twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విభిన్నరీతిలో ప్రేమజంటని కలిపిన 'బలరాం'

    By Staff
    |

    Bala Ram
    - సౌమిత్‌
    చిత్రం: బలరాం
    విడుదల తేదీ: మార్చి 31న ఆంధ్రలోను, నైజాంలోను విడుదలైన ఈ చిత్రం ఏప్రిల్‌ 1న సీడెడ్‌లో విడుదలైంది.
    నటీనటులు: శ్రీహరి, వినీత్‌, రాశి, మహేశ్వరి, నాగేష్‌, రామిరెడ్డి,
    విజయ్‌, శివపార్వతి, రాధాప్రశాంతి, శ్రీధరన్న, భరణి,
    ఎం.ఎస్‌.నారాయణ, బెనర్జీ తదితరులు...
    సంగీతం: విద్యాసాగర్‌
    కెమెరా: రాము పినిశెట్టి
    సమర్పణ: బి.ఆర్‌.నాయుడు
    ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: సత్యానాగరాజు
    సహనిర్మాతలు: సి.వెంకటేశ్వరరావు, ముత్యాల రమేష్‌
    నిర్మాత: సి.కల్యాణ్‌
    స్క్రీన్‌ప్లే దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి

    నిర్మాతకు, రచయితకు మధ్య ఏర్పడిన వివాదం వల్ల కధ అందించిన పోసాని కృష్ణమురళి పేరు టైటిల్‌ కార్డ్స్‌లో తొలగించారు.

    యుక్త వయస్సులో ఉన్న అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకోవడం, దానికి వారిద్దరి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు అడ్డుపడడం, వారిని ఎదిరించిన హీరో అష్టకష్టాలు పడి చివరకు ఆ ప్రేమజంటను కలపటం వంటి అంశాలతో గతంలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. వాటిలో కొన్ని విజయవంతం కూడా అయ్యాయి.అదే తరహాలో రూపొందిన ఈ చిత్రంలో ట్విస్ట్‌ ఏమిటంటే అలాంటి ప్రేమజంటను కలపడానికి ఆ అమ్మాయిని వివాహం చేసుకుని ప్రియునికి అప్పగించడం. ఈ చిన్న ట్విస్ట్‌తో చిత్రం కథనం పకడ్బందీగా రూపొందించారు. స్క్రీన్‌ ప్లే బాగా ఉండడంతో కథ వేగవంతంగా పరుగులు తీసింది. శ్రీహరి హీరోగా చేసిన గత చిత్రాలకీ, ఈ చిత్రానికీ మధ్య టేకింగ్‌లో స్పష్టమైన తేడా కనిపించింది. బహుశా దీనికి కారణం దర్శకుడు రవిరాజా కావడమేమో.

    డ్యూటి అంటే ప్రాణమిచ్చే సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ బలరాం. వినీత్‌, మహేశ్వరి ప్రేమజంట. వీరిద్దరి ప్రేమకు వినీత్‌ తాత నాగేష్‌ ఒప్పుకుని పెళ్ళి సంబంధం విషయం మాట్లాడడానికి మహేశ్వరి తండ్రి రామిరెడ్డి వద్దకు వెళ్ళి ఆయన ఆగ్రహానికి గురై దెబ్బలు తిని వస్తాడు. దాంతో ఆవేశపడి వెళ్ళిన వినీత్‌ కూడా దెబ్బలు తిని హాస్పిటల్‌ పాలవుతాడు. ఇంటి నుంచి పారిపోయి వచ్చిన మహేశ్వరితో కలిసి ఎటైనా పారిపోయి సుఖంగా బ్రతమకని చెప్పిన తాత కోరిక మేరకు అలా వెళ్ళి పెళ్ళి చేసుకుని ఆనందంగా ఉన్న సమయంలో రామిరెడ్డి మనుషులు వచ్చి ఇద్దర్ని విడదీసి వినీత్‌మీద కిడ్నాపింగ్‌ కేసు పెట్టి జైల్లో వేయించడమే కాకుండా మహేశ్వరి తాళి తెంచి మరో పెళ్ళి చేయ నిశ్చయిస్తారు. ఇది తెలిసిన బలరాం నిజం తెల్సుకోవడానికి అందర్నీ సమావేశపర్చగా తల్లి ప్రాణాలకు గండం ఉందని తెల్సినా మహేశ్వరి నిజం చెప్పగా వినీత్‌ మాత్రం తాత ప్రాణాలు కాపాడుకోవడానికి తమ మధ్య ఏ సంబంధం లేదని చెప్తాడు.

    మహేశ్వరి కూడా తన తల్లి ప్రాణాలు కాపాడుకోవడం కోసం రెండో పెళ్ళికి అంగీకరిస్తుంది. పెళ్ళి జరగనున్న సమయంలో వీరిద్దరి ప్రేమభాగోతం పాంప్లెట్స్‌ రూపంలో రావడంతో నిజానిజాలు తెల్సుకోవాలన్న పెళ్ళికొడుకు కోరిక మేరకు వినీత్‌ని తీసుకుని వస్తాడు బలరాం. అయితే పెళ్ళిపందిట్లో రివర్స్‌ అయిన వినీత్‌ ఆమెకు పెళ్ళితో పాటు శోభనం కూడా అయిందని చెప్పటంతో ఆ పెళ్ళి ఆగిపోతుంది. కోపోద్రిక్తుడైన రామిరెడ్డి వినీత్‌, నాగేష్‌లను చంపబోగా అడ్డుపడ్డ బలరాం మహేశ్వరిని తాను పెళ్ళి చేసుకుంటానని చెప్పి రిజిష్టర్‌ మ్యారేజ్‌ చేసుకుని ట్రాన్స్‌ఫర్‌ పేరుతో వేరే ఊరికి షిఫ్ట్‌ అయి శోభనం రోజున అసలు నిజాన్ని వెల్లడిస్తూ ప్రేమికుల్ని కలపడానికి అంతకంటే గత్యంతరం లేకపోయిందని చెప్పి ఫ్లాష్‌బ్యాక్‌లో ఓ రౌడీ హత్యను కళ్ళారా చూసిన రాశిని తాను వివాహమాడడం, సాక్ష్యం చెప్పబోతున్న ఆమెను ఆ విలన్‌ నడిరోడ్డులో హత్య చేయడం, ఆ తర్వాత తాను మందుకు బానిస కావడం గురించి వివరించి తనలాగే ఏ ప్రేమ జంటా విడిపోరాదని కోరుకుంటున్నానని చెప్పి వినీత్‌కి అప్పగించి వారిద్దరినీ ఎటైనా దూరంగా వెళ్ళిపోమని ట్రైన్‌ ఎక్కిస్తాడు. అయితే ఇదంతా తెలుసుకున్న విలన్‌ గ్యాంగ్‌ని ఆ ట్రైన్‌లో చూసి తాను కూడా ఆ ట్రైన్‌ని క్యాచ్‌ చేసి విలన్స్‌ని తుదముట్టించి ప్రేమ జంటను ఏకం చేయడంతో కథ ముగుస్తుంది.

    కథ కంటే కథనం, ఆ కథనంలో వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్స్‌, పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ ఈ చిత్రానికి ఆయువుపట్టులా నిలిచాయి. ప్రత్యేకించి ప్రారంభంలో హీరో ఇంట్రడక్షన్‌ ఫైట్‌, పోలీస్‌స్టేషన్లలో పొన్నాంబళం ఫైట్‌, ఆ తర్వాత పోలీస్‌లని కొట్టే సీన్‌, ఇంట్రవల్‌ షాట్‌, కల్యాణమండపంలో వినీత్‌ రివర్స్‌ అయ్యే సీన్‌, రాశి పెళ్ళిచూపుల సీన్‌, క్లయిమాక్స్‌లో ట్రైన్‌ ఎపిసోడ్‌ హైలైట్‌ అవుతాయి.

    ఈ చిత్రానికి అతి పెద్ద మైనస్‌ పాయింట్‌ మహేశ్వరి. ప్రేతకళ ఉట్టిపడ్డట్లున్న ఆమె నటించిన కరుణరస సన్నివేశాల్లో కృత్రిమంగా ఉంది. సంభాషణలు పదునుగా ఉన్నప్పటికి కొన్ని చోట్ల శృతిమించి వల్గారిటీని ధ్వనింపచేశాయి. రాశిని చంపిన విలన్‌ చివరికి రామిరెడ్డితో ఎందుకు చేతులు కలపాల్సి వచ్చింది, శ్రీహరి ఆడిన నాటకం విలన్స్‌కి ఎలా తెలిసింది, మొదలైన విషయాల్ని సినిమాటిక్‌గా భావించాలేమో! రవిరాజా లాంటి పర్‌ఫెక్షనిస్ట్‌ దర్శకత్వం వహించిన చిత్రాల్లో ఇటువంటి లోపాల్ని ఊహించలేం.

    బహుశా హర్రీబరీగా తీయడం వల్ల అలాంటి లోటుపాట్లు జరిగి ఉండవచ్చు. ప్రొడక్షన్‌ పరంగా కాస్టింగ్‌లోను, ఖర్చు పరంగా లావిష్‌నెస్‌ లోను ఎటువంటి లోపం కనపబడలేదు. సినిమా మొత్తం రిచ్‌గా కనబడుతుంది. నటీనటుల పెర్ఫార్మెన్స్‌ విషయానికి వస్తే నాగేష్‌దే అగ్రతాంబూలం. వినీత్‌ తాతగా ఆయన ఈ వయసులో కూడా పోటీపడి నటించాడు. శ్రీహరి నటనలో ముందు చిత్రాల కంటే మెచ్యూరిటీ కనిపించింది. ఉన్నంతలో రాశి బాగానే చేసింది. మహేశ్వరి బాగా నటించినా ఫిజిక్‌పరంగా ఫేస్‌లో ఉన్న లోపం వల్ల అది అంతగా రిజిస్టర్‌ అవదు. మిగిలిన పాత్రలన్నీ సోసోగా ఉన్నాయి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X