Alpha Movie Twitter Review: అల్ఫా మూవీ ట్విట్టర్ రివ్యూ..
Alpha Movie Twitter Review: బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'అల్ఫా'. ఉదయ్ చోప్రా కథను అందించిన ఈ సినిమాకి శివ్ రవైల్ దర్శకత్వం వహించారు. స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించగా, శర్వరి కీలక పాత్ర పోషించింది. అలాగే అనిల్ కపూర్, బాబీ డియోల్, దివ్యేందు భట్టాచార్య తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించారు.
సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. రుబైస్ సినిమాటోగ్రఫీ అందించగా, ఆరిఫ్ షేక్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. రోహన్ష్, అబీర్ పండిట్ సంగీతాన్ని సమకూర్చగా, సంచిత్-అంకిత్ బెహ్రా ద్వయం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందించారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ జూలై 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. ఈ నేపథ్యంలో అల్ఫా మూవీపై సోషల్ మీడియాలో నెటిజన్లు, క్రిటిక్స్ అభిప్రాయాలను పరిశీలిస్తే..

అసలు ఈ స్పై యూనివర్స్ అనే వ్యవహారం ఎందుకో అర్ధం కావడం లేదు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ వారి అన్ని స్పై సినిమాల కథలు ఒకేలా ఉంటాయని నాకు అనిపిస్తోంది. గూఢచారులు దేశ బాహ్య శత్రువులతో పోరాడుతారని వారికి ఎవరైనా చెప్పండి. కానీ వారి దృష్టిలో మాత్రం రా (RAW)కు చెందినవారే ఎప్పుడూ దేశద్రోహులుగా తేలుతుంటారు. ఆదిత్య ధర్ నీకు మరోసారి కృతజ్ఞతలు అంటూ ఓ నెటిజన్ అల్ఫా మూవీపై కామెంట్ పెట్టాడు.
నా దృష్టిలో అల్ఫా డిజాస్టర్ లాంటి సినిమా. ఆధ్వాన్నమైన రచనతో రూపొందించారు. భారత సైన్యాన్ని, మనదేశ నిఘా వ్యవస్థలను పూర్తిగా అపహాస్యం చేసేలా ఈ సినిమా ఉంది. మెయిన్ స్ట్రీమ్ భారతీయ చలన చిత్ర రంగంలో నేను చూసిన అత్యంత బాధ్యతారాహిత్యంతో, స్పృహ లేకుండా తీసిన సినిమాలలో ఇది కూడా ఒకటి అని ఓ నెటిజన్ ఘాటుగా రాసుకొచ్చాడు.
'అల్ఫా' సినిమాపై ఓ అభిమాని ట్విట్టర్ (ఎక్స్)లో తన అభిప్రాయాన్ని పంచుకుంటూ మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. ఈ సినిమాకి 2/5 రేటింగ్ ఇచ్చారు. సినిమాలో కొన్ని బలమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ, సాధారణ కథ కారణంగా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదని పేర్కొన్నారు. తన ట్వీట్‌లో, "అల్ఫాలో ఆకట్టుకునే అంశాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా బాబీ డియోల్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన బలం. ఆయన తెరపై కనిపించిన ప్రతిసారి స్టోరీలో హైప్ కనిపిస్తుంది. తక్కువ సన్నివేశాలే ఉన్నా, తన నటనతో బలమైన ముద్ర వేశారు. అలాగే ఆలియా భట్ కూడా తన కెరీర్‌లోని బెస్ట్ ఇచ్చింది. భావోద్వేగ సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్‌లో ఆమె నటన వేరే లెవల్. కొన్ని యాక్షన్ సన్నివేశాలు విజువల్‌గా అద్భుతంగా ఉన్నప్పటికీ, మరికొన్ని చోట్ల అంతగా సహజంగా అనిపించలేదు" అని రాశారు.
అలాగే దర్శకత్వం, నిర్మాణ విలువల గురించి మాట్లాడుతూ.. యష్ రాజ్ ఫిల్మ్స్ స్థాయికి తగ్గట్టుగానే నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతం అన్నీ సినిమాకు బలాన్ని చేకూర్చాయి. అంతేకాదు, వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ (YRF Spy Universe) విస్తరణలో భాగంగా వచ్చిన కనెక్షన్స్‌తో పాటు, హృతిక్ రోషన్ క్యామియోతో పాటు మరికొన్ని సర్‌ప్రైజ్ ఎంట్రీలు అభిమానులకు మంచి ట్రీట్‌గా ఉంటాయి" అని అభిప్రాయపడ్డారు. అయితే కథ విషయంలో మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. "సినిమా ప్రారంభం నుంచే కథ ఎటు వెళ్లబోతోందో ఊహించేయొచ్చు. ట్విస్టులు చాలా తక్కువ. ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగినా, సెకండ్ హాఫ్ నెమ్మదిగా సాగుతుంది. క్లైమాక్స్ మాత్రం మంచి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అయినప్పటికీ మొత్తం స్క్రీన్‌ప్లే సగటు స్థాయిలోనే అనిపించింది" అని పేర్కొన్నారు.
ఈ సినిమాపై మరో అభిమాని ప్రశంసల జల్లు కురిపించారు. సినిమా చూసిన వెంటనే తన స్పందన తెలుపుతూ.. "అల్ఫా నిజంగా మైండ్‌బ్లోయింగ్ మూవీ. స్టైలిష్ మేకింగ్, కథలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను చివరి వరకు సీట్లో కూర్చోబెడతాయి" అని పేర్కొన్నారు. అలాగే హీరోయిన్ ఆలియా భట్ నటనపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపిస్తూ, "ఈ సినిమాలో ఆలియా భట్ పూర్తిగా షోను దోచేసింది. తన అద్భుతమైన నటనతో ప్రతి సన్నివేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. అలాగే శర్వరి వాఘ్ నటన కూడా ఎంతో ఆకట్టుకుంది. ఆమె ఇప్పుడు తన ఫేవరెట్ క్రష్ అయిపోయిందని" సరదాగా రాసుకొచ్చారు.
సినిమా చూసిన ఓ నెటిజన్ ట్విట్టర్ (X)లో తన ఫస్ట్ హాఫ్ రివ్యూను పంచుకుంటూ.. "ఆల్పా ఫస్ట్ హాఫ్ ఒక్క మాటలో చెప్పాలంటే 'యావరేజ్'" అని అభిప్రాయపడ్డాడు. కథ ఏమాత్రం ఆకట్టుకోలేదని, అదే సినిమాకు పెద్ద మైనస్‌గా మారిందని పేర్కొన్నాడు. అయితే యాక్షన్ సన్నివేశాలు మాత్రం బాగా తెరకెక్కించారని ప్రశంసించాడు. సంగీతం పూర్తిగా నిరాశపరిచిందని, ఆలియా భట్ నటన ఆశించిన స్థాయిలో లేదని అభిప్రాయపడ్డాడు. మరోవైపు బాబీ డియోల్, అనిల్ కపూర్ తమ పాత్రల్లో ఆకట్టుకున్నారని, శర్వరి నటన మాత్రం ఓకే అనిపించిందని తన రివ్యూలో పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications