twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బంగారం' కాదు

    By Staff
    |
    Bangaram

    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    సినిమా: బంగారం
    విడుదల తేదీ: 03-05-2006
    నటీనటులు: పవన్‌కళ్యాణ్‌, మీరా చోప్రా, రీమాసేన్‌, ఆనంద్‌ రాజా,
    అశుతోష్‌ రాణా, తణికెళ్ల భరణి, ఎమ్మెస్‌ నారాయణ, రవిబాబు, ఎవియస్‌,
    బేబీ సనూష, కవితాశ్రీ, శ్రీనివాస రెడ్డి, ముఖేష్‌ రుషి, వేణుమాధవ్‌, షకీలా,
    ఆలీ, ధర్మవరం సుబ్రహ్మణ్యం తదితరులు.
    కెమెరా: గోపీనాథ్‌
    మాటలు: ఆకుల శివ
    సంగీతం: విద్యాసాగర్‌
    ఎడిటింగ్‌: వి.టి. విజయన్‌
    కొరియోగ్రఫీ: రాజు సుందరం, కళ్యాణ్‌, సబీనా ఖాన్‌
    ఫైట్స్‌: రాకీ రాజేష్‌
    ఆర్ట్‌: ఆనందశాయి
    పాటలు: భువనచంద్ర, సాహితి
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ధరణి
    నిర్మాణం: శ్రీ సూర్య మూవీస్‌

    ప్రతి చిత్రంలోనూ ప్రత్యేకతకు ప్రయత్నించే పవన్‌ కళ్యాణ్‌ కూడా రొటీన్‌ ఫాక్షన్‌ కథలోకి రాక తప్పలేదు. సూపర్‌హిట్‌ ఖుషీ నిర్మాత చిరకాల విరామం తర్వాత పవన్‌తో చేసిన చిత్రం ఇది. దిల్‌, ధూల్‌ (తమిళ) వంటి మెగాహిట్స్‌ దర్శకుడు ధరణి బంగారం సినిమాను తనదైన శైలిలో పూర్తి యాక్షన్‌ చిత్రంగా రూపొందించారు. పవన్‌ కళ్యాణ్‌ ఎప్పటిలాగే తనదైన మ్యానరిజం, బాడీ లాంగ్వేజ్‌లతో ఎనర్జీగా నటించాడు. కానీ కథలో హీరోహీరోయిన్ల ప్రేమ సన్నివేశాలు లేకపోవడం, హీరోయిన్‌ వేరే అతణ్ని ప్రేమిస్తే వారిని కలపడానికి హీరో యాక్షన్‌లోకి దిగడమే సినిమా కావడం మితిమీరిన హింస వంటి విషయాలను చాలా మంది ప్రేక్షకులకు మింగుడు పడవు.

    'బంగారం' (పవన్‌ కళ్యాణ్‌) ధైర్యం, సాహసం గల టీవీ చానల్‌ రిపోర్టర్‌. బిబిసిలో చేరాలనేది అతని జీవితాశయం. కానీ అనుకోని విధంగా ఉద్యోగం ఊడుతుంది. బిబిసిలో చేరడానికి కాండక్ట్‌ సర్టిఫికెట్‌ కోసం అమెరికా నుంచి ఇండియాకు పిల్లలతో వస్తున్న ఎండి పెద్దారెడ్డి (ముఖేష్‌ రుషి)ని కలుస్తాడు. ఆయనను ఒప్పించే ప్రయత్నంలో ఆయన కూతురుతో కలిసి కర్నూలు దగ్గర గల ఆయన సొంతూరు పత్తికొండ చేరుతాడు. ఆయన పెద్ద కూతురు (మీరా చోప్రా) తగువు పడి అక్కడ జరిగే జాతర కవర్‌ చేసి వెళ్లేలా షరతు పెట్టించుకుంటాడు. అలా అక్కడ బంగారం ఇరుక్కుపోతాడు. ఇక అక్కడి ఫాక్షన్‌ లీడర్‌ భూమారెడ్డి (అశుతోష్‌ రాణా) పెద్దారెడ్డితో పొత్తు కోసం నక్క వినయాలు ప్రదర్శిస్తుంటాడు. పెద్దారెడ్డి కూతుర్ని అతడి తమ్ముడికిచ్చి చేయాలనేది అతని కోరిక. బంగారం మీరాచోప్రాతో చనువుగా ఉండటం చూసి బంగారాన్ని చంపేయాలని అనుచరులను ఆదేశిస్తాడు. ఈలోగా పెద్దారెడ్డి తనకూతురిని వాళ్ల తమ్ముడికిచ్చి పెళ్లి చేయడానికి నిశ్చితార్థం పెట్టుకుంటాడు. దాంతో మీరా చోప్రా ఊరు విడిచి పారిపోయే ప్రయత్నం చేస్తుంది. ఆమెను వెదికి తెచ్చిన బంగారానికి ఓ విషయం తెలుస్తుంది. అది మీరా చోప్రా ఆనంద్‌ రాజాని ప్రేమించిందనేది ఆ విషయం. ఇక బంగారం వాళ్ల ప్రేమను ఫాక్షన్‌ కత్తుల నుంచి తప్పించి ఎలా బతికించాడనేదే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

    ఇదే స్టోరీలైన్‌తో గతంలో వచ్చిన రవిబాబు సోగ్గాడు సినిమా ఈ చిత్రం చూస్తున్నప్పుడు గుర్తుకు రాకమానదు. వేరేవాళ్ల ప్రేమను బతికించడానికి హీరో కష్టపడటం బాక్సాఫీసును గెలిచే పాయింటే. కానీ వేరే వ్యక్తిని ప్రేమించే యువతి హీరోయిన్‌ అయితేనే ఇబ్బంది. ఒక్కడు, భద్ర వంటి సినిమాలు ఫాక్షన్‌ డ్రాప్‌ ప్రేమకథలే అయినా ఇలా రాంగ్‌ ట్రాప్‌లో పడకపోవడంతో క్షేమంగా గట్టెక్కాయి. స్క్రీన్‌ప్లే చూస్తే సినిమా క్లాసిక్‌ నెరేషన్‌లో నడిచినా ఫస్టాఫ్‌ మొత్తం స్టోరీ సెటప్‌కే సరిపెట్టారు. ఇంటర్వెల్‌ అయ్యాక గాని హీరో కథాసంబంధమైన లక్ష్యంలోకి రాడు. ఇది కొద్దిగా ఇబ్బందే. అయితే సెకండాఫ్‌లో రాజాను వెతికే క్రమం మాత్రం స్పీడ్‌గా బోర్‌ కొట్టకుండా లాగారు. ధరణి తన పద్ధతిలో ప్రతి నాయక పాత్రను వోవర్‌గా ఎస్టాబ్లిష్‌ చేశాడు. పోలీసులు, ఊరి జనం అంత అన్యాయం జరుగుతుంటే నోరెత్తరా అని అనుమానం వస్తుంది. లవ్‌ ట్రాక్‌ లేకపోవడంతో పవన్‌ నుంచి రెగ్యులర్‌గా ఆశించే కామెడీ, రోమాంటిక్‌ మూవ్‌మెంట్స్‌ మిస్సయ్యాయి. ముఖేష్‌ రుషి రైలెక్కించే సీన్‌ హీరోయిన్‌ను అనుకరిస్తూ పవన్‌ చేసే అల్లరి ,కుక్క కోసం చేసే ఫైట్‌ బాగా పండాయి. వేణుమాధవ్‌ కామెడీ పెద్దగా పండలేదు. చివరలో హీరో కనపించకుండా చాలా సేపు హీరోయిన్‌ చెల్లెలి మీద మెలోడ్రామ్‌ ప్లే చేయడం తమిళంలో చెల్లొచ్చునేమో గానీ తెలుగులో కష్టమే. ఏది ఏమైనా రాయలసీమలో అంత సైకో ఫాక్షనిస్టులుంటారా అనేది ఆలోచించాల్సిన విషయం. ఎంత ఫిక్షన్‌ అయినా బ్యాక్‌డ్రాప్‌కు అనుకూలంగా కొంత వాస్తవికతతో చిత్రిస్తే బిలీవిబిలిటీ వచ్చి బాగుండేది. కెమెరా వర్క్‌ బాగుంది. ఎడిటింగ్‌ కొన్ని సీన్‌లలో మరీ షార్ప్‌గా ఉంది. అది సినిమా కంటిన్యూటీకి కొంచెం ఇబ్బంది. దర్శకుడికి యాక్షన్‌ సీక్వెన్స్‌లో మంచి మార్కులు పడతాయి. ఆకుల శివ డైలాగ్‌లో పెద్దగా పేలలేదు గానీ కథలో బాగానే అమిరాయి. హీరోయిన్‌ పాత్ర కాస్తా హుషారుగా ఉంటే బాగుండేది. టైటిల్‌ సాంగ్‌ మినహా ఏ పాటా పెద్దగా ఆకట్టుకునే స్థాయిలో లేదు. మొదటి పాట కొరియోగ్రఫీ బాగుంది. రీమాసేన్‌ పాత్ర సినిమాకు కొద్దిగా కూడా ఉపయోగపడేది కాదు.

    ఏది ఏమైనా మాస్‌ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చేసిన ఈ చిత్రం హింస బాగా ఎక్కువగా ఉండటంతో, ఆ హింసకు హేతుబద్దత లేకపోవడంతో ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చే అవకాశం లేదు. గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X