Brahma Anandam Review: బ్రహ్మా ఆనందం మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Rating: 2.75/5
నటీనటులు : రాజా గౌతమ్, పద్మశ్రీ అవార్డ్ గ్రహీత బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, రాజీవ్ కనకాల, సంపత్ రాజ్, రఘు బాబు, ప్రభాకర్, డివిజ ప్రభాకర్, దయానంద్ రెడ్డి తదితరులు
బ్యానర్: స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
దర్శకుడు: ఆర్‌వీఎస్ నిఖిల్
సినిమాటోగ్రఫీ: మితేష్ పర్వతనేని
సంగీత దర్శకుడు: శాండిల్య పిసపాటి
ఎడిటర్: ప్రణీత్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్: క్రాంతి ప్రియం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డి.వంశీకృష్ణా రెడ్డి, పి.దయాకర్ రావు
రిలీజ్ డేట్: 2025-02-14
అనాథ అయిన బ్రహ్మానందం (రాజా గౌతమ్) థియేటర్ ఆర్టిస్టు. ఎప్పటికైనా పెద్ద నటుడిగా పేరు సంపాదించాలనే కలతో జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. తన ప్రాణ స్నేహితుడు గిరి (వెన్నెల కిషోర్) చేసే ఆర్థిక సాయం, ఇతర అప్పులతో కాలాన్ని నెట్టుకొంటూ వస్తుంటాడు. ఇలాంటి క్రమంలో జాతీయ స్థాయిలో ప్రతిభను నిరూపించుకొనే బంపర్ ఆఫర్ బ్రహ్మానందంకు వస్తుంది. కానీ 6 లక్షల రూపాయలు కావాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో తన ప్రియురాలు తార (ప్రియా వడ్లమాని) సాయం చేయాలని ముందుకు వస్తుంది. కానీ బ్రహ్మానందం నిరాకరించి ఆమెతో బ్రేకప్ చేసుకొంటాడు. ఈ క్రమంలో తన తాత ఆనంద మూర్తి (బ్రహ్మానందం) కొన్ని కండిషన్లతో సాయం చేయడానికి సిద్దపడుతాడు.
జాతీయ స్థాయిలో బ్రహ్మానందంకు ఎలాంటి ఆఫర్ లభించింది? 6 లక్షలు ఎందుకు కావాల్సి వచ్చింది? ప్రియురాలు తార సాయం చేయడానికి వస్తే బ్రహ్మనందం ఎందుకు నిరాకరించాడు? తాత మూరి మనవడు బ్రహ్మానందంకు పెట్టిన కండీషన్లు ఏమిటి? ఆ కండిషన్ల ప్రకారం ఓ గ్రామానికి వెళ్లిన వారికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? గ్రామంలో తారసపడిన జ్యోతి (తాళ్లూరి రామేశ్వరి) ఎవరు? జ్యోతికి మూర్తికి ఉన్న సంబంధం ఏమిటి? చివరకు మూర్తి కోరికను బ్రహ్మానందం నెరవేర్చాడా? బ్రహ్మానందం నటుడిగా కావాలన్న లక్ష్యం నెరవేరిందా? అనే ప్రశ్నలకు సమాధానమే బ్రహ్మ ఆనందం సినిమా కథ.

మానవ సంబంధాలు, భావోద్వేగాలు, తాత మనవడి మధ్య రిలేషన్, ప్రేమ, జీవిత లక్ష్యాలు లాంటి అంశాలను జోడించి రూపొందించిన చిత్రం బ్రహ్మ ఆనందం. చిన్న పాయింట్‌ను సాగదీసి రెండు గంటలకుపైగా తెరపైన నడిపించిన స్టోరీ ఇది. ఫస్టాఫ్‌లో అసలు కథలోకి వెళ్లడానికి దర్శకుడు నిఖిల్ చాలానే కష్టపడ్డారనే ఫీలింగ్ కలుగుతుంది. తొలి భాగంలో క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేయడానికే సమయం ఎక్కువగా తీసుకోవడం వల్ల సినిమా చాలా నత్త నడకన సాగుతుందనే అభిప్రాయం కలుగుతుంది. ఫస్టాఫ్‌లో అక్కడక్కడా నవ్వులు కురిపిస్తూ సరదాగా సినిమాను ముందుకు తీసుకుపోయాడని చెప్పవచ్చు.
ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. అసలు కథ మొదలై వేగంగా ముందుకు కదిలే ప్రయత్నం చేస్తుంది. జ్యోతి, మూర్తి పాత్రల చుట్టూ అల్లిన ప్రేమ కథ ఎమోషనల్‌గాను, అలాగే ఫీల్‌గుడ్‌గాను కనిపిస్తుంది. గిరి, బ్రహ్మ, ఆనందం, జ్యోతి క్యారెక్టర్లను తీర్చిదిద్దిన తీరు బాగుంది. కాకపోతే ఇంకా ఎమోషన్స్ దట్టించడానికి, కథను వేగంగా హాస్యంతో ముందుకు తీసుకెళ్లడానికి స్కోప్ ఉంది. కానీ ఆ దిశగా దర్శకుడు ప్రయత్నం చేయలేదనే ఫీలింగ్‌తోపాటు బ్రహ్మానందంతో ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని అద్బుతంగా తెరకెక్కించే అవకాశాన్ని జార విడుచుకొన్నారనే అభిప్రాయం కలుగుతుంది.
నటీనటులు ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఆనందమూర్తిగా బ్రహ్మానందం నటన గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మూర్తిగా ఆయన తన పాత్ర ద్వారా అద్బుతమైన భావోద్వేగాలను, సటిల్ కామెడీతో కొత్తగా కనిపించాడు. రొటీన్ కామెడీకి స్కోప్ ఇవ్వకుండా హుందాగా తన పాత్రను గౌరవప్రదంగా తెర మీద ఆవిష్కరించారు. మనవడు బ్రహ్మానందం పాత్రలో రాజా గౌతమ్ తన ప్రతిభను నిరూపించుకొనే అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొన్నారు. గిరిగా వెన్నెల కిషోర్ కామెడీ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ప్రియా వడ్లమాని, ఈటీవీ ప్రభాకర్, ఆయన కూతురు దివిజ, రాజీవ్ కనకాల, దయానంద రెడ్డి తదితరల పాత్రలు తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించాయి.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. బ్రహ్మా ఆనందం సినిమాకు మ్యూజిక్, సినిమాటోగ్రఫి కీలక అంశాలుగా కనిపిస్తాయి. మితేష్ పర్వతనేని, శాండిల్య పనితీరు సినిమాకు ప్లస్ పాయింట్స్. ప్రణీత్ కుమార్ ఎడిటింగ్ విషయంలో ఇంకా షార్ప్‌గా వ్యవహరించాల్సిందనపిస్తుంది. కంటెంట్‌ను ప్రాణంగా నమ్మే నిర్మాత రాహుల్ యాదవ్ తన అభిరుచిని చాటుకొన్నారు. కానీ కథపై ఇంకా కసరత్తు చేసి ఉంటే.. ఓ డిఫరెంట్ లవ్ స్టోరి అయి ఉండేదనిపిస్తుంది. ఆయన అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ మంచి స్టాండర్డ్స్‌లో ఉన్నాయి.
బ్రహ్మా ఆనందం రెగ్యులర్‌గా వచ్చి రొటీన్ ప్రేమ కథ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కాదు. ఓ డిఫరెంట్ పాయింట్‌తో ఎమోషన్స్, హ్యుమన్ వాల్యూస్ చెప్పే సినిమా. గ్రామీణ వాతావరణంలో ఫీల్ గుడ్‌తో సాగే ప్రేమ కథ. నటీనటుల ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమా ప్లస్ పాయింట్. స్లో నరేషన్ వల్ల కొంత ఎనర్జీని తెచ్చుకోని చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాకపోతే స్వచ్చమైన క్లీన్ ఎంటర్‌టైనర్. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే మంచి ఫీల్‌ను, వినోదాన్ని ఆస్వాదించవచ్చు. ఓ డిఫరెంట్ జోనర్ సినిమాను ఎంజాయ్ చేయాలనుకొంటే బ్రహ్మ ఆనందం కేరాఫ్ అడ్రస్.


Click it and Unblock the Notifications











