Andhra King Taluka Movie Review: ఆంధ్రా కింగ్ తాలుకా మూవీ హిట్టా? ఫట్టా?
నటీనటులు: ఉపేంద్ర, రామ్ పోతినేని, భాగ్యశ్రీ భోర్సే, రావు రమేష్,మురశీ శర్మ, రాహుల్ రామకృష్ణ,తులసి, హర్షవర్దన్,రాజీవ్ కనకాల, వీటీవీ గణేష్ తదితరులు
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మహేష్ బాబు పీ
నిర్మాతలు:నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, టీ సిరీస్
మ్యూజిక్:వివేక్,మెర్విన్
సినిమాటోగ్రఫి:సిద్దార్థ్ నూని, జార్జ్ సీ విలియమ్స్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
రిలీజ్ డేట్: 2025-11-27
బాహ్య ప్రపంచానికి ఏ మాత్రం కనెక్టివిటీ లేని రాజమండ్రికి సమీపంలోని గోడపల్లి లంక గ్రామానికి చెందిన సాగర్ (రామ్ పోతినేని) ఆయన కుటుంబం (రావు రమేష్, తులసి) రకరకాలు వివక్ష గురవతారు. అలాంటి గ్రామానికి చెందిన సాగర్‌కు హీరో సూర్య కుమార్ మానసికంగా ఎంతో ధైర్యాన్ని ఇస్తాడు. తనకు నచ్చిన హీరోపై అభిమానం పెరిగి పెరిగి ఆరాధనగా మారుతుంది. తన హీరోనే ప్రపంచంగా సాగర్ మార్చుకొంటాడు. అలాంటి సాగర్ జీవితంలోకి మహలక్ష్మీ థియేటర్ ఒనర్ (మురళీ శర్మ) కూతురు మహాలక్ష్మీ (భాగ్యశ్రీ భోర్సే) ప్రవేశిస్తుంది. దాంతో మురళీ శర్మ వర్గం సాగర్‌ను టార్గెట్ చేస్తుంది. ఇలాంటి సమయంలో తన హీరో నటించే 100వ సినిమా నిర్మాత చేతులు ఎత్తేయడంతో ఆగిపోతుంది. సినిమా కంటిన్యూటీకి కావాల్సిన 3 కోట్ల పెట్టుబడిని సాగర్ ఖాతా నుంచి హీరో అకౌంట్‌లోకి జమ అవుతుంది. దాంతో సాగర్ ఎవరూ అంటూ హీరో సూర్య బయలుదేరుతాడు.

సాగర్ తన బాల్యంలో ఎలాంటి వివక్షకు గురయ్యాడు? సమాజం పరిస్థితులు సాగర్‌ను ఎలా రాటదేల్చాయి? ఆంధ్రా కింగ్ అని హీరో సూర్యకు పేరు రావడం వెనుక కథేంటి? మహాలక్ష్మీతో ప్రేమ ఎలాంటి ఇబ్బందులకు గురి చేసింది. మహాలక్ష్మీ థియేటర్ ఓనర్ ఆగ్రహానికి సాగర్ గురైన తీరు ఏంటి? ఆంధ్రా కింగ్ సూర్య 100 సినిమా ఆగిపొవడానికి కారణం ఏమిటి? 3 కోట్లు సంపాదించడానికి స్టార్ హీరో ఎలాంటి కష్టాల పడ్డాడు? సినిమా టికెట్ డబ్బులు లేని సాగర్ తన హీరో కోసం 3 కోట్ల రూపాయలు ఎలా తెచ్చాడు? హీరో సూర్యకు సాగర్ గురించి తెలిసి నిజాలు ఏమిటి? సాగర్‌ను హీరో సూర్య కలిశాడా? అనేది ఆంధ్రా కింగ్ తాలుకా సినిమా కథ.
సాధారణంగా సినిమా హీరోలకు లక్షలాది మంది ఫ్యాన్స్ ఉండటం సహజం. కానీ ఆ ఫ్యాన్స్ ఎవరో సదరు హీరోలకు తెలియదు. కానీ ఎలాంటి పరిచయం లేని హీరో కోసం అభిమానుల పెద్ద త్యాగాలకు ఒడిగడుతుంటారు. బ్యానర్లు కట్టడం నుంచి కలెక్షన్లను పెంచడం వరకు సొంతంగా ఖర్చు పెట్టేసుకొంటారు. తమ హీరోలతో అభిమానుల ఎమోషనల్ బాండింగ్ అలాంటిది. ఇలాంటి పాయింట్‌ను దర్శకుడు మహేష్ బాబు పట్టుకోవడం నిజంగా కొత్త థీమ్. తన హీరో కోసం ఎంతకైనా తెగించే అభిమాని బయోపిక్ చుట్టూ అల్లుకొన్న సబ్ ప్లాట్ సరిగా లేకపోవడం సినిమా డీలా పడిపోయినట్టు కనిపిస్తుంది. రొటీన్ రూరల్ ఫ్యాన్ వార్, రెగ్యులర్ లవ్ స్టోరి మంచి పాయింట్‌ను దెబ్బతీశాయి. ఈ సినిమాకు పెద్ద మైనస్ 100 సినిమాల స్టార్ హీరోగా, ఆంధ్రా కింగ్‌గా కన్నడ హీరో ఉపేంద్ర ఎంపికే బ్లండర్ అనిపించింది. చిరంజీవిని తీసుకెళ్లి తమిళ కింగ్ అంటే.. బాలకృష్ణను తీసుకెళ్లి కన్నడ కింగ్ అని, వెంకటేష్‌ను తీసుకెళ్లి మలయాళ కింగ్, నాగార్జున తీసుకెళ్లి బాలీవుడ్ కింగ్ అంటే ఆ ప్రాంత ప్రేక్షకులు రిజెక్ట్ చేయడం అత్యంత సహజం. స్టార్ హీరో స్ట్రగుల్స్ ఎమోషనల్‌గా మార్చలేకపోయాయి. ఇదే ఈ సినిమాకు బేసిక్ మిస్టేక్.
ఫస్టాఫ్ విషయానికి వస్తే.. కొన్ని మంచి సీన్లు, కొన్ని చెత్త సీన్లతో పడుతూ లేస్తూ సినిమా ముందుకెళ్తుంది. సాగర్ బాల్యం ఎపిసోడ్స్ కదిలించే విధంగా రాసిన దర్శకుడు.. కొన్నీ సీన్లను పేలవంగా రాశాడనిపిస్తుంది. కథలో 3 కోట్లు సాగర్ ఎలా హీరోకు చేరవేశాడనే ట్విస్టు చుట్టే నడిచే కథ.. సాగదీసి సాగదీసి చెప్పినట్టు ఉంటుంది. ఫస్టాఫ్ అనవసరమైన సీన్లతో చాలా ల్యాగ్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్‌లోనైనా ఏమైనా కొత్తదనం ఉంటుందా? అని చూసిన ప్రేక్షకుడికి కొంత నిరాశ మిగులుతుంది. కొన్ని ఎమోషనల్ సీన్ల తప్పా.. కథను క్లైమాక్స్ బలంగా సాగదీసిట్టు అనిపిస్తుంది. ఇలాంటి లోపాలున్న సినిమాను రామ్ పోతినేని ఒంటిచేత్తో ఒంటరిపోరాటం చేసిన తీరే హ్యాట్సాఫ్ అని చెప్పాలి.
రామ్ పోతినేని గురించి కొత్తగా చెప్పాల్సి ఏముంటుంది? తన టాలెంట్ ఏమిటో, తాను చేసిన సినిమాలే చెబుతాయి. ఇక సాగర్ పాత్రలో రామ్ జీవించాడు. సగటు ఫ్యాన్ బాడీ లాంగ్వేజ్‌ను పక్కాగా పట్టుకొని అందులో జీవించాడు. పక్కింటి కుర్రాడి పాత్రలో చెలరేగిపోయాడు. పేలవమైన లవ్ ట్రాక్‌లోను భాగ్యశ్రీతో కెమిస్ట్రీని బాగానే పండించాడు. మురళీశర్మతో పోటీపోటీగా నటించాడు. రావు రమేష్ ఈ సినిమా ఎమోషనల్ పాయింట్. శ్రీరాముడి గురించి చెప్పే ఎపిసోడ్‌లో రావు రమేష్ కీలకంగా వ్యవహరించాడు. భాగ్యశ్రీ భోర్సేకు ఈ సినిమా ఎలాంటి ప్లస్ ఇవ్వకపోవచ్చు. ఆమె నటించడానికి స్కోప్‌లేని పాత్రలో కనిపించింది. గ్లామర్‌కు మాత్రమే పరిమితమైంది. రాహుల్ రామకృష్ణ, ఇతర పాత్రల్లో నటించిన వారాంత ఫర్వాలేనిపించారు.
ఈ సినిమాకు కథ, కథనాలను టెక్నికల్ డిపార్ట్‌మెంట్ డామినేట్ చేశాయి. ముఖ్యంగా సిద్దార్థ్ నూని, జార్జ్ సీ విలియమ్స్ అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. గోదావరి లంక ప్రాంతాల స్థితిగతులను బాగా చూపించారు. క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ సినిమా రేంజ్ పెంచింది. వివేక్,మెర్విన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు ఫ్రెష్‌నెస్ తెచ్చిపెట్టింది. ఎందుకో గానీ.. క్యారెక్టర్లను బ్యాలెన్స్ చేయడంలో శ్రీకర్ ప్రసాద్ తంటాలు పడినట్టు కనిపించింది. ఎన్నో గొప్ప సినిమాలు అందించిన ఆయన ఇంత ల్యాగ్‌గా సినిమా కట్ చేయడం ఆశ్చర్యం వేస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ డబ్బు పెట్టడమే కాకుండా కథ, కథనాలపై కూడా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చేసింది.
ఓవరాల్‌గా ఈ సినిమా గురించి చెప్పాలంటే.. ఎమోషనల్ ఫ్యాన్స్ బయోపిక్ ప్రజెంట్ చేయాలనుకొన్నారు. ఆ విషయంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోయారు. ఫస్టాఫ్ ఈ సినిమాను పూర్తిగా వెనక్కి లాగేసింది. సెకండాఫ్ ముందుకెళ్లడానికి చేసిన ప్రయత్నాలకు కొన్ని సీన్లు బ్రేక్ వేశాయి. ఓవరాల్ యావరేజ్ సినిమా. ఎక్కువగా ఊహించుకొని వెళ్లకండి.. రామ్ పోతినేని కోసం మాత్రమే ఈ సినిమా చూడొచ్చు. సగటు సినిమా ఫ్యాన్ కనెక్ట్ అవ్వడంపైనే ఈ సినిమా విజయవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ సినిమా బాక్సాఫీస్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











