twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒక్కడు+ తొలిప్రేమ= భద్ర

    By Staff
    |

    Bhadra
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    సినిమా: భద్ర
    విడుదల తేదీ: 12-5-2005
    నటీనటులు: రవితేజ, మీరా జాస్మిన్‌, ప్రకాష్‌రాజ్‌, బిడ్డు యాదవ్‌, మురళీమోహన్‌, సునీల్‌,
    పద్మనాభం, దీపక్‌, బ్రహ్మాజీ, జీవా, వైజాగ్‌ ప్రసాద్‌, గుండు హనుమంతరావు తదితరులు
    మాటలు: కొరటాల శివ
    పాటలు: సీతారామశాస్త్రి
    సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
    కెమెరా: ఎ. విల్సన్‌
    నిర్మాత: దిల్‌ రాజు
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బోయపాటి శ్రీనివాస్‌

    బాక్సాఫీసు విజయ సూత్రం హింసేనని నమ్మి తీస్తున్న సినిమాల కోవలో 'భద్ర' ఒకటి. 'ఒక్కడు'ని అనుకరించి, 'తొలిప్రేమ'ను అనుసరించి చేసిన మిక్చర్‌ ఇది. కథ, కథనాలు వేగంగా నడవడం, విజువల్‌గా బాగుండడం, రవితేజ ఎనర్జిటిక్‌ నటన, ఈ సినిమాకు ప్లస్‌ పాయింట్లు అయినా, పాత కథ కావడంతో కొత్త ఫీల్‌ తీసుకురాలేకపోయింది.‌

    ఈ యాక్షన్‌-ఫ్యాక్షన్‌ చిత్రం 'అపదలో ఉన్న అమ్మాయిని ఆదుకున్న 'భద్ర' అనే యువకుని కథ. భద్ర బెంగుళూరు చదువుకునేటప్పడు రూమ్మేట్‌ రాజు చెల్లెలు అను (మీరా జాస్మిన్‌)ని వీడియోలలో చూసి ప్రేమలో పడతాడు. కానీ అది జరిగే పని కాదంటాడు రాజు. అను లండన్‌లో పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేసుకుంటూ చదువుకుంటూ ఉంటుంది.‌

    కొంత కాలానికి (టైటిల్స్‌ ముగిసేసరికి) హైదరాబాద్‌లో భద్ర కుటుంబసభ్యులు చెల్లెలు నిశ్చయ తాంబూలానికి రాని భద్ర కోసం ఎదురుచూస్తుంటారు. కొంతసేపటికి అనూతో సహా అక్కడికి చేరుకుంటాడు భద్ర. అనూ ఎవరో అడగొద్దని కుటుంబసభ్యులను వేడుకుంటాడు. అను ఎవరితో మాట్లాడదు. దీనంగా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటుంది. ఆమెను మామూలు మనిషిని చేయడానికి భద్ర ప్రయత్నిస్తుంటాడు. కొన్ని సంఘటన అనంతరం ఆమెతో భద్ర ప్రేమలో పడ్డాడని అందరూ అనుకుంటారు.‌

    ఈలోపు భద్రను చంపడానికి బిడ్డు యాదవ్‌, అతని అనుచరులు కత్తులు పట్టుకుని తిరుగుతుంటారు. భద్ర మేనమామ వైజాగ్‌ ప్రసాద్‌ తన కూతురిని ఇచ్చి పెళ్ళి చేద్దామనుకున్న భద్ర వేరే అమ్మాయితో ప్రేమలో పడడం సహించలేకపోతాడు. అనుకి వార్నింగ్‌ ఇస్తాడు. ఆమె భయపడి ఇంట్లోంచి పారిపోతుంది. విషయం తెలుసుకుని భద్ర ఆమెను వెదుక్కుంటూ వెళ్తాడు. ఇంటర్వల్‌.‌

    ఆమె దొరక్క ఇంటికి తిరిగి వచ్చిన కొడుకుని నిలదీస్తాడు తండ్రి. భద్ర ఫ్లాష్‌బ్యాక్‌ బయటపెడతాడు. లండన్‌ నుండి అను సొంతవూరు వస్తోందని తెలుసుకుని రాజుతో కలిసి ఆ వూరు వెళ్తాడు భద్ర. అక్కడ ఆమె పెద్దన్న సురేంద్ర (ప్రకాష్‌రాజ్‌) పరిచయమవుతాడు. అతను ఫ్యాక్షనిస్టు. మంచి మనిషి. ఈలోగా ముఠా తగాదాలు జరిగి హీరోయిన్‌ తన మొత్తం కుటుంబాన్ని కోల్పోతుంది. ఆమెను హైదరాబాద్‌ తీసుకొస్తాడు భద్ర. ఆమెను తిరిగి లండన్‌ పంపాలని హీరో ఆకాంక్ష. భద్ర ఆమెను ఎలా రక్షిస్తాడు? తన ప్రేమను ఆమె ఎదుట వ్యక్తపరుస్తాడన్నది తెరపై చూడాల్సిందే.

    ఫస్టాఫ్‌ లవ్‌ సీన్లతో సరదాగా నడుస్తుంది. సెకండాఫ్‌ ఫ్యాక్షన్‌, హింసతో బరువుగా సాగుతుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో రవితేజ తాను మూర్చరోగినంటూ ఇనుప తాళం చెవిని చూపించే హాస్య సన్నివేశం బాగుంది. వయసు మీద పడినా పద్మనాభం బాగా నటించాడు. బుల్లబ్బాయిగా సునీల్‌ అమాయకపు హాస్యాన్ని పండించాడు. రవితేజాది అదే నటన. అదే మాడ్యులేషన్‌. జీవా సీన్లు ఎందుకు ఉపయోగపడలేదు. సంగీతంలో మాస్‌ అప్పీలు లేకపోయినా రెండు పాటలు బాగున్నాయి. హీరోయిన్‌ ఇంట్లో పనిమనిషి ఝాన్సీ ఒక దృశ్యాన్ని చూసి ఊహించుకునే హోమో సెక్స్‌ సన్నివేశాలు వికారం కలిగిస్తాయి. కొత్త దర్శకుడు బోయపాటి శీను టేకింగ్‌, షాట్‌ డివిజన్‌ బాగా చేసుకున్నా పాత కథను నమ్ముకోవడం కొంత దెబ్బతీసింది. సినిమా అంతా ఫ్లాష్‌ షాట్స్‌ కళ్ళకు ఇబ్బంది కలిగిస్తాయి. పాతదైన ఫ్లాష్‌బ్యాక్‌ ఫార్ములాతో 'భాష-మూస' స్క్రీన్‌ప్లే ఇది. జాతీయ ఉత్తమ నటి మీరా జాస్మిన్‌ ఫ్రెష్‌ లుక్స్‌, రవితేజ మాటలు,అద్భుతమైన కెమెరా పనితనం ఈ సినిమాను కాపాడాలి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X