Athadu Re Release Review: అతడు మూవీ రీ రిలీజ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: మహేష్ బాబు, త్రిషా కృష్ణన్, ప్రకాశ్ రాజ్, సోను సూద్, సాయాజీ షిండే, కోటా శ్రీనివాసరావు, నాజర్, సునీల్, గిరిబాబు, ధర్మవరపు, సుధ, బ్రహ్మనందం, హేమ, ప్రకాశ్ రాజ్, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ తదితరులు
కథ, మాటలు, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత: కిషోర్, రామ్మోహన్
బ్యానర్: జయభేరి
సినిమాటోగ్రఫి: కేవీ గుహన్
ఎడిటింగ్: ఏ శ్రీకర్ ప్రసాద్
మ్యూజిక్: మణిశర్మ
రిలీజ్ డేట్: 2005-08-10
రీ రిలీజ్ డేట్: 2025-08-08
నందు (మహేష్ బాబు) కాంట్రాక్ట్ కిల్లర్, షార్ప్ షూటర్. పొలిటిషియన్ శివారెడ్డిని మర్డర్ చేసిన తర్వాత పారిపోయే క్రమంలో పాశర్లపూడిలోని భూస్వామి సత్యనారాయణ మూర్తి (నాజర్) ఇంటికి పార్థు పేరుతో చేరుకొంటాడు. అక్కడ మరదలు పూరి (త్రిష)తో ప్రేమలో పడుతాడు. శివారెడ్డి మర్డర్ కేసు దర్యాప్తులో భాగంగా నందూ అలియాస్ పార్థూను వెతుక్కొంటూ సీబీఐ ఆఫీసర్ ఆంజనేయ ప్రసాద్ (ప్రకాశ్ రాజ్) పాశర్లపూడికి వస్తాడు.

శివారెడ్డిని మర్డర్ అటెంప్ట్ చేయాలని అనుకొన్న నందూ ఏకంగా ఎందుకు కాల్చి చంపాడు? శివారెడ్డి హత్య వెనుక మిస్టరీ ఏమిటి? కాంట్రాక్ట్ కిల్లర్ నందూ పేరు మార్చుకొని పార్ధూగా సత్యనారాయణ ఇంట్లో ఎందుకు తిష్ట వేశాడు? సత్యనారాయణ మూర్తి వ్యక్తిగత సమస్యలను ఎందుకు పరిష్కరించేందుకు ప్లాన్ చేస్తాడు? పూరితో ప్రేమలో పడిన తర్వాత ఏం జరిగింది. సీబీఐ కేసు దర్యాప్తును నందూ ఎలా తప్పించుకొన్నాడు? సత్యనారాయణ మూర్తి ఇంట్లో వారికి తమ ఇంటికి వచ్చింది పార్ధూ కాదు.. నందు అని తెలిసిందా? చివరకు నందూ జీవితం ఏమైంది అనేది అతడు సినిమా కథ.
జయభేరి బ్యానర్‌పై 2005 సంవత్సరంలో రిలీజైన అతడు చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోలేకపోయిందనే విషయం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ టెలివిజన్, ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా రికార్డు స్థాయిలో అనేకసార్లు ప్రసారమైంది. ఈ సినిమా కాల ప్రవాహంలో కల్ట్ మూవీగా మారింది. అలాంటి సినిమాను నేటి టెక్నాలజీ హంగులతో ముస్తాబు చేసి.. మహేష్ బాబు 50వ బర్త్ డే సందర్భంగా ఆగస్టు 9వ తేదీన రిలీజ్ చేశారు.
ఈ చిత్రంలో మహేష్ బాబు, త్రిషా, నాజర్, కోట శ్రీనివాసరావు, షయాజీ షిండే, సోనుసూద్, రాహుల్ దేవ్, సునీల్, గిరిబాబు, ధర్మవరపు, సుధ, బ్రహ్మనందం, హేమ, ప్రకాశ్ రాజ్, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ లాంటి వాళ్లు అద్బుతంగా నటించి కలకాలం గుర్తుండిపోయేలా పాపులారిటీని సంపాదించుకొన్నారు. సాంకేతిక నిపుణుల్లో కేవీ గుహన్ సినిమాటోగ్రఫి, మణిశర్మ మ్యూజిక్, శ్రీకర్ ప్రసాద్ కట్ టాప్ నాచ్ అని మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే ఈ సినిమాను 4K, ఐమాక్స్, డాల్బీ, సూపర్ 4K సినిమా ఫార్మాట్‌లోను, ఒరిజినల్ సౌండ్ ట్రాక్‌తోపాటు ఐమాక్స్ డాల్బీ సౌండ్ సూపర్4K టెక్నాలజీతో జోడించారు. ఇలాంటి హంగులతో లేటేస్ట్ టెక్నాలజీతో రూపొందిన మొట్టమొదటి రీ రిలీజ్ చిత్రమని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమా కలర్ గ్రేడింగ్, సౌండ్ క్వాలిటీ బ్రహ్మండంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకొన్నారు. పిక్చర్ క్వాలిటీని తెర మీద సూపర్‌గా తీసుకొచ్చారు. ఈ రోజుల్లో రూపొందించే సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా క్వాలిటీని ప్రేక్షకుల అందించడం ఈ సినిమాకు స్పెషాలిటీగా మారిందని ఎలాంటి అనుమానాలు లేకుండా చెప్పుకోవచ్చు. ఈ జనరేషన్ ప్రేక్షకులకు కూడా కొత్త అనుభూతిని పంచేలా ఈ సినిమాను రూపొందించారు. ప్రొడక్షన్ క్వాలిటీ, రీ మాస్టరింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు.
అతడు సినిమా మరోసారి పాత అనుభవాలను, అనుభూతులను గుర్తు తెచ్చేలా చేస్తుంది. నేటి తరం ప్రేక్షకులకు త్రివిక్రమ్ ప్రతిభ ఏమిటో కొత్తగా రుచి చూపిస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల మాంత్రికుడిగా మారడానికి ఈ సినిమా ఎలా ఉపయోగపడింది. ఈ సినిమాలో నందు పాత్ర పేల్చే బుల్లెట్ల కంటే పదునుగా మాటలను తూటల్లాగా త్రివిక్రమ్ ఎలా పేల్చారు. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కలిపి ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్ మీద ఎలా మ్యాజిక్ చేశారనేది అతడు చూస్తేనే తెలుస్తుంది. కాబట్టి ఈ సినిమాను నేటి సాంకేతిక హంగులతో థియేటర్లలో కొత్త అనుభూతిని పొందే ప్రయత్నం చేయండి.


Click it and Unblock the Notifications











