'అనుకోకుండా ఒకరోజు'- సమీక్ష

విడుదల తేదీ: జూన్ 30
నటీనటులు: చార్మి, జగపతిబాబు, శశాంక్, పవన్ మల్హోత్రా,
హర్షవర్దన్, నర్సింగ్ యాదవ్, పూజా భారతి, జగ్గారావు, శివనారాయణ,
రవిప్రకాష్, వాసు ఇంటూరి, సంద్ర, జయలక్ష్మి, బేబి రూపిక తదితరులు
సినిమాటోగ్రఫీ: సర్వేష్ మురారి
స్టంట్స్: రమణ
ఎడిటింగ్: మోహన్, రామారావు
కళ: రవీందర్ ఆర్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఊర్మిళ గున్నం
నిర్మాతలు: గంగరాజు గున్నం, వెంకట్ డేగా
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చంద్ర శేఖర్ ఏలేటి
'ఐతే' సినిమాతో ప్రయోగాత్మక దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఏలేట చంద్రశేఖర్, నిర్మాత గుణ్ణం గంగరాజు మళ్ళీ చేసిన ప్రయోగం 'అనుకోకుండా ఒక రోజు'. తొలి చిత్రానికి వచ్చినన్ని మార్కులు ఈ సినిమాకు రాలేదు. ఒక ఇన్వెస్టిగేషన్ రిపోర్టులా సాగిన ఈ సినిమా ఆర్బన్ యూత్ ఆదరణ మాత్రమే పొందగలదు.
కథ: అనుకోకుండా ఒక రోజు సహస్ర అనే ఒకమ్మాయి జీవితంలో ఏం జరిగిందన్నదే ఈ సినిమా కథ. సహస్ర (చార్మి) సింగర్ కావాలనే లక్ష్యం గల స్టూడెంట్. కుటుంబం మొత్తం తిరుపతి వెళ్ళడంతో ఓ మూడు రోజులు ఇంటి పట్టునే ఉండాల్సి వస్తుంది. ఆమెకు తోడుగా ఒక స్నేహితురాలు ఇంటికి వస్తుంది. ఆమె తన బాయ్ ఫ్రెండ్ బర్త్‌డేకు సహస్రను బలవంతంగా తీసుకెళ్తుంది. ఆ పార్టీలో కూల్‌డ్రింక్‌లో డ్రగ్ కలిపి సహస్రకు ఆఫర్ చేస్తారు. ఆమె మైకంలోకి వెళ్తుంది. ఆ రాత్రంతా మైకంలో ఆమె చేసిన పనులు ఆమెను ఆ తర్వాత వెంటాడుతుంటాయి. ఓ టాక్సీ డ్రైవర్ (శశాంక్) ఆమె వెంట పడుతుంటాడు. కొంత మంది చంపడానికి ప్రయత్నిస్తుంటారు. సరిగ్గా ఆ సమయంలో సురేష్‌రెడ్డి (జగపతిబాబు) అనే పోలీసాఫీసర్ ఆమెకు సహాయపడి, ఆమెను ఆపద నుంచి రక్షిస్తాడు. ఇంతకీ ఆ రాత్రి ఏంజరిగింది? మిస్టరీని సురేష్ రెడ్డి ఎలా ఛేదించాడన్నది తెర మీద చూడాల్సిందే.
సినిమా ఫస్టాఫ్ మొత్తం సహస్రపై జరిగే దాడులతో ఆసక్తికరంగా ఉంటుంది. పాత్రలను పరిచయం చేసి వాటిని ఉపయోగించుకున్న తీరు బావుంది. ఏ క్యారక్టర్‌ని వృధా పోనివ్వలేదు. ఛార్మి అమాయకంగా ఆపదలో చిక్కుకున్న అమ్మాయిలా బాగా నటించింది. జగపతిబాబుకు ఇలాంటి క్యారక్టర్లు కొట్టినపిండి. కీరవాణి సంగీతం హృదయరంజకంగా ఉంది. కొన్ని చోట్ల మాటలు బాగున్నాయి. ప్రతి దృశ్యంలోనూ దర్శకుడి ప్రతిభ కన్పిస్తుంది.
చివర్లో సస్పెన్స్‌ను బయటపెట్టే చిత్రాలకు రిపీట్ ఆడియన్స్ ఉండరు. స్క్రిప్టు మొత్తం ఒక రిపోర్టులా ఉంది. డ్రగ్స్‌తో మొదలైన కథ చివరికి మంత్రాలు, తంత్రాల వద్ద తేలుతుంది. కథ కొంత నడిచే సరికి హీరోయిన్ బేలగా మారి చేష్టలుడిగి పోవడంతో ఆమెలో లీనమై సినిమా చూస్తున్న ప్రేక్షకులకు అసహనం కలుగుతుంది. సినిమాలో ఒక రౌడీ గ్రూపు సహస్రను వెంటాడుతున్నట్టు చూపారే గానీ ఎందుకు వెంటాడుతున్నారో ఎక్కడా చెప్పకపోవడం స్క్రిప్టు లోపం. చివరిలో ఆపద ఉందని తెలిసి కూడా చార్మి తాంత్రికుల డెన్ వద్దకు ఎందుకు వెళ్తుందన్నది అర్ధం కాదు.


Click it and Unblock the Notifications











