Bhagavanth Kesari Movie Review నెవ్వర్ బిఫోర్‌గా బాలకృష్ణ.. శ్రీలీల టాప్ ఫెర్ఫార్మెన్స్.. భగవంత్ కేసరి రివ్యూ!
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, ప్రియాంక జవాల్కర్, ఆర్ శరత్ కుమార్, రఘుబాబు, జాన్ విజయ్, వీటీవీ గణేష్ తదితరులు
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
సినిమాటోగ్రఫి: సీ రాంప్రసాద్
ఎడిటింగ్: తమ్మిరాజు
మ్యూజిక్: థమన్ ఎస్
బ్యానర్: షైన్ స్క్రీన్
నిడివి: 164 నిమిషాలు
రిలీజ్ డేట్: 2023-10-19
భగవంత్ కేసరి కథ:జైలు నుంచి విడుదలైన నేలకొండ భగవంత్ కేసరి (నందమూరి బాలకృష్ణ) తన సంరక్షణలో పెరిగే విజ్జి అలియాస్ విజయలక్ష్మి (శ్రీలీల)ని ఆర్మీలో చేర్పించేందుకు శారీరకంగా, మానసికంగా ధృడంగా చేయాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ ఆర్మీలో చేరడం ఇష్టం లేకపోవడంతో చిచ్చా అని పిలచుకొనే భగవంత్ కేసరి సలహాలను, సూచనలను విజ్జీ పట్టించుకోదు. కాలేజీలో తన క్లాస్‌మెట్‌తో ప్రేమలో పడిన విజ్జీ తన చిచ్చాకు దూరంగా ఉండాలని కోరుకొంటుంది. ఈ క్రమంలో విజ్జీని రాహుల్ సింఘ్వీ (అర్జున్ రాంపాల్) చంపేందుకు వెంటాడుతుంటాడు.

భగవంత్ కేసరిలో ట్విస్టులు:విజ్జీ సంరక్షణ బాధ్యతలను భగవంత్ కేసరి ఎందుకు భుజాన ఎత్తుకొన్నాడు? విజ్జీకి ఉన్న మానసిక బలహీనతలు ఏమిటి? విజ్జీ మానసిక బలహీనతలకు కారణం ఏమిటి? భగవంత్ కేసరికి విజ్జీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్న తర్వాత ఏం జరిగింది. పారిశ్రామిక వేత్త రాహుల్ సింఘ్వీ ఎందుకు విజ్జిని చంపాలనుకొన్నాడు? రాహుల్ సింఘ్వికి భగవంత్ కేసరికి ఉన్న వైరం ఏమిటి? రాహుల్ సింఘ్వీ అరాచకాలకు భగవంత్ కేసరి ఎలా అడ్డుకట్టవేయాలని ప్రయత్నించాడు? భగవంత్ కేసరి, విజ్జీతో క్యాత్యాయిని (కాజల్ అగర్వాల్)కు ఉన్న రిలేషన్ ఏమిటి? చివరకు విజ్జీ ఆర్మీలో చేరిందా? రాహుల్ సింఘ్వీకి భగవంత్ కేసరి ఎలాంటి గుణపాఠం నేర్పాడు? ఇంతకు భగవంత్ కేసరి ఎవరు? భగవంత్ కేసరి ఎందుకు జైలుకు వెళ్లాడు? అనే ప్రశ్నలకు సమాధానమే భగవంత్ కేసరి సినిమా కథ.

ఫస్టాఫ్ ఎలా ఉందంటే?:నేలకొండ భగవంత్ కేసరి జైలు ఎపిసోడ్స్ సీన్‌తో సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గా మొదలై.. బాలకృష్ణ పవర్ ఫుల్ ఎంట్రీతో సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందనే సిగ్నల్ ఇచ్చే ప్రయత్నం కనిపిస్తుంది. అయితే కథలో డీటైలిటీ కోసం ఎక్కువగా ప్రయత్నించడం వల్ల ఫస్టాఫ్‌లో చాలా సీన్లు చాలా బోర్‌గా, నిదానంగా సాగినట్టు అనిపిస్తాయి. కథను విపులంగా చెప్పాలని అనిల్ రావిపూడి కొంత రిస్క్ తీసుకొన్నాడనిపిస్తుంది. కానీ అసలు కథలోకి వెళ్లిన వెంటనే కథనంలో వేగం అందుకొంటుంది. ఫస్టాఫ్‌లో విజ్జి పెళ్లి చూపులు సీన్, ఇంటర్వెల్ సీన్లు హైలెట్‌గా అనిపించడమే కాకుండా ఒక డిఫరెంట్ అనిల్ రావిపూడి సినిమాను చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్‌లో మంచి ట్విస్టుతో ఫస్టాఫ్‌ను ఎమోషనల్‌గా, క్రేజీగా ముగించడంతో సెకండాఫ్‌పై అంచనాలు పెరిగేలా చేస్తుంది.

సెకండాఫ్ ఎమోషనల్ అంశాలతో :సెకండాఫ్‌లో భగవంత్ కేసరి ఫ్లాష్ బ్యాక్ స్టోరి రొటీన్, రెగ్యులర్‌గా మొదలు కావడంతో నిదానంగా సాగినట్టు అనిపిస్తుంది. కానీ ఒకసారి శ్రీలీల ట్రైనింగ్ మొదలైన తర్వాత మూవీ మరో జోన్‌లోకి వెళ్లినట్టు స్పష్టమవుతుంది. స్కూల్‌లో హై ఎమోషనల్ ఎపిసోడ్‌తో మూవీ ఊపందుకొన్నది. ఆ తర్వాత భగవంత్ కేసరి గురించి చెప్పే సీన్‌తో మూవీ ఫ్యామిలీ జోన్‌లోకి వెళ్లిందనే ఫీలింగ్ కలుగుతుంది. విజ్జి, భగవంత్ కేసరి క్యారెక్టర్లను అనిల్ రావిపూడి డీల్ చేసిన విధానం సూపర్బ్‌గా ఉంటుంది. ఇక క్లైమాక్స్‌లో శ్రీలీల, బాలయ్య యాక్షన్ మోడ్‌లో చెలరేగిపోవడం ఫ్యాన్స్‌కు ఫీస్ట్ మాదిరిగా అనిపిస్తుంది. లాజిక్స్, వితండ వాదనలు వదిలేస్తే.. భగవంత్ కేసరి మంచి ఎంటర్‌టైనర్‌తో ఎమోషనల్‌గా ఫ్యామిలీని ఆకట్టుకొనే చిత్రమని అనిపిస్తుంది.

డిఫరెంట్ విజన్‌తో అనిల్ రావిపూడి:అనిల్ రావిపూడి డైరెక్టర్‌గా కామెడీ, యాక్షన్ చిత్రాలతో ఇప్పటి వరకు నెట్టుకు రావడమే కాకుండా తన టాలెంట్‌తో విజయాలను అందుకొన్నారు. కానీ భగవంత్ కేసరితో ఆయన ఎవరూ ఊహించని కథతో ప్రేక్షకుల ముందుకు రావడం రిస్కే అయినప్పటికీ.. మూవీని తీర్చి దిద్దిన విధానంతో దర్శకుడిగా గట్స్ కనిపిస్తాయి. బాలయ్య, శ్రీలీల కాంబినేషన్ డీల్ చేసిన విధానం హైలెట్. ఫ్యాన్స్ మనోభావాలను పక్కన పెట్టి.. పాటల జోలికి వెళ్లకుండా స్వచ్చంగా కథను చెప్పే ప్రయత్నం చేయడం దర్శకుడిగా ఆయనలో మెచ్యురిటీ కనిపించిందని చెప్పవచ్చు.

నెవ్వర్ బిఫోర్ క్యారెక్టర్‌లో బాలయ్య, శ్రీలీల:నటీనటుల విషయానికి వస్తే.. భగవంత్ కేసరి సినిమాతో బాలకృష్ణ తనకు తాను కొత్తగా ఆవిష్కరించుకొనే ప్రయత్నం చేశారని చెప్పవచ్చు. తనకు బలం, బలహీనతగా మారిన కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి వెళ్లకుండా అనిల్ రావిపూడి వేసిన రూట్‌లో అద్బుతమైన ఫెర్ఫార్మ్స్ చూపించాడు. భగవంత్ కేసరిగా బాలయ్య నవ్విస్తాడు.. ఈలలు కొట్టిస్తాడు. కంటతడి పెట్టిస్తాడు. అంతేకాకుండా భావోద్వేగానికి గురిచేస్తాడు. ఇక శ్రీలీల ఓ రేంజ్‌లో ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. విజ్జీ పాత్రలో అమాయకంగా, చిచ్చర పిడుగుల, చిచ్చా ఆశయం కోసం తనను తాను మార్చుకొనే ఎమోషనల్ పాత్రలో ఒదిగిపోయింది. ఇప్పట వరకు డ్యాన్సర్‌గానే చూసిన ప్రేక్షకులకు తనలో మాస్, యాక్షన్ హీరోయిన్ కూడా ఉందనే విషయం ఈ సినిమా ద్వారా చెప్పింది. కాజల్ అగర్వాల్ రోల్ ఉనికి సినిమాలో ఉంటుంది. కానీ బాలయ్య, శ్రీలీల మధ్య ఆమె ఎలివేట్ కాలేకపోయింది. అర్జున్ రాంపాల్ ఓ డిఫరెంట్ విలనిజంతో, బ్రహ్మజీ, జాన్ విజయ్, శరత్ కుమార్ తదితరులు తమ పాత్రలో ఒదిగిపోయారు.
తమన్ బీజీఎం గురించి :సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ సినిమాకు అన్ని విభాగాలు సమతుల్యంతో మంచి అవుట్ పుట్ ఇచ్చారని చెప్పవచ్చు. ముఖ్యంగా సినిమాటోగ్రఫి వర్క్ చాలా బాగుంది. ఫారెస్ట్, హైదరాబాద్‌లో సీన్లను అద్బుతంగా కెమెరాలో బంధించారు. సెక్రటేరియట్, అంబేద్కర్ ప్రాంతాలను చక్కగా చూపించారు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే.. తమన్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్. బీజీఎం విషయానికి వస్తే.. విక్రమ్, జైలర్ సినిమాలే గుర్తుకు వస్తాయి. పక్కా ఈ రెండు సినిమాల ట్రాక్స్‌ను అనుసరించాడా అనిపిస్తుంది. కానీ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశారనె చెప్పాలి. ఎడిటింగ్‌కు ఇంకా కొంత స్కోప్ ఉంది. సాహు, హరీష్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను చాలా రిచ్‌గా, హై క్వాలిటీతో పండుగకు మంచి ఫుల్ మీల్స్ అందించారనే చెప్పాలి.
ఫైనల్‌గా ఎలా ఉందంటే? :మహిళా సాధికారత, హ్యుమన్ ఎమోషన్స్, యాక్షన్, కామెడీ మేలవించిన చిత్రం భగవంత్ కేసరి. సినిమాలో కొన్ని సీన్లు ఫ్లోలను దెబ్బ తీశాయని అనిపిస్తాయి. కానీ అనిల్ రావిపూడి టేకింగ్ వల్ల ఆ లోపం కనిపించకుండా పోయిందని చెప్పాలి. ఇక బాలకృష్ణ, శ్రీలీల, కాజల్, అర్జున్ రాంపాల్, శరత్ కుమార్ ఇతర నటీనటుల ఫెర్ఫార్మెన్స్ సినిమాకు బలంగా మారాయి. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా చాలా అంశాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తాయి. ఎలాంటి అంచనాలతో వెళ్లినా ఊహించని అనుభూతిని ఈ సినిమా ఇస్తుంది. దసరా పండుగకు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను, ఫ్యాన్స్‌ను మెప్పించే చిత్రంగా భగవంత్ కేసరి ఉంది. కలెక్షన్లు ఏ రేంజ్‌లో ఉంటాయనేది ఈ సినిమా కొన్ని రోజుల్లో తేల్చుతుంది.


Click it and Unblock the Notifications











