Bheemadevarapally Branchi Review జన్‌ధన్ ఖాతా నేపథ్యంగా భీమదేవరపల్లి బ్రాంచీ.. మూవీ ఎలా ఉందంటే?
Rating: 2.5/5
నటీనటులు: అంజి వల్గుమాన్, బలగం సుధాకర్ రెడ్డి,గడ్డం నవీన్, సాయి ప్రసన్న, రాజవ్వ, రూపా శ్రీనివాస్,అభిరామ్ తదితరులు
దర్శకత్వం: రమేష్ చెప్పాల
నిర్మాతలు: బత్తిని కీర్తిలత,రాజ నరేందర్
సంగీతం: చరణ్ అర్జున్
సినిమాటోగ్రఫి: కే చిట్టిబాబు
ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
బ్యానర్: ఏబీ సినిమాస్, నిహాల్ ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2023-06-23

నిరాక్ష్యరాస్యత ఎక్కువగా ఉన్న తెలంగాణ ప్రాంతంలో భీమదేవరపల్లి గ్రామానికి ఓ శుభవార్త అందుతుంది. ప్రతీ ఒక్కరు జీరో బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. కాస్త చదువున్న వ్యక్తి ప్రభుత్వం డబ్బులు వేస్తుందని పుకారు లేపడంతో గ్రామస్తులంతా బ్యాంక్ ఖాతాలు తెరుస్తారు. ఆ క్రమంలో జంపన్న (అంజి వల్గుమాన్) ఖాతాలో లక్షల రూపాయలు జమ అవుతాయి.
బ్యాంక్ ఖాతాలు తెరువాలని కేంద్ర చెప్పగానే గ్రామస్థుల్లో నెలకొన్న పరిస్థితి ఏమిటి? చదువురాని గ్రామస్థులను దళారీలు ఎలా తప్పుదోవ పట్టిస్తారు? ప్రజల అమాయకత్వాన్ని చూసి బ్రోకర్లు ఎలా దండుకొంటారు? బ్యాంక్ ఖాతాలో డబ్బు పడిన తర్వాత జంపన్న పరిస్థితి ఏమిటి? జంపన్న ఖాతాలో డబ్బు పడిన తర్వాత మిగితా గ్రామస్థుల్లో ఎలాంటి ఆశపుట్టింది? గ్రామస్థులను దళారి ఎలా వాడుకొన్నాడు? ఇంతకు జంపన్న ఖాతాలోకి ఎక్కడి నుంచి డబ్బు వచ్చి పడింది? అనే ప్రశ్నలకు సమాధానమే భీమదేవరపల్లి బ్రాంచి సినిమా కథ.

భీమదేవరపల్లి బ్రాంచి సినిమా ఫస్టాఫ్ విషయానికి వస్తే.. గ్రామీణ వాతావరణంలో ప్రజల తీరుతెన్నులు, వారి అమాయకత్వాన్ని చక్కగా దర్శకుడ ఎస్టాబ్లిష్ చేశారనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం జన్ ధన్ ఖాతాల స్పూర్తితో దర్శకుడు రమేష్ చెప్పాల అల్లుకొన్న కథ బాగుంది. ఫస్టాఫ్‌ను హ్యుమర్, ఎమోషనల్ అంశాలను దట్టించి ఆకట్టుకొనే ప్రయత్నం చేశారని చెప్పవచ్చు. జంపన్న ఖాతాలో డబ్బు వచ్చి పడిన తర్వాత కథ ఊపందుకొంటుంది.
ఫస్టాప్‌ను పరుగులు పెట్టించిన దర్శకుడు రమేష్ చెప్పాల సెకండాఫ్‌లో కొంత తడబాటుకు గురయ్యారనిపిస్తుంది. ప్రభుత్వ ఉచిత పథకాల తీరుపై దర్శకుడు ఇచ్చిన సందేశం బాగుంది. అయితే ఆ సందేశం కాస్తా లెంగ్తీ ఉండటంతో కొంత ఇబ్బంది కరంగా ఉంటుంది. కానీ ఆ సందేశాన్ని జేడీ లక్ష్మీనారాయణ, అద్దంకి దయాకర్, ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో చెప్పించిన తీరు ప్రేక్షకులకు చేరేలా ఉండటం దాని పర్పస్ సాల్వ్ అయిందనిపిస్తుంది. ఓవరాల్‌గా గ్రామీణ నేటివిటితో ఉన్న భావోద్వేగమైన కథను దర్శకుడు రమేష్ చెప్పాల నిజాయితీ చెప్పే ప్రయత్నం చేశారనే ఫీలింగ్ కలుగుతుంది.

జంపన్నగా అంజి వల్గుమాన్ పాత్ర భీమదేవరపల్లి బ్రాంచీ సినిమాకు బలంగా నిలిచింది. ఆ పాత్రలో అంజి వల్గుమాన్ ఒదిగిపోయారు. సినిమాకు ఆయన పెర్ఫార్మెన్స్ స్పెషల్ ఎట్రాక్షన్.ఇక బలగం సుధాకర్రెడ్డి,రాజశేఖర్ అన్నంగి, గడ్డం నవీన్, రూపా శ్రీనివాస్,అభిరామ్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించడమే కాకుండా పూర్తిగా న్యాయం చేశారు.
భీమదేవరపల్లి బ్రాంచి చిత్రానికి సాంకేతిక విభాగాల పనితీరు ప్రధానమైన బలంగా నిలిచాయి. విమానం సినిమాతో మంచి మ్యూజిక్ అందించిన చరణ్ అర్జున్ మరోసారి ఈ సినిమా మంచి మ్యూజిక్ అందించారు. ఎన్నో సంవత్సరాలుగా వేచి చూసిన చరణ్ అర్జున్ తన ప్రతిభను చక్కగా నిరూపించుకొన్నారు. చిట్టిబాబు అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. కథను చకచకా పరుగులు పెట్టించడంలో.. బొంతల నాగేశ్వర్ రెడ్డి పనితనం కనిపించింది. సినిమా ల్యాగ్ లేకుండా తన అనుభవాన్ని ఉపయోగించుకొన్నాడనే ఫీలింగ్ కలుగుతుంది. ఏబీ సినిమాస్, నిహాల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తిని కీర్తిలత, రాజ నరేందర్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

జనధన్ ఖాతాల నేపథ్యంగా గ్రామీణ వాతావరణం, అమాయకత్వంతో మోసానికి ఎలా గురవుతారనే విషయాన్ని నిజాయితీగా చెప్పిన చిత్రం భీమదేవరపల్లి బ్రాంచి. అప్పనంగా డబ్బు వస్తే... గ్రామీణ ప్రాంతంలో ఉండే వ్యక్తులు డాబు, దర్బం, డబ్బు దుబారా ఎలా చేస్తారనే విషయాన్ని జంపన్న పాత్ర ద్వారా చక్కగా చెప్పడంలో దర్శకుడు రమేష్ చెప్పాల సక్సెస్ అయ్యారు. తెలంగాణ యాస, నెటివిటిని ఎంజాయ్ చేసే వారికి ఈ సినిమా మంచి అనుభూతిని కలిగిస్తుంది.


Click it and Unblock the Notifications











