twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భద్రాదిరాముడు -సమీక్ష

    By Staff
    |

    Bhadradi Ramudu
    -జలపతి గూడెల్లి
    చిత్రం: భద్రాదిరాముడు
    నటీనటులు: తారకరత్న, రాధిక, వాణిశ్రీ,
    కె.ఆర్‌.విజయ, చలపతిరావు తదితరులు
    సంగీతం: శ్రీ
    నిర్మాత: మాగంటి గోపీనాథ్‌
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేష్‌ కృష్ణ

    నేనే గనుక దేవరకొండ బాలగంగాధర్‌ తిలక్‌నైౖ ఉంటే, "దేవుడా రక్షించు - సినిమా ప్రముఖుల కుమారుల నుండి, 'పని'అయిపోయిన దర్శకుల నుండి, రచయితల నుండి, కాపాడు అఖిలాం«ధ్ర తెలుగు ప్రేక్షకులను...'' అని ధారాళంగా ఓ సుదీర్ఘ కవిత రాసి ఉండేవాడిని. ఏమిటీ, ఈ పైత్యంతో ఇలా రాస్తున్నాను అనుకుంటున్నారా? 'భద్రాదిరాముడు' సినిమా చూసిన తర్వాత 'మామూలు'గా ఉండడం అంత సులువు కాదు. నందమూరి తారకరత్న అట్టహాసంగా ఒకేరోజున ప్రారంభించిన 'నవరత్నా'ల్లో ఈ 'భద్రాది రాముడు' నాలుగోదో, అయిదోదో తెలీదు కానీ, ఇన్ని చిత్రాల తర్వాత కూడా తారకరత్న నటనలో గానీ, డైలాగ్‌ డెలివరీలో గానీ మార్పు రాలేదు.

    ఆయన నటించిన గత చిత్రాలన్నింటికన్నా అధ్వాన్నంగా ఉంది ఈ సినిమా. అయితే, ఈ సినిమాలో తారకరత్న ప్రధానమైన లోపం కాదు, పేరుగొప్ప ఊరుదిబ్బ రచయిత పోసాని కృష్ణమురళి, దర్శకుడు సురేష్‌కృష్ణల 'భావదారిద్య్రమే' సినిమాను భరించలేనివిధంగా చేశాయి. పోసాని ఇటీవల వివిధ హీరోలకు కథలు ఇచ్చిన చిత్రాలు మాదిరిగానే ఈ సినిమా 'క్రియేటివ్‌ స్క్రీన్‌ ప్లే' తక్కువ, రామాయణ, భారతాల డైలాగ్స్‌, ఇతర సోది డైలాగ్స్‌ ఎక్కువ. (బాలకృష్ణకు 'పలనాటి బ్రహ్మనాయుడు', హరికృష్ణకు 'సీతయ్య', 'టైగర్‌ హరిశ్చంద్రప్రసాద్‌' తదితరాలు)

    తారకరత్న బాడీలాంగ్వేజ్‌ ఏమిటి అనేది పట్టించుకోకుండా, ఆ పీలగొంతుతో భారీ డైలాగ్స్‌ చెప్పించాలనే ప్రయత్నం మూర్ఖత్వం. బాలకృష్ణ గతంలో నటించిన 'బాలగోపాలుడు' అనే చిత్రం కథనే కాస్తా మార్చి ఈ సినిమా తీసినట్లు అన్పిస్తోంది.

    భద్రాచలంలో ఉండే రాముడు (తారకరత్న) తన బామ్మ (కేఆర్‌విజయ) పోరు పడలేక వెంటనే పెళ్ళికి అంగీకరిస్తాడు. ఆ తొందర్లో ఆ ఊరికి 'చెక్కభజన' నేర్చుకోవడానికి వచ్చిన సీత (రాధిక)ను తొలిచూపులోనే నచ్చేసి, పెళ్ళి చేసుకుంటాడు. పెళ్ళి జరిగిన గుడి నుంచే సీత పారిపోతుంది. ఆమె తల్లితండ్రులు, పెళ్ళి అంతా బోగసని తెలుస్తుంది. అసలు విషయమేమింటంటే జర్మనీలో ఉండే సీతకి జాతకం ప్రకారం తొలి పెళ్ళి కలిసిరాదు, అందుకని ఎవరో ఒకర్ని ఇండియాలో పెళ్ళి చేసుకొని జర్మనీ తిరిగి వచ్చేయమని ఆమె తల్లి (వాణిశ్రీ) చెపుతుంది. ఆ ప్రకారం పథకం ప్రకారం రాముడుని చేసుకొని జర్మనీ వచ్చేస్తుంది. సో..హీరో ఈ విషయం తెలుసుకొని తన సీతను తిరిగి తీసుకొని రావడం మిగతా కథ.

    ఇంటర్వెల్‌కు ముందే సినిమా జర్మనీలో ప్రారంభం అవుతుంది, కానీ ఎన్నో మలుపులు తిరిగి..తిరిగి ముగుస్తుంది. హీరోయిన్‌ రాధిక కూడా బాగాలేదు. వాణిశ్రీ ఆకారం భారీగా ఉండడం మినహా ఆమె నటనలో పెద్దగా గొప్పతనం ఏమీ కన్పించదు. సీనియర్‌ నటుడు సుధాకర్‌ నటన కూడా చాలా హారిబుల్‌గా ఉంది. ఒకప్పుడు చక్కటి సంగీతం అందించిన 'శ్రీ' తన ప్రతిభను అంతా ఎక్కడా పారేసుకున్నాడో అన్పిస్తుంది ఈ చిత్రంలోని పాటలు వింటే.

    స్వర్గీయ నందమూరి తారకరామారావు నటించిన దృశ్యాలు, గొంతును సినిమాలో విస్తృతంగా వాడుకున్నారు. కనీసం ఆ దృశ్యాలు అలాగే కంటిన్యూ చేసినా బాగుండే దేమో!

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X