Bambai Meri Jaan Review బొంబాయి నేర సామ్రాజ్యానికి దావూద్ ఇబ్రహీం కింగ్ ఎలా అయ్యాడు? బొంబాయి మేరీ జాన్ రివ్యూ
నటీనటులు: కేకే మీనన్, అవినాష్ తివారీ, కృతిక కమ్రా, అమీరా దస్తర్, నివేదితా భట్టఛార్య, సౌరబ్ సచ్‌దేవా, జితిన్ గులాటీ, నవాబ్ షా, దినేష్ ప్రభాకర్ తదితరులు
దర్శకత్వం: షుజాత్ సౌదాఘర్
క్రియేటర్: రెన్సిల్ డి సిల్వా
రచన, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: హుస్సేన్ దలాల్, చైతన్య చోప్రా
నిర్మాతలు: ఫర్హాన్ అఖ్తర్, రితేష్ సిద్వానీ, కాసీమ్ జగ్మాజియా
సినిమాటోగ్రఫి: అనుజ్ రాకేష్ ధావన్, జాన్
ఎడిటింగ్: సంజయ్ ఇంగ్లే, తుషార్ పరేఖ్
పుస్తక ఆధారం: డోంగ్రి టు దుబాయ్: సిక్స్ డికేడ్స్ ఆఫ్ ది ముంబై మాఫియా
ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఎపిసోడ్స్: 10 (నిడివి 30 నుంచి 40 నిమిషాలు)
ఓటీటీ రిలీజ్ డేట్: 2023-09-14
1965 సంవత్సరంలో నీతి, నిజాయితీతో కూడిన ఇన్స్‌పెక్టర్ ఇస్మాయిల్ ఖాద్రీ (కేకే మీనన్) బొంబాయి నగరంలో ఉద్యోగంలో చేరుతాడు. అప్పటికే హాజీ (సౌరబ్ సచ్‌దేవా), పఠాన్ (నవాబ్ షా) మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో ఉంటారు. హాజీ, పఠాన్ ముఠాలను ముట్టుపెట్టేందుకు ఇస్మాయిల్ ఖాద్రీ ఆపరేషన్స్ ప్రారంభిస్తాడు. పేదరికంలో మగ్గేలా చేస్తున్న తండ్రి నీతి నిజాయితీని కుమారులు దారా ఖాద్రీ (అవినాష్ తివారీ), సాదిక్ (జితన్ గులాటీ), కుమార్తె హబిబా తీవ్రమైన అసంతృప్తిని ప్రకటిస్తుంటారు.

తండ్రి భావాలు వ్యతిరేకంగా దారా ఖాద్రీ చిల్లర దొంగతనాలు అలవాటు పడుతాడు. ఆ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హాజీ వద్ద పనిచేసే ఇస్మాయిల్ ఖాద్రీ బావమరిది చేతిలో పోలీస్ చనిపోతాడు. అయితే బావమరిదిని ఈ కేసు నుంచి తప్పించే క్రమంలో ఇస్మాయిల్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చిక్కుతాడు. ఉద్యోగం పోవడంతో ఇస్మాయిల్ ఖాద్రీ కుటుంబ రోడ్డును పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ క్రమంలో దారా ఖాద్రీ మాఫియా ప్రపంచంలోకి అడుగుపెట్టి.. హాజీ, పఠాన్‌తో చేతులు కలుపుతాడు.
నీతి నిజాయితీగా ఉండే ఇన్స్‌పెక్టర్ ఇస్మాయిల్ ఖాద్రీ ఎందుకు తన బావమరిదిని రక్షించాలని తప్పటడుగు వేస్తాడు? తండ్రిని నిజాయితీని దారా ఖాద్రీ, సాదిక్ ఖాద్రీ, హబీబా ఖాద్రీ ఎందుకు వ్యతిరేకిస్తారు? ఏ పరిస్థితుల్లో దారా ఖాద్రీ నేర ప్రపంచంలోకి అడుగుపెడుతాడు? తనకు గురువుగా భావించే హాజీకి ఎదురు తిరిగి సొంత మాఫియా కుంపటి పెడుతాడు? పఠాన్, అన్నా రాజన్ ముదిలియార్‌తో దారా ఎందుకు శత్రుత్వాన్ని పెంచుకొంటాడు?

పరి పటేల్‌తో దారా ప్రేమాయణం ఎందుకు బ్రేకప్ అయింది? అన్నయ్య దారా ఖాద్రీ బాటలో సోదరి హబీబా ఖాద్రీ ఎందుకు నడవాలని అనుకొంటుంది? తమకు పోటీ సామ్రాజ్యాన్ని స్థాపించిన దారా ఖాద్రీ కుటుంబాన్ని హాజీ, పఠాన్, ముదలియార్ ఎలా మట్టుబెట్టాలని చూశాడు? పఠాన్ మరణం తర్వాత దారా ఖాద్రీ బొంబాయి వదలి దుబాయ్‌కు ఎందుకు మకాం మార్చాడు అనే ప్రశ్నలకు సమాధానమే బొంబాయి మేరీ జాన్ వెబ్ సిరీస్ కథ.
బొంబాయి మేరీ జాన్ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే.. మహనగరాన్ని గడగడలాడించిన మాఫియా డాన్ దావూద్ ఇబ్బ్రహీం జీవిత కథ ఇది. డోంగ్రి టు దుబాయ్: సిక్స్ డికేడ్స్ ఆఫ్ ది ముంబై మాఫియా అనే పుస్తకం ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. హాజీ మస్తాన్, ముదలియార్, కరీం లాలా, దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్ లాంటి మాఫియా డాన్లు ఎలా పుట్టారు.. వారి జీవితం ఎలా ప్రారంభమైందనే విషయాన్ని చాలా డీటైల్డ్‌గా చూపించడంలో దర్శకుడిగా షుజాత్ సౌదాఘర్, నిర్మాతలుగా ఫర్హాన్ అఖ్తర్, రితేష్ సిద్వానీ, కాసీమ్ జగ్మాజియా సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.

బొంబాయి నగరంలో 1965 సంవత్సరంలో హాజీ, పఠాన్‌లు ఎలా మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరించారనే అంశంతో కథ మొదలవుతుంది. ఆ క్రమంలో బొంబాయికి ట్రాన్స్‌ఫర్ అయి వచ్చిన నిజాయితీ పోలీస్ ఆఫీసర్ ఇస్మాయిల్ ఖాద్రీ క్యారెక్టర్, అలాగే ఫ్యామిలీ సెటప్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి నాలుగు ఎపిసోడ్స్ తీసుకొన్నారు. కథను పూస గుచ్చినట్టు చెప్పడం ద్వారా వెబ్ సిరీస్ స్లోగా సాగినట్టు అనిపిస్తుంది. ఎప్పుడైతే దారా ఖాద్రీ మాఫియా డాన్‌గా ఎదగడం మొదలవుతుందో అప్పటి నుంచి కథలో వేగం, యాక్షన్, ఎమోషన్స్ భారీగా కనిపిస్తాయి.
బొంబాయి మేరీ జాన్ వెబ్ సిరీస్ 4వ ఎపిసోడ్ తర్వాత సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ సాగుతుంది. 5, 6, 7 ఎపిసోడ్స్‌లో దారా ఖాద్రీ (దావూద్ ఇబ్రహీం) ఎలా డాన్‌గా మారారు. దారాకు సాదిక్, మరో సోదరుడు, సోదరి హబీబా ఎలా అండగా నిలిచారు అనే విషయాలను ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఇక సోదరుడు సాదిక్‌ను పఠాన్ (కరీం లాలా) ఎలా మట్టుబెట్టిన ఎపిసోడ్ బాగుంటుంది. అలాగే దారా తల్లిని హాస్పిటల్‌లో చెకప్ సందర్భంగా దారా వర్గానికి, పఠాన్, ముదలియార్ వర్గానికి జరిగిన ఎన్‌కౌంటర్ వెబ్ సిరీస్‌కు హైలెట్‌గా ఉంటుంది. చివరి రెండు ఎపిసోడ్స్‌లో చోటా రాజన్ మాఫియా డాన్ ఎదిగే అంశాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. చివరి ఎపిసోడ్‌లో దారా, తండ్రి ఇస్మాయిల్‌కు మధ్య ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకొంటాయి.
ఇస్మాయిల్ ఖాద్రీగా కేకే మీనన్ మరోసారి అద్బుతంగా నటించాడు. పోలీస్ ఆఫీసర్‌గా, తన కళ్లముందే పిల్లలు మాఫియాలోకి వెళ్తున్న తీరు చూసి మదన పడే తండ్రిగా హుందాగా, ఎమోషనల్ నటనను ప్రదర్శించాడు. ఇక దావూద్ ఇబ్రహీం పాత్రలో దారా ఖాద్రీగా అవినాష్ తివారీ, అతడి సోదరి సాదిక్ ఖాద్రీగా జతిన్ గులాటీ, సోదరి హబీబా ఖాద్రీ పాత్రలో కృతిక కమ్రా తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
దారాగా అవినాష్ తివారీ చూపించిన హావభావాలు, యాటిట్యూబ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుంది. దారా ప్రేయసిగా పరి పటేల్‌గా అమీరా దస్తర్ పాత్ర చిన్నదైనా గుర్తుండి పోతుంది. హాజీగా సౌరబ్ శుక్లా, పఠాన్‌గా నవాబ్ షా, చోటా బబ్బన్‌గా ఆదిత్య రావాల్ తనదైన శైలిలో బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. దారా తల్లి పాత్ర సకీనాగా నివేదిత భట్టాచార్య ఎమోషనల్ పాత్రలో కనిపించారు.
ఇప్పటికే ముంబై మాఫియా సామ్రాజ్యంపై ఎన్నో కథలు సినిమాలుగా వచ్చాయి. అయితే దావూద్ ఇబ్రహీం ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఎలా మారాడు? దావూద్ ఇబ్రహీం జీవితం ఎలా మొదలైంది? దావూద్ ఇబ్రహీం ఎలా బొంబాయి నేర ప్రపంచానికి అధిపతిగా మారాడు అనే విషయాలను చాలా స్పష్టంగా చూపించారు. ముంబై మాఫియా కథలపై ఆసక్తికరంగా ఉండే వారికి, క్రైమ్ థ్రిల్లర్స్ ఎంజాయ్ చేసే వారికి తప్పకుండా బొంబాయి మేరీ జాన్ నచ్చుతుంది.


Click it and Unblock the Notifications











