Asur 2 Review: కలి రాక్షసుడితో పోలీసుల పోరాటం.. 'అసుర్ 2' రివ్యూ.. ఎలా ఉందంటే?
రేటింగ్: 3.25/5
టైటిల్: అసుర్ సీజన్ 2
నటీనటులు: అర్షద్ వార్సి, బరున్ సోబ్టీ, అనుప్రియ గోయెంకా, విశేష్ బన్సాల్, ఆమీ వాఘ్, అభిషేక్ చౌహాన్, రిధి డోగ్రా, మెయాంగ్ చాంగ్, అథర్వ విశ్వకర్మ తదితరులు
సినిమాటోగ్రఫీ: రామానుజ్ దత్తా
ఎడిటింగ్: చారు టక్కర్
సంగీతం: ధర్మరాజ్ భట్
నిర్మాతలు: సెజల్ షా, భవేష్ మండలియా, గౌరవ్ శుక్లా
దర్శకత్వం: ఓని సేన్
ఓటీటీ విడుదల తేది: జూన్ 1
ఓటీటీ వేదిక: జియో సినిమా (ఎపిసోడ్స్ 8)
2020 సంవత్సరంలో వూట్ ఓటీటీలో విడుదలై సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ 'అసుర్' (Asur: Welcome to Your Dark Side). మైథలాజికల్ సైకో క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సిరీస్ సాధారణంగా రిలీజై అసాధరణ ఆదరణ పొందింది. దీంతో తర్వాతి సీజన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో మూడేళ్ల తర్వాత సీక్వెల్ గా వచ్చింది 'అసుర్ 2' (Asur 2: Rise Of The Dark Side). డైరెక్టర్ ఓని సేన్ దర్శకత్వం వహించిన ఈ రెండో సీజన్ మొదటి సీజన్ అంచనాలను అందుకోగలిగిందా? మరి 'అసుర్ 2' (Asur 2 Telugu Review) ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ : తాను కలిగా చెప్పుకునే శుభ్ జోషి (బాలుడి పాత్రలో విశేష్ బన్సాల్) నుంచి ముగ్గురు సామాజిక వేత్తలను కాపాడేందుకు తన కూతురు రియాను త్యాగం చేస్తాడు ఫొరెన్సిక్ ఎక్స్‌పర్ట్ నిఖిల్ నాయర్ (బరున్ సోబ్డీ). తర్వాత తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్తాడు. నిఖిల్ భార్య నైనా నాయర్ (అనుప్రియ గోయెంకా) అతని నుంచి విడాకులు కోరుతుంది. ఇక ఇష్టమైన వాళ్లందరిని కోల్పోయిన బాధలో సీబీఐ ఆఫీసర్ రాజ్ పుత్ ధనుంజయ్ అకా డీజే (అర్షద్ వార్సి) కూడా ఓ మఠంలోకి వెళ్లి ప్రశాంతంగా జీవించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో శుభ్ జోషి (అభిషేక్ చౌహాన్) ముగ్గురుని చంపి సీబీఐకి సవాల్ విసురుతాడు.

ట్విస్టులు : శుభ్ జోషిని పట్టుకునేందుకు మళ్లీ రంగంలోకి దిగిన డీజే ఏం చేశాడు? నిఖిల్ భార్య నైనా సహాయంతో ఎలాంటి విచారణ చేపట్టాడు? శుభ్ జోషి ఎలా ఉంటాడో డీజే కనిపెట్టాడా? అతన్ని ఎదుర్కొగలిగాడా? అతని మాస్టర్ ప్లాన్స్ ఏంటో తెలుసుకున్నాడా? మరోవైపు నిఖిల్ నాయర్ కనిపెట్టిన విషయాలు ఏంటి? సీబీఐ నుంచి కేసు స్వాధీనం చేసుకున్న ఏటీఎఫ్ (యాంటీ టెర్రర్ ఫోర్స్)కు ఎదురైన అనుభవాలు ఏంటీ? అద్భుత బాలుడుగా అనంత్ స్వామి (అథర్వ విశ్వకర్మ) పాత్ర ఏంటీ? వంటి ఆసక్తికర విషయాలు తెలియాలంటే అసుర్ 2 చూడాల్సిందే.
విశ్లేషణ : అసుర్ 1 సీజన్ సెన్సేషన్ హిట్ అయి తర్వాతి సీజన్ పై ఎన్నో అంచనాలు పెంచేసింది. ఆ అంచనాలను నూరు శాతం చేరుకోగలిగింది అసుర్ 2. మొదటి సీజన్ ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే రెండో సీజన్ ప్రారంభించారు. శుభ్ జోషి వల్ల అయినావాళ్లందరిని కోల్పోయిన సీబీఐ అధికారులు బాధలో ఉంటూనే ప్రజలను కాపాడునేందుకు చేసే ప్రయత్నాలతో ఎమోషనల్ గా స్టార్ట్ అవుతుంది. బహిరంగంగా ముగ్గురు అమాయకులను శుభ్ జోషి చంపడంతో కథలో జోరందుకుంటుంది. తర్వాత డీజే చేసే ఇన్వెస్టిగేషన్ తోపాటు శుభ్ జోషి అనుచరుల పట్ల అతను ప్రవర్తించే తీరు ఆకట్టుకుంటుంది.

సస్పెన్స్ కొనసాగిస్తూ : చిన్న క్లూ కూడా దొరక్కుండా శుభ్ జోషి చేసే హత్యలు సీజన్ 2లో సైతం ఆసక్తిగా ఉంటాయి. తొలి సీజన్ లోని అనేక ప్రశ్నలకు ఇందులో సమాధానాలు దొరుకుతాయి. మరోసారి అసాధారణమైన స్క్రిప్టుతో రచయితలు మెప్పించారు. మైథాలజీలోని కలి పాత్రగా భావించిన ఓ వ్యక్తి ఏ టెక్నాలజీ సహాయంతో ఇన్ని హత్యలు చేస్తున్నాడనే విషయాన్ని చివరి వరకు సస్పెన్స్ క్యారీ చేస్తూ థ్రిల్లింగ్ గా చూపించారు. శుభ్ జోషి గతం తాలుకు సన్నివేశాలు, డీజే ఇన్వెస్టిగేషన్, ప్లాన్స్, నిఖిల్ నాయర్ ఇంటెలిజెన్స్ మెప్పిస్తాయి.

మైథాలజీ ఆధారంగా : మైథాలజీ పాత్రలను సీరియల్ కిల్లింగ్స్ కు వాడిన నేపథ్యం వావ్ అనిపించేలా ఉంది. అయితే తమలోనే శుభ్ జోషి అనుచరుడు ఉన్నాడన్న డౌట్ మొదటి సీజన్ నుంచి అన్ని హత్యలు జరిగినా రాకపోవడం వంటి చిన్న మిస్టేక్ సీబీఐ నెగ్లెజెన్సీని సూచించాయి. క్లైమాక్స్ కాస్తా నిరాశపరుస్తుంది. కానీ ఎండింగ్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఊహించని విధంగా హైలెట్ గా ఉంటుంది. బీజీఎమ్ సిరీసుకు ప్రధాన హైలెట్. నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ, సాంకేతిక వర్గం అంతా బాగుంది. డైరెక్షన్, స్క్రీన్ ప్లే సూపర్బ్.
ఎవరెలా చేశారంటే : అర్షద్ వార్సి అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు. అతను కనిపించిన ప్రతి సీన్ ఇంటెన్సిటీ క్రియేట్ చేసింది. బరున్ సోబ్టీ, అనుప్రియ గోయెంకా (పోటుగాడు మూవీ ఫేమ్), అమీ వాఘ్, అభిషేక్ చౌహాన్, రిధి డోగ్రా, మెయాంగ్ చాంగ్ అంతా మంచి నటనకనబర్చారు. ఇక చిన్నప్పుడు శుభ్ జోషిగా నటించిన విశేష్ బన్సాల్ యాక్టింగ్ అద్భుతమనే చెప్పొచ్చు. ఆ పాత్రకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేలా నటించాడు. అద్బుత బాలుడిగా అథర్వ విశ్వకర్మ (బ్రీత్ సిరీస్ ఫేమ్) సైతం మెప్పించాడు. అతని డైలాగ్ డెలీవరీ, ఎక్స్ ప్రెషన్స్ హాయిగా ఉంటూ ఆకట్టుకుంటాయి.

ఫైనల్ గా చెప్పాలంటే : నిజానికి 'అసుర్ 2' ఒక డిఫరెంట్ సైకో క్రైమ్ థ్రిల్లర్. చూస్తున్నంతసేపు ఎంగేజ్ చేస్తుంది. మొదటి సీజన్ చూసినవాళ్లకు రెండో సీజన్ మరింతగా నచ్చుతుంది. క్లైమాక్స్ కొంచెం సంతృప్తికరంగా అనిపించకవపోవచ్చు. కానీ మూడో సీజన్ కోసం ఇచ్చిన హింట్ మాత్రం అస్సలు ఊహించం. సుమారు 40 నిమిషాల నిడివితో 8 ఎపిసోడ్స్ ఉన్న అసుర్ 2 వీకెండ్ లో టైమ్ ఉంటే చూసేయండి. జియో సినిమాలో ప్రస్తుతం ఎలాంటి సబ్ స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది.


Click it and Unblock the Notifications











