twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంజి- గ్రాఫిక్స్‌ మాయాజాలం

    By Staff
    |

    Anji
    -జలపతి గూడెల్లి
    చిత్రం: అంజి
    నటీనటులు: చిరంజీవి, నమ్రతా శిరోడ్కర్‌, టినూ ఆనంద్‌,
    రమ్యకృష్ణ, రీమాసేన్‌, తదితరులు
    సంగీతం: మణిశర్మ
    నిర్మాత: శ్యాంప్రసాద్‌రెడ్డి
    దర్శకత్వం: కోడి రామకృష్ణ

    'అంజి' చిరంజీవి చిత్రం కాదు. ఇది పూర్తిగా సాంకేతిక నిపుణుల చిత్రం. అత్యద్భుతమైన గ్రాఫిక్స్‌, గొప్ప ఆర్ట్‌ వర్క్‌, అబ్బురపరిచే విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఈ చిత్రంలో ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. ప్రధానంగా ఇది ఫాంటసీ చిత్రం కావడంతో సినిమా ప్రారంభాన్నే ఆ విధంగా మొదలుపెట్టారు. ప్రారంభంలోనే గ్రాఫిక్స్‌ మాయాజాలంతో సినిమాను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన దర్శకుడు (పేరుకు కోడి రామకృష్ణే ఐనా అంతా శ్యాంప్రసాద్‌ రెడ్డి తీశాడు) సినిమా అంతా వాటినే ప్రధానంగా వాడుకున్నారు.

    క్లైమాక్స్‌ లో వచ్చే గ్రాఫికల్‌ వర్క్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. అయితే, ఈ సినిమాలో ప్రధాన లోపం - వినోదం లేకపోవడమే. తెలుగు చిత్రాల్లోనూ గొప్ప గ్రాఫిక్స్‌ పెట్టొచ్చు అనే అంశంతో సినిమా తీసినట్టుగా ఉంది. అది సమస్య. దానివల్ల సినిమా మధ్యలో ఎక్కువసేపు విసుగు వస్తుంది. కానీ చివర్లో మళ్లీ క్లైమాక్స్‌ లో ఆ 'విసుగు ఫ్యాక్టర్‌'ను తగ్గించారు. చిరంజీవి మాస్‌ అభిమానులకు ఇది పెద్దగా నచ్చకపోవచ్చు.

    ఎందుకంటే ఇందులో మాస్‌ ఎలిమెంట్స్‌ (ఒక 'మిరపకాయ బజ్జీ సాంగ్‌ మినహా) పెద్దగా లేవు. ఏడేళ్ళ పాటు నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రంలో చిరంజీవి ఒక్కో పాటలో ఒక్కో తీరుగా కన్పించినా, ప్రధాన కథనంలో మాత్రం 'కంటిన్యూటీ' సమస్య లేదు. స్థూలంగా చెప్పాలంటే..టెక్నికల్‌ ప్రతిభను చూసి మెచ్చుకునే వాళ్ళకు ఈ సినిమా నచ్చుతుంది. చిరంజీవి చిత్రాల మాస్‌ వినోదం కావాలనువారికి నచ్చదు.

    నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి కథనంపై దృష్టి పెడితే బాగుండేది. గ్రాఫిక్స్‌ కోసం అంతగా శ్రమించిన శ్యాం..దానికి తగ్గ స్క్రీన్‌ ప్లేను రూపొందించుకోలేకపోయాడు. ప్రధానంగా కథ, కథనంలోపం. ఇందులో బాగా హైలెట్‌ అయినవి అశోక్‌ ఆర్ట్‌ డైరక్షన్‌, ఛోటా స్పెండిడ్‌ ఫోటోగ్రఫీ, మినియేచర్‌ ఆర్ట్‌ రూపొందించిన కళాకారుడి పనితనం, విజువల్‌ ఎఫెక్ట్స్‌ నిపుణుల శ్రమ. చివర్లో ఆకాశగంగను రప్పించే దృశ్యాల చిత్రీకరణ, శివుడు ఆప్టికల్‌ రూపం సినిమాకు హైలెట్‌ అని చెప్పాలి.

    నిజానికి, చిరంజీవి ఇమేజ్‌ ఈ సినిమాకు ప్రతిబంధకమే. ఐనా, చిరంజీవి ఫర్వాలేదనిపించాడు. నమ్రతాశిరోడ్కర్‌ ఒకే. మాస్‌ను ఆకర్షించిన 'మిరపకాయకాయ బజ్జీ ...' పాటను ముందు వేరే పాటతో చిత్రీకరించి తర్వాత ఈ పాట పెట్టినట్లుగా ఉంది. లిప్‌ సింక్‌ వల్ల అది బయటపడింది. ఇక టినూ ఆనంద్‌ తనదైన స్టైల్‌లో చేసిన ఆయన డైలాగ్‌ డెలివరీలో లిప్‌సింక్‌ కాలేదు.

    సినిమాకు మరో లోపం 'కాల పరీక్ష'కు అందకపోవడం. కథ ప్రకారం ఇది ఉరవకొండ అనే ప్రాంతంలో 1995వ సంవత్సరంలో జరుగుతుంది. కానీ చుట్టూ కల్పించిన వాతావరణం, సీన్సు ఎప్పుడో పురాతన కాలంలో ఉన్నట్లుగా, అదీ 'మృగరాజు' చిత్రం వాసనలు కన్పించాయి. మణిశర్మ రీరికార్డింగ్‌ చాలా బాగుంది. మొత్తానికి సాంకేతిక నిపుణల ప్రతిభ పుష్కలంగా కన్పించే చిత్రం ఇది.

    కథ: భూమి మీద ఉండిపోయిన ఆత్మలింగం కోసం ఒక ప్రోఫెషర్‌ రీసేర్చ్‌ చేస్తుంటాడు. అమెరికాలో ఉండే ఒ ధనవంతడు భాటియా..దాన్ని పొంది అమరత్వం పొందాలని ప్రయత్నిస్తాడు. అందుకోసం..ఈ ప్రోఫెషర్‌ను చంపేస్తాడు. ప్రోఫెషర్‌ను వెతుక్కుంటూ ఆంధ్రప్రదేశ్‌లోని ఉరవకొండకు ఆయన శిశ్యురాలు స్వప్న (నమ్రతా) వస్తుంది. ఇక్కడ ఉండే యువకుడు అంజికి స్వప్న పరిచయం అవుతుంది.

    ఆమె ప్రోపెషర్‌ రాసిన డైరీ గురించి చెపుతుంది. కారణజన్ముడైన అంజికి ఆత్మలింగం లభిస్తుంది. దాన్ని గంగానదిలో వదలాలని భావిస్తుండగా, భాటియా వచ్చి అంజితో ఉండే పిల్లలను కిడ్నాప్‌ చేసి ఆకాశగంగను రప్పించేలా చేస్తాడు. చివరికి అంజి భాటియాను అంతమొందించి ఆ ఆత్మలింగాన్ని హిమాలయాల్లో వదలడంతో కథ ముగుస్తుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X