సగటు సినిమా 'అతనొక్కడే'

సినిమా: అతనొక్కడే
విడుదల తేదీ: 7-5-2005
నటీనటులు: నందమూరి కళ్యాణ్‌రామ్, సింధు తులానీ,
ప్రకాష్‌రాజ్, ఆశిష్ విద్యార్ధి, బ్రహ్మానందం, వేణుమాధవ్, చంద్రమోహన్,
సూర్య, ఆదిత్య, బ్రహ్మానందం, వేణుమాధవ్, చంద్రమోహన్, సూర్య, రామిరెడ్డి,
చలపతిరావు, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రమణ్యం తదితరులు.
సంగీతం: మణిశర్మ
మాటలు: మరుధూరి రాజా
ఛాయాగ్రహణం: సి.రాంప్రసాద్
ఫైట్స్: స్టన్ శివ
నిర్మాత: నందమూరి జానకిరామ్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేందర్
పాత కథే అయినా విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో రూపొందిన 'అతనొక్కడే' ఓకే సినిమా. 'తొలి చూపులో' చిత్రంతో పరిచయమైన నందమూరి కళ్యాణ్‌రామ్‌ను మాస్ హీరో ఇమేజి తెచ్చే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది.
సినిమా ప్రారంభం కాగానే హీరోయిన్ సింధు మాజీ డిజిపి ఆహుతి ప్రసాద్‌ను వైజాగ్ బీచ్‌లో హత్య చేస్తుంది. తర్వాత అంకుల్ సూర్యతో కలిసి హైదరాబాద్ వచ్చేస్తుంది. ఆమెకి వర్షంలో తడవడం, బుద్దుడికి పూలు పెట్టడం వంటి విచిత్రమైన అలవాట్లు ఉంటాయి. సరిగ్గా అలాంటి అలవాట్లు ఉన్న కళ్యాణ్‌రామ్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుంటాడు. అతన్ని వదిలి ఉండలేని తండ్రి చంద్రమోహన్ హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్ చేయించుకుని మిగతా కుటుంబ సభ్యులతో సహా వస్తాడు. సినిమా న్యాయం ప్రకారం సింధు చదివే కాలేజిలోనే కళ్యాణ్‌రామ్ చేరతాడు.
హీరో హైదరాబాద్‌లో అడుగుపెట్టే నాటికి సిటీ 'అన్న' (ఆశిష్ విద్యార్ధి) అనే గూండా చేతుల్లో గిజగిజలాడుతుంటుంది. విలన్ పక్కనుండే ఇద్దరు అనుచరులను చంపడానికి సింధు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆమె ప్లాన్ అమలు చే సే ప్రయత్నంలో ఉండగా ఆమెకు కళ్యాణ్‌రామ్ పరిచయమై ప్రేమలో పడతాడు. ఒకరోజు ఆమె అదను చూసుకుని ఒకణ్ణి (రఘుబాబు) చంపుదామనుకునే లోపు కళ్యాణ్‌రామ్ ప్రత్యక్షమై తుపాకితో కాల్చుతాడు. విలన్ 'అన్న' మాత్రం ఈ హత్య చేసింది తన ప్రత్యర్ధి రామిరెడ్డి అనుకుని అతణ్ణి చంపేస్తాడు. విలన్ మరో అనుచరుడి తలను బహిరంగంగా నరికేస్తాడు కళ్యాణ్‌రామ్. కళ్యాణ్‌రామ్ వంటి బుద్ధిమంతుడు ఇలా ఎందుకు చేస్తున్నాడనుకునే లోపు ఇంటర్వల్.
ఇలా ఎందుకు చేశావని తండ్రి కళ్యాణ్‌రామ్‌ని అడుగుతాడు. అప్పుడు ఫ్లాష్‌బ్యాక్. కళ్యాణ్‌రామ్ అసలు వాళ్ళ కొడుకే కాదు. అతని అసలు తండ్రి నిజాయితీ పరుడైన ఎస్పీ ప్రకాష్‌రాజ్. కబ్జా కేసులో విలన్‌ని ఎదిరించాడని అతను ప్రకాష్‌రాజ్ కుటుంబ సభ్యులను చంపేస్తాడు. ఆ దాడిలో తప్పించుకుంటారు కళ్యాణ్‌రామ్, సింధు, సూర్య . హీరోయిన్ అతని మేనత్త కూతురే. సింధు తన మరదలేనని హీరో ఎలాగుర్తిస్తాడన్నది సినిమాలో చూడవలసిందే.
కథ పాతదే అయినా కథనం కొత్తగా ఉండడంతో ఈ సినిమా గట్టెక్కింది. స్క్రీన్‌ప్లే అద్భుతంగా లేకపోయినా ఆసక్తి రేపింది. కానీ తెరనిండా మితి మీరిన హింస ఉండడంతో కుటుంబసమేతంగా సినిమాకు వచ్చేవారు వెనుకాడుతారు. రెండు పాటలు బాగున్నాయి. కుటుంబ సభ్యులతో ప్రకాష్‌రాజ్ పాడే పాట బాగుంది. కళ్యాణ్‌రామ్ కసితో నటించినట్టు కన్పించినా కొన్ని చోట్ల హావభావాలు పలుకలేదు. కొంచెం సేపే తెర మీద కన్పించినా బ్రహ్మానందం వినోదం పంచాడు. గెస్ట్ రోల్ అయినా ప్రకాష్‌రాజ్ నటన నిండుగా ఉంది. హత్యలు జరుగుతున్నా పోలీసులు ఎటువంటి దర్యాప్తులు జరపకపోవడం అసహజంగా ఉంది. ఫస్టాఫ్ లవ్ ఫీల్‌తో సందడిగా, సెకండాఫ్ హింసతో భయానకంగా సాగిన ఈ చిత్రం ఒక తరగతి ప్రేక్షకులకు మాత్రమే నచ్చుతుంది.


Click it and Unblock the Notifications











