్వాత ఎక్కడా వారు కనపడరు) సిటీకి చేరుతుంది. అక్కడ నుంచి సిటీలో పరిచయమయ్యే పాత్రలు(కృష్ణభగవాన్ వంటివి) అక్కడే వదిలేసి మళ్ళీ హీరోయిన్ ఊరు మరో పల్లె ఆత్రేయపురం చేరుకుంటుంది. దాంతో అప్పటివరకూ పరిచయమయిన పాత్రలు సీన్స్ ని నడపటానికే కాని కథని ముందుకు వెళ్ళటానికి పొరపాటున కూడా సహకరించవు. దాంతో ఆ ఎపిసోడ్స్ లేకపోయినా కథకు వచ్చే నష్టం లేదు కదా అన్న ఫీలింగ్ వస్తుంది. ఇక అల్లరి నరేష్ పాత్ర ఫస్టాఫ్ మొత్తం ఎక్కడా ఏ సమస్యను ఫేస్ చేయకుండా కూల్ గా తను చెప్పింది డైలాగుగా, పాడింది డ్యూయిట్ గా సాగిపోతుంది. దాంతో ఆ సన్నివేసాలు అస్సలు ఆసక్తి రేపవు. పోనీ ఇంటర్వెల్ వద్ద కాంఫ్లిక్ట్ లో కి వచ్చాడురా అనుకుంటే సెకెండాఫ్ లో తన బెట్టింగ్ తెలివి తేటలతో ఆ సమస్యలతో పోరాడటానికి పెద్దగా ప్రయత్నం చేయడు. దాంతో స్క్రీన్ ప్లే లోపమే సినిమా గ్రాఫ్ ని పడకొట్టుకుంటూ వెళ్ళిపోయింది.

    అయితే సినిమా ప్లాట్ గా వెళ్ళినా అక్కడక్కడా పంచ్ లు లేకపోలేదు. అయితే అవి దర్శకుడు అనుభవంతోనో, రచయిత తెలివితోనో పుట్టినవి. అంతేగాని కథనుండి పుట్టినవి కాదు. అలాగే రఘుబాబు చేసిన ఆత్రం పాత్ర నవ్వించి సెకెండాఫ్ ని కాస్త కాపు కాసింది. ఇక కోట శ్రీనివాసరావుతో చెస్ ఆడే సీన్..సినిమా మొత్తానికి హైలెట్ గా నిలుస్తుంది. హీరోయిన్ యావరేజ్ గా ఉన్నా పాటల్లో యాక్టివ్ గా కనిపిస్తుంది. అలాగే దర్శకుడు చిత్రంలో నాలుగే పాటలు పెట్టి ఉన్నంతలో హాయి అనిపించాడు. కెమెరా, ఎడిటింగ్ చెప్పుకో తగినంతగా లేకపోయినా కామిడీ సినిమాకు సరిపోయాయనిపిస్తాయి. దర్శకుడు సత్తిబాబు..గత చిత్రం ఓ చిన్నదానా తో పోలిస్తే పెద్దకామిడీ అనిపించదు. అలాగే గంధం నాగరాజు డైలాలుగు గమ్యం రేంజిలో కనపడవు. దానికి సన్నివేశాలు సరిగ్గా అల్లిక లేకపోవటం కారణం కావచ్చు.

    ఏదైమైనా బెట్టింగ్ బంగార్రాజు..అల్లరినరేష్ గత చిత్రం బెండు అప్పారావులా నవ్వించకపోయినా ఫరవాలేదనిపిస్తుంది. అయితే వేసవి ప్రేక్షక దాహాన్ని మాత్రం ఇది తీర్చలేదని చెప్పవచ్చు. పెద్ద పెద్ద సినిమాలు భాక్సాఫీస్ వద్ద ఫెయిలవుతున్న ఈ సమయంలో మరింత బావుండి ఉంటే ఈ చిత్రం గ్యారెంటీగా మంచి రిజల్ట్ సాధించేది. అల్లరి నరేష్ ఎఫెక్టు కొంత, కామిడీ సినిమాని అని కొంత ఫ్యామిలీలను ఇబ్బంది పెట్టే చిత్రం కాకపోవటం కొంత బెట్టింగ్ బంగార్రాజుకు కలిసివచ్చే అంశాలు. ఎన్ని చెప్పుకున్నా గతంలో ఎన్నో కామిడీలు అందించిన ఉషాకిరణ్ లాంటి బ్యానర్ మాత్రం తీయదగ్గ రేంజి సినిమా మాత్రం కాదు. కేవలం ఏసీ కోసమే కాకుండా అప్పుడప్పుడూ నవ్వుకోవటానికి ఈ చిత్రం ధియోటర్స్ వైపు ఓ కన్నేయచ్చు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X