For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాడ్‌ టేస్టు బాచిలర్స్‌

  By Staff
  |

  Bachelors
  -జలపతి గూడెల్లి

  చిత్రం: బ్యాచ్‌ లర్స్

  నటీనటులు: శివాజీ, మాన్య, తనికెళ్ళ భరణి, ఎమ్మెస్‌ నారయణ

  సంగీతం: శశిప్రీతం

  నిర్మాణం: సానా క్రియేషన్స్

  దర్శకత్వం: సానా యాదిరెడ్డి

  హైదరాబాద్‌ బ్లూస్‌ చిత్రం ఘన విజయం ఔత్సాహిక దర్శకులకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. చిన్న బడ్జెట్‌ లో యువతరానికి నచ్చే యువతరానికి చెందిన అంశాలపై నిర్మించే చిత్రాల సంఖ్య అన్ని భాషల్లోనూ పెరిగింది. హిందీలో బాంబే బాయిస్‌, ఇంగ్లీష్‌ లో స్ల్పిట్‌ వైడ్‌ ఓపన్‌, డాలర్‌ డ్రీమ్స్‌ వంటి చిత్రాలు వచ్చాయి. విజయవంతమయ్యాయి. ఇదే తరహాలో తెలుగులో చిత్రం తీయాలని మొదలు పెట్టిన సానా యాదిరెడ్డి ప్రయత్నం వికటించింది. కాలేజ్‌ యువకుల అల్లరి పేరిట పచ్చి బూతును విచ్చలవిడిగా ఉపయోగించి చిత్రాన్ని 'ఛీప్‌ మలయాళం సెక్స్‌' సినిమాలాగా మార్చేశాడు. కథ అంటూ లేని ఈ చిత్రంలో అంతా కొత్తవాళ్ళే. ఒక్కరికి కూడా సరిగ్గా నటించడం రాని వీరు చేసే బూతు విన్యాసాలే- బ్యాచిలర్స్‌ చిత్రం.

  ఇంతకుముందు పిట్టల దొర చిత్రం తీసిన సానాయాదిరెడ్డి, సినిమా గురించి ఏమీ తెలియని వాడి మాదిరిగా తీసాడీ ఈ చిత్రాన్ని. ప్రతి సన్నివేశంలోనూ నటీనటుల అసహజ నటన, దర్శకుడి అపరిపక్వత కనిపిస్తాయి. కాలేజ్‌ జీవితం అంటే టీజ్‌ చేయడం, ప్రేమలో పడడం తప్ప మరేదీ ఉండదనుకునే సగటు చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం కూడా వీటి చుట్టే తిరుగుతుంది.

  బాలు(శివాజీ) డిగ్రీ విద్యార్థి. ఇతనికి మరో ముగ్గురు స్నేహితులుంటారు. వీరు అతనికి క్లాస్‌ మేట్స్‌ కూడా. వీరికి ఓ సబ్జెక్ట్‌ గ్రూప్‌ అంటూ ఉండదు. పొలిటికల్‌ సైన్స్‌ క్లాస్‌ వింటారు. కెమిస్ట్రీ ప్రాక్టికల్స్‌ చేస్తారు. పరీక్షల సమయంలో సివిక్స్‌ బుక్స్‌ చదువుతారు(బహుశా దర్శకుడు అలాగే చదివి ఉండొచ్చు). ఈ చతుష్టయం చేసే పని- కాలేజికి వెళ్ళడం, అమ్మాయిల వెంటపడడం, టీజ్‌ చేయడం. పాపం బ్యాచ్‌ లర్స్‌ కదా! క్లాస్‌ మేట్‌ ప్రియా(మన్యా)ను బాలు ప్రేమిస్తాడు. కానీ వయసు తుంటరిది కదా అందుకని 'అనుభవాల' కోసం తహతహలాడుతుంటాడు. ఈ బ్యాచ్‌ లర్స్‌ గ్యాంగ్‌ కు ఉన్న పనేమీ లేదు కాబట్టి పక్కింటి ఆంటీ బెడ్‌ రూమ్‌ లోకి దొంగతనంగా తొంగిచూస్తూ, క్లబ్బులకు వెళ్ళి తాగి తందనాలు ఆడుతూ, బూతు డైలాగులు మాట్లాడుతూ కాలక్షేపం చేస్తుంటారు. రీళ్ళు చుట్టేస్తుంటారు.

  ఒకసారి ఓ వేశ్య దగ్గరికి వెళితే ఈ గ్యాంగులోని ఒకడికి సుఖవ్యాధి వస్తుంది. ఇక అంతే వీరి మనసు మారుతుంది. బుద్ది మంతులుగా మారాలని నిశ్చయించుకుంటారు. కానీ ప్రియాకు వీరి 'కొంటె' పనులు తెలిసి, ఈ విషయాన్ని ప్రిన్సిపాల్‌ కు చెప్పేందుకు వెళుతుంది. ప్రియాకు నచ్చచెప్పేందుకు వీరు ఆమెను వెంబడిస్తూ కాలేజ్‌ కు చేరుకుంటారు. ఇక్కడ చిన్న ట్విస్ట్‌- ప్రశ్నాపత్రాల లీకేజి కేసులో కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ అరెస్ట్‌ అవుతాడు. కానీ, అసలు దోషిని వీరు పట్టుకొని పోలీసులకు అప్పచెప్పి ఉత్తమ విద్యార్థులమని అనిపించుకుంటారు. శుభం. చిత్రం ముగుస్తుంది.

  ద్వంద్వార్థాలు, కొన్నిసార్లు స్ట్రెయిట్‌ అర్థాలే ఉండే బూతులు తప్ప ఇందులో కథా లేదు, కథనమూ లేదు. టెక్నికల్‌ గానూ చెప్పుకోదగ్గ అంశమంటూ ఏమీ లేదు. సంగీతం అంతంతమాత్రమే. మాన్య నటన కాస్త ఫర్వాలేదు. మిగతావారి గురించి చెప్పుకోవడం దండగ.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X