అతి(ధి)నాయకుడు (రివ్యూ)
---సూర్య ప్రకాష్ జోశ్యుల
సంస్థ: శ్రీ కీర్తి కంబైన్స్
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, లక్ష్మీరాయ్, సలోని, జయసుధ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ప్రదీప్‌రావత్, సుకన్య, రెహమాన్, కాశీ విశ్వనాథ్, మురళీశర్మ, చరణ్‌రాజ్, ఎమ్మెస్‌నారాయణ, వేణుమాధవ్, ఆదిత్యమీనన్ తదితరులు.
సంగీతం: కల్యాణి మాలిక్
నిర్మాత: ఎం.ఎల్.కుమార్‌చౌదరి
కెమెరా: సురేందర్‌రెడ్డి,
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు,
సమర్పణ: సందీప్.
దర్శకత్వం: పరుచూరి మురళి
విడుదల: జూన్ 1,2012
ఓ గెటప్..దాన్ని జస్టిఫై చేయటానికి కొన్ని సీన్ల సెటప్,మరో గెపట్...మళ్లీ కొన్ని సీన్ల సెటప్..మళ్లీ మరో గెటప్... ఇలా మూడు పాత్రలు,మూడు సెటప్ లతో బాలకృష్ణ తాజా చిత్రం అధినాయకుడు ధియోటర్లోకి దూకింది. అయితే ఇలా కేవలం సెటప్,గెటప్ లతోటే స్క్రీన్ టైమ్ మొత్తం కాలక్షేపం చేసి, కథకు ఓ సమస్య,ఓ దిశ అనేది లేకుండా చేయంటంలో చూసేవారికి సహన పరీక్ష పెట్టింది. అప్పటికీ బాలకృష్ణ తనదైన శైలిలో మూడు పాత్రలకూ న్యాయం చేసి పండించి నిలబెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేసారు.
కాంట్రాక్టు కిల్లర్ బాబి(బాలకృష్ణ)అనుకోని సిట్యువేషన్ లో తను అనాధ కాదు తనకో కుటుంబం ఉందనే విషయం తెలుసుకుంటాడు. అంతేకాదు తన తండ్రి రామకృష్ణ ప్రసాద్(బాలకృష్ణ మళ్లీ)ని చంపేయాటనికి తననే వినియోగిస్తున్నారని అర్దం చేసుకుంటాడు. అప్పుడు తన తండ్రిని చంపాలనుకున్న ప్యాక్షనిస్ట్ (ప్రదీప్ రావత్)నుంచి రక్షించుదామని బయిలుదేరతాడు. కానీ కొన్ని అపార్దాల వల్ల కొడుకుని దగ్గరకు రానివ్వడు ఆ తండ్రి. చివరకు బాబి.. తన తండ్రికి ఎలా దగ్గరయ్యాడు. తన తాత హరిశ్చంద్ర ప్రసాద్(ముసలి బాలకృష్ణ) ఆశయాలు తెలుసుకుని ఏం చేసాడు అన్నది మిగతా కథ.
పొలిటికల్ మాస్ ఏక్షన్ ఎంటర్టైనర్ గా పబ్బిసిటీ చేస్తూ వచ్చిన ఈ చిత్రంలో బాలకృష్ణ ముసలి గెటప్ హైలెట్ గా కుదిరింది. అయితే చిత్రమేమిటంటే..కధను ఆ పాత్ర కొంచెం కూడా ముందుకు కదిలించదు. కేవలం అప్పట్లో అలాంటి పెద్దాయన ఆ కుటుంబంలో ఉన్నాడని మాత్రమే ప్లాష్ బ్యాక్ చెప్పుకోవటానికి మాత్రమే ఆ పాత్ర పనికి వచ్చింది. ఎందుకంటే...కథ ఎత్తుకున్న దాన్ని బట్టి కథ మొత్తం బాబి అనే కాంట్రాక్ట్ కిల్లర్ కథగా జరుగాలి. అప్పుడు బాబికి తన కుటుంబం ఉందటం తెలియటం,అలాగే తన కుటుంబానికి విలన్స్ ఉన్నారని అర్దమవటం..అప్పుడు ఏం చేసాడు అన్న పాయింట్ మీదనే కథ ముందుకు నడవాలి. కానీ ఫస్టాఫ్ కామిడీ కోసం...బాబీ క్యారెక్టర్ ని నడిపిన దర్శకుడు సెకండాఫ్ లో బాబీ పాత్రను నిర్ధాక్ష్యణంగా ప్రక్కకు తోసేసాడు. అతని సమస్యను,దాన్ని ఎలా పరిష్కరించుకున్నాడనే దానకి అస్సులు ప్రాధాన్యత ఇవ్వకుండా నడివయస్సు బాలకృష్ణ పాత్ర(బాబి తండ్రి),ముసలి బాలకృష్ణ పాత్ర(బాబి తాత)ల గురించి చెపుతూ కాల హరణం చేస్తాడు. దాంతో కథకు ఓ దిశ,గమ్యం లేకుండా పోయింది. ఇది కథన సమస్యే.
ఇక ఈ చిత్రం చూసేవాళ్ళు పబ్లిసిటీలో చేస్తున్నట్లుగా మిగతా పార్టీలపై సెటైర్స్ ఉంటాయని భావించారు. అలాంటివేమీ మచ్చుకైనా లేదు. ఇప్పటికే పాపులరైన విగ్రహాల మీద డైలాగు తప్ప సినిమాలో పొలిటికల్ వ్యగ్య బాణాలు లేవు. అయితే డైలాగులు చాలా చోట్ల బాగా పేలాయి. నటీనటుల విషయానికి వస్తే...బాలకృష్ణ మూడు పాత్రల్లో ముఖ్యంగా ముసలి పాత్రల్లో బాగా లీనమై చేసారు. యంగ్ బాలకృష్ణ గానే కాస్త ఎబ్బెట్టుగా అనిపించారు. హిరోయిన్ సలోని పాత్ర ఎందుకు పెట్టారో దర్సకుడుకే తెలియాలి. లక్ష్మిరాయ్ పాత్రను కేవలం స్కిన్ షోకే పరిమితం చేసారు. కామిడీలో బ్రహ్మానందం..పిచ్చివాడిగా బాగా చేసాడు. బ్రహ్మానందం ఇంట్రడక్షన్ సీన్ చాలా బాగా చేసారు. వేణుమాధవ్ సీన్స్ అనుకున్నంతగా పేలలేదు. విలన్ గా ప్రదీప్ రావత్...మూడు తరాల బాలకృష్ణలను ముప్పు తిప్పలు పెట్టాడు అనటానకి నమ్మేలా తీర్చి దిద్దలేదు. అతని బలం,బలగం చూపించి ఉంటే బాగుండేది.
దర్శకత్వం విషయానికి వస్తే.. పరుచూరి మురళి గత చిత్రాలు ఆంద్రుడు,రెచ్చిపో చిత్రాల తరహాలోనే చాలా కన్ఫూజింగ్ గా నడుస్తుంది. ఏదో చెప్పాలన్న దర్శకుడు తాపత్రయం కనిపిస్తుంది కానీ దానికి తగ్గ సీన్స్ కనపడవు. పాటలు రెండు బాగున్నాయి. ముఖ్యంగా ప్లాష్ బ్యాక్ లో వచ్చే పాట బాగుంది. సెకెండాఫ్ మరింత షార్ప్ ఎడిటింగ్ చేస్తే బావుండను అనిపించింది. కెమెరా వర్క్ బాగుంది. రీ రికార్డింగ్ యాక్షన్ సీన్స్ లో బాగా డల్ గా ఓల్డ్ సినిమాలను గుర్తు చేసింది.
ముందుగా మూడు రకాల గెటప్ లలో మిగతా హీరోలకు భిన్నంగా విభిన్నతను ప్రదర్శిస్తూ నటించినందుకు బాలకృష్ణను అభినందించాలి. చివరగా ఈ చిత్రం అభిమానులను సంతృప్తి పరచ వచ్చేమే కానీ మిగతావారికి కష్టమనిపిస్తుంది. బాలకృష్ణ చేత కాంట్రాక్ట్ కిల్లర్ లాంటి పాత్రలు చేయకుండా ఉంటే బావుండనని ఖచ్చితంగా తేల్చి చెపుతుంది. ఈ చిత్రం చూసి ఉపశమనం కోసం మళ్లీ ఏ టీవీలోనే సింహా చిత్రం చూడాలనిపిస్తుంది.


Click it and Unblock the Notifications











