Bachchala Malli Movie Review: బచ్చల మల్లి మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Rating: 2.75/5
నటీనటులు: అల్లరి నరేష్, అమృతా అయ్యర్, అంకిత్ కోయ, హరితేజ, రావు రమేష్, కోట జయరాం, ధన్‌రాజ్, హర్ష చెముడు, అచ్యుత్ కుమార్ తదితరులు
కథ, రచన, దర్శకత్వం: సుబ్బు మంగాదేవి
స్క్రీన్ ప్లే: విప్పర్తి మధు, విశ్వ నేత్ర
నిర్మాత: రాజేశ్ దండా, బాలాజీ గుట్ట
సినిమాటోగ్రఫి: రిచర్డ్ ఎం నాథన్
ఎడిటింగ్: చోటా కే ప్రసాధ్
మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్
బ్యానర్: హాస్య మూవీస్
రిలీజ్ డేట్: 2024-12-20
చిన్నతనంలో చదువుల్లో బచ్చల మల్లి (అల్లరి నరేష్) టాప్ స్టూడెంట్ మాత్రేమే కాకుండా పదో తరగతిలో మెరిట్ స్టూడెంట్. అయితే ఓ కారణంగా తండ్రిపై విపరీతమైన ద్వేషం పెంచుకొంటాడు. తన తల్లికి తండ్రి చేసిన అన్యాయానికి మానసికంగా చలించిపోవడమే కాకుండా వీధి రౌడీగా మారిపోతాడు. మద్యం, మగువలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకొంటాడు. అలాంటి పరిస్థితుల్లో మల్లి జీవితంలోకి కావేరి (అమృత అయ్యర్) వస్తుంది.
ఉన్నత చదువులు చదువుతాడునుకొన్న మల్లీ జీవితం రోడ్డు పాలు కావడానికి కారణమేమిటి? తండ్రిపై పీకల్లోతు ద్వేషాన్ని ఎందుకు పెంచుకొన్నాడు? తండ్రిపై కోపం తన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించింది? కావేరి తన జీవితంలోకి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు ఎఫెక్ట్ ఏమిటి? జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకొన్న మల్లీ ప్రేమను కావేరి ఫ్యామిలీ అంగీకరించిందా? మల్లి జీవితం గాడిన పడిందా? పోలీస్ అధికారి లక్ష్మీ నారాయణ (రావు రమేష్), గణపతి రాజు (అచ్యుత్ కుమార్) పాత్రలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే బచ్చల మల్లి సినిమా కథ.

గాడి తప్పిన మల్లీ జీవితం గురించి చెప్పే ప్రయత్నంలో ఉత్తమ విద్యార్థి లైఫ్ ఎలా ఊగిసలాడిందనే పాయింట్‌తో ఎమోషనల్‌గానే దర్శకుడు సుబ్బు మంగాదేవి మొదలుపెట్టాడు. కానీ రొటీన్ సన్నివేశాలు, కొత్తదనం లేని కథ, కథనాల కారణంగా ఏదో పాత సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కల్పించినప్పటికీ.. మధ్యలో కొన్ని సీన్లు హృదయానికి టచ్ అయ్యేలా రాసుకోవడం ఆయన ప్రతిభకు అద్దం పట్టిందని చెప్పవచ్చు. రకరకాల ఎమోషన్స్‌తో ప్రీ క్లైమాక్స్ వరకు కథను లాగినట్టు అనిపించినా.. చివరి 20 నిమిషాల్లో స్టోరీని గ్రిప్పింగ్‌గా, ఎమోషనల్‌గా, గుండెను పిండేసేలా చేసిన విధానంతో ఫుల్ మార్కులు కొట్టేశాడనిపిస్తుంది.
కమెడియన్‌గా ముద్ర వేసుకొన్పప్పటికీ.. ప్రాణం, గమ్యం, శంభో శివ శంభో, మహర్షి లాంటి సినిమాలతో నటుడిగా తనలోని మరో కోణంతో విశేషంగా అభిమానులు సంపాదించుకొన్న యాక్టర్ అల్లరి నరేష్. తనలోని నటుడిని బయటకు లాగే ప్రయత్నంలో చేసిన చిత్రం బచ్చల మల్లి సినిమాగా చెప్పుకోవచ్చు. మల్లిగా తన పాత్రలో పరకాయ ప్రవేశమే చేశారనే చెప్పాలి. కమెడియన్ నరేష్‌కు ఎక్కడా పొంతనా ఉండదు. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు సినిమాను ఓ రేంజ్‌లో నిలబెట్టడమే కాకుండా అవార్డు విన్నింగ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పవచ్చు. అల్లరి నరేష్ కెరీర్‌లో మరో బెస్ట్ మూవీగా ఈ సినిమాను చెప్పుకోవచ్చు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, మ్యూజిక్, యాక్షన్ కోరియోగ్రఫి ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. తుని పరిసర ప్రాంతాలను అందంగా తెరకెక్కించారు. విశాల్ చంద్రశేఖర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ సినిమాను గ్రిప్పింగ్‌గా మార్చింది. ఉత్తమ చిత్రాలను అందించే రాజేశ్ దండ అనసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

బచ్చల మల్లి సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. అల్లరి నరేష్ పెర్ఫార్మెన్స్, యాక్షన్ సన్నివేశాలు, అమృత అయ్యర్‌తో ఎమోషనల్ లవ్ ట్రాక్, ప్రీ క్లైమాక్స్ నుంచి వచ్చే ఎమోషనల్ ఎపిసోడ్ సినిమాకు ప్లస్ పాయింట్స్. పాత కథే అయినప్పటికీ.. భావోద్వేగాలు కొన్ని చోట్ల బలంగా వర్కవుట్ అయ్యాయి. అచ్యుత్ కుమార్ పాత్రను మధ్యలోనే వదిలేయడం వల్ల కన్‌ఫ్యూజన్ రేకేత్తుతుంది. హరితేజ ట్రాక్ చాలా బాగుండటమే కాకుండా సీరియస్‌గా నడిచే కథలో కొంత వినోదాన్ని జొప్పించేలా చేసింది. మంచి కంటెంట్, పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న సినిమా. ఈ వారం థియేటర్‌లో చూడదగిన సినిమాల్లో ఒకటి. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలను ఇష్టపడే వారికి తప్పకుండా నచ్చుతుంది


Click it and Unblock the Notifications











