twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రేక్షకుడు 'అసాధ్యుడు'

    By Staff
    |

    Asadhyudu
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    సినిమా: అసాధ్యుడు
    విడుదల తేదీ: 16/02/2006
    నటీనటులు: కళ్యాణ్‌రామ్‌, దియా, వినోద్‌కుమార్‌, చలపతిరావు,
    చరణ్‌రాజు, రవి కాలే, వినాయకన్‌, కవిత, సుదీప, రఘుబాబు,
    ఆహుతి ప్రసాద్‌, కృష్ణభగవాన్‌, తదితరులు
    సంగీతం: చక్రి
    కెమెరా: భూపతి
    మాటలు: నంద్యాల రవి
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్‌ కృష్ణ
    నిర్మాత: వల్లూరిపల్లె రమేష్‌బాబు

    అతనొక్కడే చిత్రంతో అందర్నీ అకట్టుకున్న కళ్యాణ్‌రామ్‌ మరోమారు కొత్త దర్శకుడిని పరిచయం చేయడం అభినందనీయం. గతంలో వలెనే ఈ చిత్రంలోనూ స్క్రీన్‌ప్లేలో విభిన్నత చూపాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టి, గజిబిజీగా మారింది. దాంతో విషయంలో స్పష్టత కొరవడి ప్రేక్షకులు చూడడానికి అసాధ్యంగా మారింది.

    పార్థు (కళ్యాణ్‌రామ్‌) అల్లరిచిల్లరగా తిరిగే కుర్రోడు. తండ్రి (చలపతిరావు) పనిచేసే కాలేజీలోనే చదువుతూ (?) ఉంటాడు. తనను నమ్మిన విషయం కోసం ఎంతటివారితోనైనా తలపడడానికి వెనుదీయడు. అతన్ని మాధవి (దియా) అనే అమ్మాయి గులాబీ చిత్రంలో లాగా ప్రేమిస్తూ వెంటపడుతూ ఉంటుంది. ఆమె తండ్రి (చరణ్‌రాజు) వైజాగ్‌ను శాసించే రాజకీయ నాయకుడు. పార్థుకి అతని మనుషులు వార్నింగ్‌ ఇస్తారు. దీంతో పార్థు చరణ్‌రాజును కలుస్తాడు. అనుమతిస్తే అతని కూతురిని ప్రేమిస్తానని చెప్తాడు. పర్మిషన్‌ ఇచ్చి ముచ్చటపడతాడు మాధవి తండ్రి. ఆ ముచ్చటతోనే హీరోగారికి తన కూతురిని ప్రేమించడానికి పచ్చజెండా ఊపుతాడు.

    ఆ మరుసటి రోజు నుంచి హీరోహీరోయిన్ల పాటలు పాడుకుంటూ, డ్యాన్స్‌లు చేస్తూ తిరుగుతుంటారు. ఈలోగా పార్థుని చంపడానికి కొంత మంది మనుషులు ప్రయత్నిస్తూ వుంటారు. దాంతో కోపగించిన పార్థు చరణ్‌రాజును నిలదీస్తాడు. తనకు ఆ మనుషులకు సంబంధం లేదని చరణ్‌రాజు బుద్ధిమంతుడిలా చెప్తాడు. హీరో విషయం ఆరాగా తీయగా తన వెంట పడుతోంది హైదరాబాద్‌ డాన్‌ ప్రకాష్‌ అని తెలుస్తుంది. అతనికి పార్థుని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది, అది తెలుసుకుని పార్థు ఏమి చేశాడనేది తెర మీద చూడవచ్చు.

    తరుచుగా ఈ మధ్య తెలుగు సినిమా స్క్రీన్‌ప్లేలో హీరోకి గతంలో సంభవించిన ఓ సంఘటన దాచి ప్రథమార్థంలో ఆసక్తి రేపి, ద్వితియార్థంలో ఫ్లాష్‌బ్యాక్‌ ద్వారా తెర మీదికి తెచ్చి విజయం సాధించడం అనవాయితీ అయింది. అదే ఫార్ములాను దీనిలోనూ వాడారు. కానీ నడుస్తున్న కథలో ఒక సీన్‌ని దాచడం వల్ల లేనిపోని అయోమయం కథనంలో చోటు చేసుకుంది. మరో పక్క విలన్‌ ట్రాక్‌లు రెండు నడవడం కథకు సంబంధం లేని పోలీసు ట్రాక్‌ (వినోద్‌కుమార్‌) వచ్చి కథను మరింత కంగాళీగా మార్చాయి.

    మొదటి సగం ప్రేమ కథ అనుకునేలోగానే యాక్షన్‌ లోకి మార్చి విచిత్రంగా తయారు చేశారు. కథనం ఎలా వున్నా ఆదిమధ్యాంతాలు పాటించకపోతే కథనం పాలో కావడం కష్టం. కథ ఎటు నుంచి ఎటు పోతుందో అర్థం కాదు. అందులోనూ ఈ చిత్రంలో డైరెక్టర్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో కథ నడిపి హీరోనుంచి ప్రేక్షకుడ్ని వేరు చేసి అనుభూతికి అవకాశం లేకుండా చేశారు. దాంతో ఐడెంటిటీ దొరక్క హీరోలో లీనం కాలేక ప్రేక్షకులు భావోద్వేగాలకు గురి కాలేకపోయారు.

    ఇక కళ్యాణ్‌రామ్‌ ఎనర్జీగా నటించినా కథ సహకరించలేదు. రిలీఫ్‌ కోసం కామెడీ కూడా లేదు. పాటలు ఒకటిరెండు బాగున్నా ఆడియో పరంగానూ అంత ఆకట్టుకునే స్థితిలో లేదు. కథలో రెండు మూడు సార్లు క్లైమాక్స్‌ వాతావరణం ఏర్పడి, మళ్లీ కథ కొనసాగడం బోరే. కెమెరా పనితనం అంత బాగా లేదు. సీన్‌లు బాగుంటే, మాటలు మరింత పండేవి. దర్శకత్వ పరంగా చెప్పుకోదగ్గ స్థితిలో చిత్రం లేదు. కొద్దో గొప్పో క్రెడిట్‌ ఫైట్‌ మాస్టర్లే. ఏది ఏమైనా బీసీ సెంటర్లు టార్గెట్‌ చేసిన ఈ చిత్రం వారిని కూడా చేరుతుందా అనేది అనుమానమే.

    గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X