Arjun Son Of Vyjayanthi Review: అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: కల్యాణ్ రామ్, విజయశాంతి, అర్జున్ రాంపాల్, సాయి మంజ్రేకర్, సోహైల్ ఖాన్, శ్రీకాంత్, చరణ్ రాజ్ తదితరులు
దర్శకత్వం: ప్రదీప్ చిల్కూరి
రచన, స్క్రీన్ ప్లే: హరికృష్ణ భండారీ, శ్రీకాంత్ విస్సా, ప్రదీప్ చిల్కూరి
నిర్మాతలు: సునీల్ బలుసు, ముప్పా వెంకయ్య చౌదరీ, కల్యాణ్ రామ్, అశోక్ వర్ధన్
మ్యూజిక్: అజనీష్ లోక్‌నాథ్
ఎడిటర్: తమ్మిరాజు
డీవోపీ: రామ్ ప్రసాద్
బ్యానర్: ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోకా క్రియేషన్స్
రిలీజ్ డేట్: 2025-04-18
వైజయంతీ (విజయశాంతి) పోలీస్ ఆఫీసర్. ఆమె కుమారుడు అర్జున్ (కల్యాణ్ రామ్) పోలీస్ ఆఫీసర్ కావాలనుకొంటాడు. వైజాగ్‌లో మాఫియా కార్యకలాపాలు సాగిస్తున్న మహంకాళిని అడ్డుకొనేందుకు ఓ కాలనీ వాసులకు లీడర్‌గా మారుతాడు. అయితే తల్లి అంటే ప్రాణాలివ్వడానికి కూడా సిద్దపడే అర్జున్‌ను వైజయంతీ దూరం పెడుతుంది. కానీ తల్లి ప్రేమను ఎలాగైనా పొందేందుకు ప్రయత్నిస్తుంటాడు.

మహంకాళిని ఎలా ఎదురించాడు? పోలీస్ ఆఫీసర్ కావాలనుకొన్న అర్జున్.. ఆ లక్ష్యానికి ఎందుకు దూరంగా ఉండిపోయాడు? అర్జున్‌ను తల్లి వైజయంతీ ఎందుకు దూరంగా పెట్టింది? తండ్రి (ఆనంద్)ని అర్జున్ ఎలా కోల్పోయాడు? గియాజుద్దీన్ పఠాన్ ( సోహైల్ ఖాన్)తో వైజయంతీకి ఉన్న గొడవేంటి? తల్లిని మట్టు పెట్టడానికి ప్రయత్నిస్తున్న పఠాన్ ముఠాను అర్జున్ ఎలా ఎదుర్కొన్నాడు? పఠాన్ బారిన పడిన గర్బవతి భార్య చిత్ర (సాయి మంజ్రేకర్)ను ఎలా కాపాడుకొన్నాడు? కమిషనర్ (శ్రీకాంత్) కథలో ఎలాంటి క్యారెక్టర్ పోషించాడు? తల్లి ప్రేమను పొందాలనుకొన్న అర్జున్ ఎలాంటి త్యాగానికి పాల్పడ్డాడు? పఠాన్, అతడి కుమారుడికి అర్జున్‌కు ఎలాంటి శిక్షను విధించాడు? అనే ప్రశ్నలకు సమాధానమే అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా కథ.
తల్లిని అమితంగా ప్రేమించే కొడుకు.. కర్తవ్యం, విధి నిర్వాహణ కోసం ఎంతకైనా తెగించే పోలీస్ ఆఫీసర్ లాంటి రెండు పవర్‌ఫుల్ పాత్రల చుట్టు అల్లుకొన్న రెగ్యులర్, రొటీన్ కథ. అయితే బలహీనమైన కథతో మాస్ ఎలిమెంట్స్‌ను జొప్పించి పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా మార్చే ప్రయత్నాన్ని దర్శకుడు ప్రదీప్ చిల్కూరి చేశాడనిపిస్తుంది. మదర్, సన్ సెంటిమెంట్ అక్కడక్కడ వర్కువుట్ అయిందని చెప్పాలి. సాయి మంజ్రేకర్, కల్యాణ్ రామ్ మధ్య సన్నివేశాలను, అలాగే విజయశాంతితో ఉన్న సీన్లను కూడా ఎమోషనల్‌గా రాసుకోలేకపోయారనిపిస్తుంది. కథలో భావోద్వేగాలకు, కమర్షియల్ ఎలిమెంట్స్‌ను ఇంకా దట్టించడానికి అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రయత్నం చేయలేదనే చెప్పాలి. కథ, స్క్రీన్ ప్లే, ఇతర క్యారెక్టర్లను మరింత బలంగా రాసుకోవాల్సిన అవసరం ఉందనే ఫీలింగ్ కలుగుతుంది.
కల్యాణ్ రామ్‌కు అర్జున్ లాంటి కమర్షియల్, మాస్ ఎలిమెంట్స్ ఉన్న క్యారెక్టర్ చేయడం కొత్తేమీ కాదు. కల్యాణ్ రామ్ తన పాత్ర పరిధి మేరకు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి కథలో ఉండే లోపాలను కనిపించకుండా చేశారు. విజయశాంతితో కలిసి ఉన్న సన్నివేశాల్లో ఎమోషనల్‌గా కనిపించాడు. చాలా రోజుల తర్వాత తన ఇమేజ్‌కు సరిపడే పాత్రలో విజయశాంతి కనిపించి తన అభిమానులకు జోష్ కలిగించారు. ఫైట్స్‌లో ఎఫెక్ట్‌గా కనిపించి తనలోని సత్తా తగ్గలేదని నిరూపించుకొన్నారు. పఠాన్‌గా సోహైల్ ఖాన్, కమిషనర్‌గా శ్రీకాంత్‌వి కూడా రొటీన్ పాత్రలు. పృథ్వీ మరోసారి మంచి నటనతో ఆకట్టుకొన్నాడు. మిగితావన్నీ అంతగా గుర్తింపులేని పాత్రలుగానే కనిపిస్తాయి.
కథలో లోపాలతోపాటు టెక్నికల్‌గా చాలా సమస్యలు కనిపించాయి. మ్యూజిక్ ఈ సినిమాకు మైనస్. అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదనిపిస్తుంది. పాటలు ఈ సినిమాకు పూర్తిగా మైనస్. రాంప్రసాద్ సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్‌గా తమ్మిరాజు ప్రతిభ కారణంగా స్టోరీ, సన్నివేశాలు మంచి ఫ్లోలో వెళ్లినట్టు అనిపిస్తాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోకా క్రియేషన్స్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. సెట్స్, లొకేషన్ విషయంలో ఖర్చుకు వెనుకాడకుండా మూవీని నిర్మించారనే ఫీలింగ్ కల్పించారు.
ఫైనల్‌గా అర్జున్ సన్నాఫ్ వైజయంతీ సినిమా పక్కా మాస్, కమర్షియల్ మూవీ. నందమూరి అభిమానులకు మంచి కిక్ ఇచ్చే సన్నివేశాలు ఉన్నాయి. కథ, స్క్రీన్ ప్లే పాత తరహా వాసనలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఎమోషన్స్, సెంటిమెంట్‌కు స్కోప్ ఉన్నప్పటికీ.. ఆ దిశగా ప్రయత్నం చేయలేదనిపిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చి భావోద్వేగమైన ట్విస్టు తప్పా.. అంతగా ఏమీ కొత్తగా అనిపించవు. స్టార్ వాల్యూస్ పుష్కలంగా ఉండే సినిమాలను, మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఈ వారం హీరోయిజం, ఎలివేషన్స్‌తో కూడిన సినిమా చూడాలంటే.. అర్జున్ సన్నాఫ్ వైజయంతిపై ఓ లుక్ వేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications











