twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అమృత'మే కానీ....

    By Staff
    |

    Amrutha
    -జలపతి
    చిత్రం: అమృత
    నటీనటులు: మాధవన్‌, సిమ్రాన్‌, బేబి కీర్తన,
    నందితాదాస్‌, జె.డి.చక్రవర్తి, ప్రకాష్‌ రాజ్‌
    సినిమాటోగ్రఫీ: రవి.కె.చంద్రన్‌
    మాటలు: శ్రీరామకృష్ణ
    సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌
    కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: మణిరత్నం

    ''వాస్తవానికి, డ్రామాకు మధ్య తేడాను తగ్గిస్తూ, వాటి మధ్య తేడా లేదన్న విధంగా చిత్రాలు తీయాలన్నది నా ప్రయత్నం' అని మణిరత్నం కొంతమంది విదేశీ విద్యార్థులకు ఒకసారి చెప్పారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన ఇద్దరు తీశారు. సినిమాటిక్‌ గా ఎక్సలెంట్‌ సినిమా అది. కానీ ప్రజలకు నచ్చలేదు. సో..అందరికీ నచ్చే విధంగా సఖి తీశారు. మళ్ళీ తేడా లేకుండా తీసే ప్రయత్నం అమృతలో చేశారు. సినిమాటిక్‌ గా బాగున్న చిత్రాలన్నీ ప్రేక్షకులకు నచ్చాలని రూలేం లేదు. మణిరత్నం తాజా చిత్రం అమృత కూడా అంతే. ప్రేక్షకులకు నచ్చే అవకాశాలు చాలా తక్కువ. సినిమా అంతా హార్డ్‌ హిట్టింగ్‌ గా ఉంది. అయితే, నచ్చడం, నచ్చకపోవడం అనేది పక్కన పెట్టి, సినిమాటిక్‌ గా దీన్ని సమీక్ష జరపకపోతే, ఒక క్రియేటర్‌ కృతికి అన్యాయం చేసినట్లే అవుతుంది. అందుకే ఈ సమీక్ష అంతా ఆ దృష్టితో చేసిందే...చిత్తగించండి.

    దేశ సమస్యలను తెరకెక్కించడం మణిరత్నం పద్దతి. అది ఆయన ఫిల్మ్‌ మేకింగ్‌ స్టైల్‌. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటూనే, వాస్తవానికి దగ్గరగా తీయాలన్నది ఆయన ప్రయత్నం. అమృత చిత్రం ద్వారా ఆయన రెండు అంశాలు ఎక్స్‌ పోజ్‌ చేయాలని ప్రయత్నించాడు. ఒకటి - రామేశ్వరం శరణార్థి శిబిరంలో జరుగుతున్న అవకతవకాల గురించి. ఆ శిబిరం బహిరంగ చెరసాలని చెప్పడం. రెండోది- స్వేఛ్ఛ కోసం పోరాడడంలో తప్పు లేదు కానీ అందులో బలవుతుంది బాలలే అని చెప్పడం. ఈ రెండు అంశాలు చెప్పడం కోసం అమృత అనే బాలికను కథగా ఎంచుకున్నాడు. చక్రవర్తి తమిళ ఈళం టెర్రరిస్ట్‌. నందితాదాస్‌ ను పెళ్ళి చేసుకుంటాడు. కానీ స్వేచ్ఛ కోసం ఆమెను వదిలి అడవుల్లోకి వెళుతాడు.

    రామేశ్వరం చేరుకొన్న నందితా- అక్కడ అమృతను కని వదిలి జాఫ్నా వెళుతుంది. ఇంజనీర్‌ కమ్‌ రైటరైన మాధవన్‌ ఈ పసిపాపను చూసి చలించిపోతాడు. పక్కింటి పిల్ల సిమ్రాన్‌ ను పెళ్ళిచేసుకొని, అమృతను దత్తత తీసుకుంటాడు. తొమ్మిదేళ్ళ తర్వాత అమృతకు నిజం చెప్పుతారు. అమృత సొంత తల్లిని చూడాలని పట్టుపడుతుంది. సో..వీరంతా కలిసి జాఫ్నాకు వెళ్ళి టెర్రరిస్ట్‌ లీడర్‌ గా మారిన నందితాను కలుస్తారు. కానీ 'స్వేచ్ఛ' వచ్చే వరకు తను మూమూలు జీవితాన్ని అనుభవించలేనని నందితా అమృతను స్వీకరించదు. ఇదే క్లైమాక్స్‌.

    కథ, కథనం బాగున్నా, డాక్యూడ్రామాలా తీయాలని ప్రయత్నించాడు. దాంతో ఎంతో మెలోడ్రామా. ఫోటోగ్రఫీ మాత్రం ఎక్స్‌లెంట్‌. రవి.కె.చంద్రన్‌ ప్రతి సీన్‌ ను పరిపూర్ణంగా చిత్రీకరించాడు. ఈ చిత్రంలో అనేక లోపాలూ ఉన్నాయి. ప్రధానంగా నందితదాస్‌ పాత్ర అసంపూర్ణంగా ఉంది. క్లైమాక్స్‌ మరీ పేలవంగా ఉంది. ప్రతి సమస్యకు ఒక సరైనా ముగింపు ఇచ్చినప్పుడే అతన్ని మంచి రచయిత అంటామని మణిరత్నం మాధవన్‌ తో ఓ డైలాగ్‌ చెప్పిస్తాడు. అంటే తను మంచి రైటర్‌ కాదని మణి స్వయంగా ఒప్పుకుంటున్నాడా?

    ఇక, ప్రకాష్‌ రాజ్‌ పాత్ర అనవసరమైనది. అంతకన్నా, ప్రకాష్‌ నటన చాలా ఇరిటేటింగ్‌ గా ఉంటుంది. ఒక సీన్‌ లో ఏడుపు ఎక్స్‌ ప్రెషన్‌ ఇవ్వాల్సిన సమయంలో ప్రకాష్‌ రాజు నవ్వుతున్నట్లుగా ఏడుస్తాడు. దాన్ని సరిగ్గా ఎడిట్‌ చేయలేకపోవడం శ్రీకర్‌ ప్రసాద్‌ చేసిన తప్పు. అందరికన్నా మాధవన్‌ నటన, బేబీ కీర్తన నటన బాగుంది. ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం సాధారణం. ఓవరాల్‌ గా ప్రేక్షకులకు బోర్‌. కొత్త దర్శకులు మాత్రం సినిమాటిక్‌ విలువల గురించి నేర్చుకోవచ్చు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X