Anni Manchi Sakunamule Review స్లోగా సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అన్ని మంచి శకునములే
నటీనటులు: సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, గౌతమి, వాసుకి, రావు రమేష్, నరేష్, షావుకారు జానకి, ఊర్వశి, వెన్నెల కిషోర్ తదితరులు
దర్శకత్వం: బీవీ నందినీ రెడ్డి
స్క్రీన్ ప్లే: షేక్ దావూద్
డైలాగ్స్: లక్ష్మీ భూపాల
సినిమాటోగ్రఫి: సన్నీ కురపాటి, రిచర్డ్ ప్రసాద్
ఎడిటింగ్: జునైద్ సిద్దిఖీ
మ్యూజిక్: మిక్కి జే మేయర్
బ్యానర్: స్వప్న సినిమా, మిత్రవిందా మూవీస్
రిలీజ్ డేట్: 2023-05-18
అన్ని మంచి శకునములే కథ:బ్రిటీష్ ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన కాఫీ తోటలు, కంపెనీకి సంబంధించి వారసత్వంగా వచ్చే ఆస్తుల విషయంలో ప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్), దివాకర్ (రావు రమేష్) కోర్టుకు ఎక్కుతారు. ఇదిలా ఉండగా డాక్టర్ సుధాకర్ (వీకే నరేష్) కూతురు ఆర్య (మాళవిక నాయర్), ప్రసాద్ కుమారుడు రిషి చిన్ననాటి స్నేహితులు. చిన్నప్పటి నుంచే ఆర్య అంటే తన ప్రాణం కంటే మిన్నగా రిషి ఇష్టపడుతాడు. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌గా పెరిగిన వారిద్దరూ ఇటలీ ట్రిప్ వెళ్తారు. అక్కడ చిన్న ఇష్యూ కారణంగా రిషి, ఆర్య మధ్య బ్రేకప్ జరుగుతుంది.
అన్ని మంచి శకునములే కథలో ట్విస్టులు:30 ఏళ్లకుపైగా కోర్టులో కొనసాగుతున్న కాఫీ తోటల వివాదానికి ఎలాంటి పరిష్కారం లభించింది. రిషి, ఆర్య పుట్టుక మధ్య కథలో చోటు చేసుకొన్న ట్విస్ట్ ఏమిటి? ఆర్య, రిషి ఎందుకు విడిపోయారు? ఆర్య చేసే పనులు తండ్రికి ఎందుకు నచ్చవు? ఆర్య, తండ్రి ప్రసాద్ మధ్య విభేదాలకు కారణాలు ఏమిటి? చివరకు ఆర్య, రిషి ప్రేమకు ఎలాంటి ముగింపు లభించిందనే ప్రశ్నలకు సమాధానమే అన్ని మంచి శకునములే సినిమా కథ.

మూవీ ఎలా సాగిందంటే? :సాధారణంగా ఎలాంటి ఫ్యామిలీ డ్రామాకైనా, లేదా లవ్ స్టోరికైనా పెద్దగా కథలో ఊహించని మలుపులు ఆశించడం అత్యాశే అవుతుంది. అయితే ఇలాంటి కథ ఎలా సాగింది? కొత్తగా ఎలాంటి కథనాన్ని డిజైన్ చేశారు. స్టోరి డిస్టినేషన్ చేరడానికి పాత్రలు ఎంత స్ట్రాంగ్‌గా బిహేవ్ చేశాయనేది సక్సెస్‌కు కారణమవుతాయి. అయితే అన్నీ మంచి శకునములే సినిమాలో కొత్తదనం గానీ, ఎమోషనల్ పాయింట్స్ కానీ కనిపించవు. సినిమా మొత్తం మీద క్లైమాక్స్ తప్పితే.. మిగితాదంతా రొటీన్, రెగ్యులర్, రొడ్డ కొట్టుడు స్క్రీన్ ప్లేనే అని చెప్పవచ్చు.

సంతోష్ శోభన్ గురించి:ఎంత పాత కథనైనా కొత్త ప్యాకేజ్‌తో వచ్చేటప్పుడు తెర మీద పాత్రలు ఎన్ని ఉన్నాయనే కంటే.. ఉన్న రెండు పాత్రలైనా బలంగా, ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేసేలా ఉండాయి. తెర మీద పాత్రలన్నింటిని తీసుకొచ్చి.. ఏ పాత్రను సరిగా డిజైన్ చేయలేక.. వాటికి అన్యాయం చేస్తే ఎలా ఉంటుందో అనేది అన్ని మంచి శకునములే చూస్తే తెలుస్తుంది. ఈ సినిమా చూసిన తర్వాత సంతోష్ శోభన్ గురించి ఆలోచిస్తేనే అయ్యో పాపం అనిపిస్తుంది. పుష్కలంగా ప్రతిభ ఉన్నప్పటికీ.. సరైన కథలను ఎంచుకోలేకపోతే ఇలాంటి ఫలితమే పొందాల్సి వస్తుందనేది సంతోష్ శోభన్ తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు.

మిగితా పాత్రల్లో ఎవరెవరంటే? :రిషిగా సంతోష్ శోభన్ నటన పరంగా పెద్దగా ఆకట్టుకొనే అంశాలు కనిపించవు. తన పాత్ర పరిధి మేరకు న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. ఇక మాళవిక నాయర్ పరిస్థితి కూడా అంతే కనిపిస్తుంది. గౌతమి, వాసుకి చాలా రోజుల తర్వాత తెలుగు తెర మీద కనిపించారు. కానీ వారి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం కనిపించదు. ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోయిందని చెప్పవచ్చు. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, వీకే నరేష్ అందరూ రొటీన్ పాత్రలకే పరిమితమయ్యారు. వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ తమ కామెడీతో ఫర్వాలేదనిపిస్తారు.

సాంకేతిక అంశాల గురించి :అన్ని మంచి శకునములే సినిమా సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ మూవీకి మిక్కి జే మేయర్ మ్యూజిక్ ప్లస్ పాయింట్. బ్యాక్ గ్రౌండ్ స్కోరు మాత్రం పలు సీన్లను చాలా ఎలివేట్ చేసింది. తెర మీద పాటలు చాలా దారుణంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫి కూడా సినిమాను ఆహ్లాదకరంగా మార్చింది. కథ, కథనాల్లో ఆకట్టుకొనే విషయం లేకపోవడం వల్ల సినిమా నిడివి చాలా ఎక్కువగా అనిపిస్తుంది. దాదాపు 15 నిమిషాల సినిమాను తగ్గిస్తే.. కొంత ఫీల్ పెరిగే అవకాశం ఉంది.

ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఎలా ఉన్నాయంటే? :వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా, మిత్ర విందా బ్యానర్లకు తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గౌరవం ఉంది. ఇటీవల కాలంలో మహానటి, సీతారామం సినిమాలు ఆ బ్యానర్ల ప్రతిష్టను పెంచాయి. అలాంటి బ్యానర్‌లో వచ్చిన అన్ని మంచి శకునములే తీవ్రమైన నిరాశను కలిగించిందనే చెప్పాలి. మంచి కాస్టింగ్, లొకేషన్లు, ప్రొడక్షన్ వ్యాల్యూస్ అన్నీ బూడిదలో పోసిన పన్నీరుగానే అనిపిస్తాయి. తమ బ్యానర్ ప్రతిష్టను గుర్తించి మంచి సినిమాలు చేయడానికి, కథ, కథనాల విషయంలో జాగ్రత్త పడాల్సిన సమయం ఆసన్నమైందని అన్ని మంచి శకునములే సినిమా ఓ సంకేతాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.

ఫైనల్‌గా ఎలా ఉందంటే? :ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, బంధాలు, అనుబంధాలకు ఆస్కారం ఉన్న చిత్రం అన్ని మంచి శకునములే. కానీ అలాంటివేవీ కనిపించని రెగ్యులర్, రొటీన్ చిత్రంగా అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్, భావోద్వేగమైన సన్నివేశాలు కనిపించవు. చాలా స్లోగా సాగడమే కాకుండా సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అందించాలనే మంచి ప్రయత్నం మిస్ ఫైర్ అయిందని చెప్పవచ్చు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చడానికి కొన్ని అంశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











