నచ్చినట్లే నచ్చిన బావనచ్చాడు

చిత్రం: బావనచ్చాడు
నటీనటులు: నాగార్జున, సిమ్రాన్, రీమాసేన్, సుమారంగనాథ్, మనోరమ...
ఫోటోగ్రఫీ: శ్యాం.కె.నాయుడు
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
నిర్మాత: ఎం.అర్జునరాజు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్
ఎదో ఒక థీమ్ తీసుకొని వినోదాత్మకంగా చెప్పగలిగితే చాలు ఆ సినిమా బాగున్నట్లే ఈ రోజుల్లో. ఇద్దరు పెళ్ళాలు అన్న పాయింట్ ను వినోదభరితంగా చెప్పిన సినిమా ఇది. కథ కన్నా కథనం నడిపిన తీరు బాగుండడంతో సినిమా ఫర్వాలేదన్న రీతిలో సాగుతుంది. భామనే సత్యభామనే వంటి కామెడీ చిత్రాలు తీసిన కె.ఎస్.రవికుమార్ ఆ స్థాయిలో వినోదాన్ని అందివ్వకపోయినా చిత్రం ఎక్కడా బోర్ కొట్టకుండా తీశాడు. కొన్ని సీన్స్ లలో రవికుమార్ ప్రతిభ నిజంగా కన్పిస్తుంది ప్రేక్షకుడికి. సీరియస్ విషయాలను తేలికగా ఎలా చెప్పాలో చేసి చూపించాడు.
నాగార్జున యాడ్ ఫిలింమేకర్ కమ్ మోడల్. పల్లెటూరి అమ్మాయి సిమ్రాన్ ను పెళ్ళి చేసుకుంటాడు. సిమ్రాన్ చెల్లెలు రీమాసేన్. రీమాసేన్ ను వాళ్ళ బావ ప్రేమిస్తుంటాడు. కానీ రీమాకు సిటీలో పెరగాలని ఆశ. కోరిక. ఒకానొక సందర్భంలో నాగార్జున సరసన మోడల్ గా నటిస్తుంది రీమా. అంతే బావను తగలగానే ఎదో కోరిక. గిలిగింత. బావనే పెళ్ళిచేసుకుంటానని పట్టుబడుతుంది. తన కోరికను సిమ్రాన్ కు చెప్పుతుంది.
దాంతో సిమ్రాన్ చెల్లెలును తిట్టి సిటికీ వచ్చేస్తుంది. ఆ తర్వాత రీమా ఆత్మహత్యకు పాల్పడుతుంది. చెల్లెలు అంటే ఎంతో ఇష్టపడే సిమ్రాన్ చివరికి ఒప్పుకుంటుంది. కానీ నాగార్జునకు మాత్రం ఇష్టం ఉండదు. ఒకే బాణం, ఒకే పెళ్ళాం అనుకునే నాగార్జున ఆ పెళ్ళిని ఎలా తప్పించుకుంటాడు?అది వెండితెరపై చూడండి.
నాగార్జునతో సహా అందరూ తమ తమ పాత్రలు బాగా పోషించారు. క్లోజప్ లో నాగార్జున ముఖంలో వయసుపైబడుతున్న ఛాయలు కన్పిస్తున్నాయి. ఇక నాగ్ కు లాంగ్ షాటే బెటర్. కీరవాణి సంగీతం ఈ చిత్రానికి హైలెట్ అని చెప్పొచ్చు. కానీ పాటలు మరీ తక్కువ నిడివిలో ఉండడమే చికాకు కలిగిస్తుంది.
సెన్సార్ అభ్యంతరాలకు రెండు పాటలను సినిమాలో మార్చారు. 'సావిరహే....' అనే పాటలో సెక్సీ సెక్సీ అనే పదాన్ని మార్చి వెరీ నైస్ అని చేర్చారు. అలాగే 'అక్కా బావ నచ్చాడా..' పాటలో అంతా తడిమి చూశాడా వ్యాక్యాన్ని మార్చి సొగసు చూశాడా అని చేర్చారు. శ్యాం.కె.నాయుడు న్యూజిలాండ్ అందాలను చక్కగా చూపించాడు. కె.ఎస్.రవికుమార్ డైరక్షన్ ఓకే.


Click it and Unblock the Notifications











