కొందరివాడు

సినిమా: అందరివాడు
నటీనటులు: చిరంజీవి, టబు, రిమ్మీసేన్, రక్షిత, ప్రకాష్‌రాజ్,
సత్యనారాయణ, చంద్రమోహన్, బ్రహ్మానందం, అలీ, ఎంఎస్ నారాయణ,
సునీల్, వేణుమాధవ్, ధర్మవరపు సుబ్రమణ్యం, కృష్ణ భగవాన్ తదితరులు.
కథ: భూపతి రాజా
మాటలు: కోన వెంకట్
పాటలు: చంద్రబోస్, సాహితి, అనంత శ్రీరాం
కళ: అశోక్
కో డైరెక్టర్: గోపీచంద్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
కెమెరా: కబీర్‌లాల్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సి.నాగరాజు
నిర్మాత: అల్లు అరవింద్
దర్శకత్వం: శ్రీను వైట్ల
తన నుంచి ప్రేక్షకులు సందేశాలను ఎక్కువగా ఆశిస్తున్నందువల్ల దానికి చిన్న బ్రేక్ ఇవ్వాలన్న ఉద్దేశంతో చిరంజీవి నటించిన చిత్రం 'అందరివాడు'. టాగూర్, ఇంద్ర చిత్రాలు సందేశాత్మకం కావడంతో అటువంటి మరో చిత్రంలో నటించడం ప్రమాదకరమని మధ్యలో ఒక వెరైటీ సినిమా చేయాలని చిరంజీవి అనుకోవడం వల్ల ఈ సినిమా వచ్చింది. మొదటి పదిహేను నిముషాలు గొప్పగా ఉండి ప్రేక్షకుల ఎక్స్‌పెక్టేషన్లను పెంచుతుంది. కానీ ఆ గ్రిప్ ను కొనసాగించలేకపోవడంతో సినిమా చౌచౌగా ముగిసింది. కథనంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం సినిమాలోని పెద్ద లోపం.
కామెడీని నమ్ముకుంటే కాసులు గ్యారంటీ అన్న విషయాన్ని 'శంకర్‌దాదా' నిరూపించింది. దానికి కొనసాగింపుగా 'అందరివాడు'గా చిరంజీవి ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాను పూర్తి స్ధాయి కామెడీగా తీర్చిదిద్దాలన్న తాపత్రయంలో హీరో-విలన్ సంఘర్షణను విస్మరించారు. దీనితో సినిమా చూస్తున్నంత సేపూ నవ్వుతూ చూసినా బయటికి వచ్చేటప్పుడు సినిమాలో ఉన్న విషయమేమిటని ప్రేక్షకుడు ప్రశ్నించుకునే పరిస్ధితి ఏర్పడుతుంది.
కథ: గోవిందరాజులు (తండ్రి చిరంజీవి) గతంలో మేస్త్రీ. ప్రస్తుతం అందరి సమస్యలు తీరుస్తూ 'అందరివాడు' గా మన్ననలు అందుకుంటూ ఉంటాడు. అతనికి ఏకైక ముద్దుల కొడుకు సిద్ధార్ధ (కొడుకు చిరంజీవి) అంటే విపరీతమైన ప్రేమ. సిద్దార్ధకు తండ్రి అంటే ప్రేమ ఉన్నా ఆయన వ్యవహారశైలి నచ్చదు. తండ్రిని మార్చుదామని ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడు.
సిద్దార్ధ మన టీవీనైన్ లో లాగా సిసి టీవీ ఛానల్‌లో యాంకర్‌గా పనిచేస్తుంటాడు. ఒక రోజు ఆ సిటీ దాదా 'సత్తి పహిల్వాన్'ను ఇంటర్వ్యూ చేసి అతని అక్రమాలు బయటపెడతాడు. దానితో సత్తికి రావాల్సిన కాంట్రాక్టు చేజారిపోతుంది. అతడిని బ్లాక్‌లిస్టులో చేరుతాడు. ఆ కాంట్రాక్టు ప్రకాష్ రాజ్‌కు పోతుంది. అతను గోవిందరాజులు చిన్ననాటి స్నేహితుడు. మధ్యంతర సిరి రావడంతో గోవిందరాజులుని స్నేహితుడుగా చెప్పుకోడానికి ఇష్టపడడు. అనుకోకుండా తన కాంట్రాక్టు పనులకు గోవిందరాజులునే మేస్త్రీగా పెట్టుకుంటాడు. ఈలోపు ప్రకాష్‌రాజ్ కూతురు శ్వేత( రిమ్మీ సేన్) సిద్ధార్ధ ప్రేమలో పడుతుంది. తండ్రి రోజూ తాగుతూ దారి తప్పాడు కాబట్టి ఆయనకు మళ్ళీ పెళ్ళి చేయాలని సిద్దార్ధ అనుకుంటాడు. టబును ఒప్పించి తండ్రి పెళ్ళి జరిపిస్తాడు. ఈలోపు తన కొడుకు ప్రేమ విషయం తెలుసుకుని ప్రకాష్‌రాజ్ వద్దకు వెళ్ళి పిల్లను ఇవ్వమని అడుగుతాడు.
సత్తి యాదవ్ చేసిన హత్య కేసులో గోవిందరాజులు సాక్ష్యమివ్వడంతో, మళ్ళీ గొడవల్లో తలదూర్చాడని కొడుకు తండ్రికి దూరం కావడానికి ప్రయత్నించేటప్పుడు ఇంటర్వల్. తర్వాత కొడుకు చిరంజీవి అసలు విషయం తెలుసుకుంటాడు. నిశ్చితార్ధం రోజున ప్రకాష్‌రాజ్‌ని నిలదీసి తండ్రిని కౌగలించుకుంటాడు. తన తండ్రికి జరిగిన అవమానాన్ని శ్వేత భరించలేకపోతుంది. తండ్రీ కొడుకులిద్దరినీ విడదీస్తాననని శపధం చేస్తుంది. శ్వేత ప్లానులను గోవిందరాజులు ఎలా ఎదుర్కున్నాడు? సత్తియాదవ్ నుంచి తన కుంటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడన్నది తెరపై చూడాల్సిందే.
సాధారణంగా ద్విపాత్రాభినయ సినిమాల్లో పాత్రలు రెండూ విభిన్న దృక్పథాలతో ఉంటాయి. కానీ ఇక్కడ రెండు పాత్రల మౌలిక స్వభావం ఒక్కటే. రక్షిత పాత్ర కథకు ఏమాత్రం దోహదపడకుండా చీప్‌గా మిగిలిపోయింది. వయసుమీరిన గోవిందరాజులుకు కొడుకు టబును ఇచ్చి పెళ్ళి చేయడం కన్విన్సింగ్‌గా లేదు. టీవీ ఇంటర్వ్యూ తర్వాత సిద్ధార్ధ యాక్షన్‌లోకి దిగుతాడని ఆశించే ప్రేక్షకులకు నిరాశ కలుగుతుంది. సత్తియాదవ్ వర్క్ సైట్‌లో ఫైట్ తర్వాత ఆ విషయం కొనసాగకపోవడం స్క్రిప్టు లోపం. రెండు పాత్రల్లో దేనికీ లక్ష్యం లేకపోవడంతో స్క్రీన్‌ప్లే బిగి తగ్గింది. సిద్దార్ధ పాత్ర డమ్మీగా మిగిలిపోయింది. హీరోయిన్ పాత్ర ఒక్కసారిగా ప్రతి నాయకిగా మారిపోవడం కన్విన్సింగ్‌గా లేదు. ఈ సినిమా మనసుకు హాయి కలిగిస్తుందే కానీ హృదయాన్ని కదిలించేదిగా లేదు. భారీ సినిమాలకు హృదయాలను కదిలించే ఎలిమెంట్ లేకపోతే ఇక అంతే. రెండు పాటలు మినహా మిగాతావి బోర్.
అసభ్యత లేకుండా కామెడీని తీర్చిదిద్దడంతో ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులకు ఒకె. చాలా చోట్ల సిట్యుయేషన్ కామెడీ బాగుంది. ఎలుకతో కామెడీ సన్నివేశాలు 'మౌస్ హంట్' చిత్రాన్ని గుర్తుకు తెచ్చినా మంచి ప్రయోగం. సునీల్, బ్రహ్మానందం కొంచెం సేపు కన్పించినా బాగా నవ్వించారు. టైటిల్ సాంగ్, కెమెరా వర్క్ బాగున్నాయి. కాలక్షేపానికి చూడదగిన చిత్రం.


Click it and Unblock the Notifications











