Bapu Review: బాపు మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: బ్రహ్మాజీ, ఆమని, అవసరాల శ్రీనివాస్, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఎగుర్ల, రచ్చ రవి, గంగవ్వ తదితరులు
రచన, దర్శకత్వం: దయా
నిర్మాతలు: రాజు, సిహెచ్. భాను ప్రసాద్ రెడ్డి
సినిమాటోగ్రఫి: వాసు పెండెం
మ్యూజిక్: RR ధ్రువన్
ఎడిటింగ్: అనిల్ ఆలయం
బ్యానర్: కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2025-02-21
తెలంగాణలోని ఓ పల్లెలో ఆర్థిక సమస్యలతో మల్లయ్య (బ్రహ్మాజీ) తన బతుకును కష్టంగా లాగిస్తుంటాడు. భార్య సరోజా (ఆమని), కొడుకు రాజు (మణి ఏగుర్ల), వరలక్ష్మీ (ధన్య బాలకృష్ణ), తండ్రి రాజయ్య (బలగం సుధాకర్ రెడ్డి)తో జీవితాన్ని భారంగా మల్లయ్య నెట్టుకొస్తుంటాడు. దానికి తోడు పత్తి పంట వల్ల వచ్చిన నష్టంతో పీకల్లోతు అప్పుల పాలవుతాడు. అప్పులు ఇచ్చిన వాళ్లు ఇంటిపైకి వచ్చి పీకలపై కూర్చొంటారు. అప్పు చెల్లించాలి లేదా పొలం అమ్మి డబ్బులు వెనక్కి ఇవ్వాలని పట్టుబడుతారు. ఆ సమయంలో మల్లయ్యకు ఆత్మహత్యనే దారిగా కనిపిస్తుంది. ఈ క్రమంలో మరో వ్యక్తి (రచ్చ రవి)కి బంగారు దేవత విగ్రహం లభిస్తుంది. కానీ దానిని తన తల్లి (గంగవ్వ) బావిలో పడేస్తుంది.

రైతు మల్లయ్య అప్పుల బారిన ఎలా పడ్డాడు? పత్తి పంట భారీగా పండినా ఎలా నష్టాలకు గురయ్యాడు? అప్పు తీర్చలేని సమయంలో ఆత్మహత్య నిర్ణయం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? సూసైడ్ నిర్ణయంతో మల్లయ్య బతుకు ఎలా దుర్భరంగా మారింది? ఆత్మహత్య నిర్ణయం తెలుసుకొన్న భార్య సరోజా ఎలాంటి సలహాను ఇచ్చింది? తన అప్పుల బాధ నుంచి విముక్తి కావడానికి తండ్రి రాజయ్య ప్రాణాలను ఎలా పణంగా పెట్టాలనుకొన్నాడు? మల్లయ్య కొడుకు రాజు ప్రేమ కథ, కూతురు వరు లవ్ స్టోరీలకు ముగింపు ఏమిటి? రచ్చ రవికి బంగారు దేవత విగ్రహం లభించిందా? ఆ విగ్రహం ఎవరి చేతికి చిక్కింది? చివరకు మల్లయ్య జీవితానికి ఎలాంటి ముగింపు లభించింది? బంగారు దేవత విగ్రహం కథను ఎలా మలుపు తిప్పింది అనే ప్రశ్నలకు సమాధానమే బాపు సినిమా కథ.
దేశంలోని రైతుల ఆర్థిక సమస్యలకు ప్రతిరూపంగా నిలిచే కథను దర్శకుడు దయా ఎంచుకొన్న తీరు అభినందనీయం. ఈ కథను నిజాయితీగా తెరకెక్కించిన తీరు బాగుంది. కమర్షియల్ వాల్యూస్‌కు వెళ్లకుండా పాత్రలకు తగినట్టుగా బ్రహ్మాజీ, ఆమని, సుధాకర్ రెడ్డి లాంటి నటులను ఎంచుకోవడంతోనే సగం విజయం సాధించాడని చెప్పవచ్చు. అయితే కథలో వేరియేషన్ లేకపోవడం వల్ల సింగిల్ పాయింట్ ఎజెండాతో లాక్కొచ్చే ప్రయత్నం కొంత రొటీన్‌గా అనిపిస్తుంది. ఆ పాయింట్‌కు అదనంగా కూతురు, కొడుకు ప్రేమ కథలను జోడించడం ద్వారా స్టోరీలో వేరియేషన్ కోసం ప్రయత్నించాడు. కానీ సినిమాకు బలంగా వర్కవుట్ అయినట్టు కనిపించదు. కానీ ఎమోషన్స్ పండించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

నటీనటులు విషయానికి వస్తే.. మల్లయ్య పాత్రలో బ్రహ్మాజీ, రాజయ్య పాత్రలో సుధాకర్ రెడ్డి, గృహిణి పాత్రలో ఆమని మంచి నటనతో ఆకట్టుకొన్నారు. తమ పాత్రల్లో పరకాయ ప్రవేశమే చేశారని చెప్పాలి. కథలోని ఎమోషన్స్ ప్రకారం.. పాత్రలను సజీవంగా మార్చడంలో తమ ప్రతిభను చూపించారు. ఇక రచ్చ రవికి లభించిన క్యారెక్టర్‌ను చక్కగా వినియోగించుకొన్నాడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో కొత్తదనాన్ని చూపించాడు. మణి ఏగుర్ల, ధన్య బాలకృష్ణ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ చిత్రంలో నటించిన వారంతా తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఆర్ఆర్ ధృవన్ అందించిన మ్యూజిక్, వాసు పెండెం చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకు ప్లస్ పాయింట్స్. పల్లె వాతావరణాన్ని, తెలుగు రైతులు వెతలను చక్కగా తన కెమెరాలో వాసు బంధించారు. దయా రాసుకొన్న సన్నివేశాలు, డైలాగ్స్ గుండెను తట్టి లేపుతాయి. రాజు, భానుప్రసాద్ రెడ్డి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథపై ఉన్న ప్రేమను తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చూస్తే వారికి సినిమాపై ఉన్న అభిరుచిని తెలియజేస్తుంది.
పీకల్లోతు కష్టాల్లో ఉన్న రైతులకు రైతు భీమా పథకం ఆత్మహత్యలకు ఎలా ప్రేరేపిస్తుందనే భావోద్వేగమైన పాయింట్‌తో తెరకెక్కించిన కథ బాపు. తండ్రి, కొడుకుల మధ్య బంధం ఆధారంగా ఈ కథ నడుస్తుంది. సామాజిక, ఆర్థిక పరిస్థితులను దర్శకుడు దయా చక్కగా తెరకెక్కించారు. దర్శకుడి విజన్‌ను నటీనటులందరూ తెరపైకి తీసుకొచ్చి మంచి పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. ఈ సినిమా బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు చేరువైతే మంచి విజయం సాధించే అవకాశం ఉంది. హృదయాన్ని పిండేసే సన్నివేశాలు ఈ కథకు బలంగా మారాయి. సామాజిక స్పృహ నేపథ్యంగా వచ్చే సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఈ వారం ఈ సినిమాపై ఓ లుక్ వేయండి.


Click it and Unblock the Notifications











