Arabia Kadali Web Series Review: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: సత్యదేవ్, ఆనంది, నాజర్, రవివర్మ, పూనమ్ బజ్వా, అమిత్ తివారీ, దలీప్ తాహిల్, రఘు బాబు, అలోక్ జైన్, ప్రత్యూష తదితరులు
దర్శకత్వం: వీవీ సూర్య కుమార్
క్రియేటివ్ డైరెక్టర్: క్రిష్ జాగర్లమూడి
నిర్మాతలు: వై రాజీవ్ రెడ్డి, జే సాయిబాబు
మ్యూజిక్: నాగవెల్లి విద్యాసాగర్
సినిమాటోగ్రాఫర్: సమీర్ రెడ్డి
ఎడిటర్: చాణక్య రెడ్డి తూరుపు
ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీ రిలీజ్ డేట్: 2025-08-08
విశాఖలోని భీమిలిపట్నంకు చెందిన చేపలవాడకు చెందిన నురగల బదిరి (సత్యదేవ్) మత్స్యకార కుటుంబానికి చెందిన వాడు. ఉన్నత చదువుల చదువుకొన్న యువకుడు తన పక్క గ్రామం మత్స్యవాడకు చెందిన గంగ (ఆనంది) ప్రేమలో ఉంటాడు. కుటుంబ వృత్తిలో భాగంగా గుజరాత్‌కు వెళ్లి చేపల వేటను కొనసాగిస్తుంటాడు. ఈ క్రమంలో అరేబియా సముద్రంలో నిబంధనలను ఉల్లంఘించి సత్యదేవ్ తన సహచరుల మత్స్యకారులతో కలిసి పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లి వారికి పట్టుబడుతారు. తన ప్రియుడు పాకిస్తాన్‌లో చిక్కుపడిపోయాడనే విషయం తెలుసుకొన్న గంగ అతడిని విడిపించుకొనేందుకు ప్రయత్నాలు చేపడుతుంది
బదిరి, గంగ ప్రేమకు పెద్దలు ఎందుకు అభ్యంతరం చెప్పారు? వారి ప్రేమ బంధానికి ఎలాంటి ఆటంకాలు కలిగాయి. విశాఖపట్నం తీర ప్రాంతం నుంచి వెళ్లి గుజరాత్‌లో ఎందుకు చేపల వేట కొనసాగించాల్సి వచ్చింది? పాకిస్థాన్ అధికారులకు చిక్కిన బదిరి బృందం ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు? గంగ ప్రయత్నాలు ఎలా కొనసాగాయి. బదిరిని విడిపించే విషయంలో దౌత్య అధికారులకు, మత్య్సకార కుటుంబాలకు మధ్య డ్రామా ఎలా జరిగింది? బదిరి, గంగ ప్రేమకథ సుఖాంతం అయిందా? అనే ప్రశ్నలకు సమాధానమే అరేబియా కడలి వెబ్ సిరీస్ కథ.

అరేబియా కడలి కథ వినడానికి, బుల్లితెరపై చూడటానికి ఇటీవల వచ్చిన తండేల్‌లా ఉంటుంది. కానీ అందులో చూపించలేని భావోద్వేగాలు, జీవనోపాధి కోసం పడే మత్స్యకారుల వెతలు, హృదయాన్ని తట్టి లేపే ఎన్నో సంఘటనలు ఈ వెబ్ సిరీస్‌ను ప్రత్యేకంగా చేసిందనే ఫీలింగ్ కలుగుతుంది. క్రిష్ సహకారంతో సూర్య కుమార్ ఈ కథను అత్యంత సహజంగా నడిపించడం ఈ సిరీస్‌కు స్పెషల్ ఎట్రాక్షన్. తొలి చిత్ర దర్శకుడిగా సూర్య కుమార్ చూపించిన ప్రతిభ, నటీనటుల నుంచి రాబట్టుకొన్న పెర్ఫార్మెన్స్, పాత్రలను డిజైన్ చేసిన విధానం హైలెట్ అనిపిస్తాయి.
దేశం ఏదైనా కానీ.. మత్య్సకారుల జీవనోపాధికి అడ్డంకిగా మారే నిబంధనలు, అరకొర సౌకర్యాలు ఆలోచింపచేస్తాయి. క్రిష్ చెప్పినట్టు.. సముద్రంలో తిరిగే జంతువులకు సరిహద్దులు లేనప్పుడు.. మనషులకు ఎందుకు సరిహద్దులు? వారికే ఎందుకు నిబంధనలు అనే ప్రశ్న మదిలో మెదులుతుంది. వారి జీవితాలపై సానుభూతి కలిగేలా ఈ వెబ్ సిరీస్ సన్నివేశాలు మనసులను కదిలిస్తాయి. కథాపరంగా, స్క్రీన్ ప్లే పరంగా, నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకొన్నప్పటికీ.. సాంకేతికంగా ఈ సినిమాలో కొంత మేరకు లోపాలు కనిపిస్తాయి. వీఎఫ్ఎక్స్ తదితర అంశాలపై ఇంకాస్త దృష్టిపెట్టాల్సి ఉండేదనిపిస్తుంది.
ప్రతిభావంతులైన నటీనటుల ఎంపిక ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచిందని చెప్పాలి. సత్యదేవ్, ఆనంది నటన గురించి కొత్తగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. సత్యదేవ్ నేచురల్‌గా నటించారనడం కంటే.. పాత్రలో ఒదిగిపోయి సన్నివేశాలకు తగినట్టుగా బిహేవ్ చేశారు. ఆనంది కూడా తనకు లభించిన ఎమోషనల్, పవర్‌పుల్ రోల్‌కు పూర్తి న్యాయం చేసింది. నాజర్, రవివర్మ, పూనమ్ బజ్వా, అమిత్ తివారీ, దలీప్ తాహిల్, రఘు బాబు, అలోక్ జైన్, ప్రత్యూష ఇంకా అందరూ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. చాలా ఎపిసోడ్‌లో క్రియేటివ్ డైరెక్టర్‌గా క్రిష్ మార్కు పక్కాగా కనిపిస్తుంది. ఈ కథలో ఆయన విజన్ యాడెడ్ అడ్వాంటేజ్‌గా మారింది. సమీర్ రెడ్డి ఈ సినిమాను కలర్‌ఫుల్ పెయింటింగ్‌లా మార్చారు. విద్యాసాగర్ మ్యూజిక్ బాగుంది. వెబ్ సిరీస్ కాబట్టి చాణక్య రెడ్డికి సన్నివేశాల పేర్చడంలో స్వేచ్ఛ బాగానే లభించిందనే ఫిలింగ్ కలుగుతుంది. వై రాజీవ్ రెడ్డి, జే సాయిబాబు అనుసరించిన నిర్మాణ విలువలు, మేకింగ్‌లో అమెజాన్ ప్రైమ్ స్టాండర్డ్స్ పక్కాగా కనిపించాయి.
అరేబియా కడలి విషయానికి వస్తే.. మత్స్యకారుల కష్టాలు, కన్నీలు, వారి జీవితాల్లో ఉండే భావోద్వేగాలన్నీ కలబోసిన ప్రేమ కథ. దేశభక్తిని పురిగొల్పే ఎమోషన్స్, యాక్షన్ అంశాలు అలరిస్తాయి. ముఖ్యంగా నటీనటులు పెర్ఫార్మెన్స్ ఆకట్టుకొంటుంది. వెబ్ సిరీస్ అంటే అశ్లీలత, అసభ్యత రాజ్యమేలుతున్న ఈ తరుణంలో ఓటీటీలో స్వచ్ఛమైన, నిజాయితీతో కూడిన తెలుగు కథ. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నది. తగినంత సమయాన్ని కేటాయించుకొని.. చూడండి.. మంచి అనుభూతిని పొందడం గ్యారెంటి.


Click it and Unblock the Notifications











