twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బన్నీ బాగున్నాడు

    By Staff
    |

    Bunny
    సినిమా: బన్ని
    విడుదల తేదీ: 6-4-2005
    నటీనటులు: అల్లు అర్జున్‌, గౌరీ ముంజాల్‌, ప్రకాష్‌ రాజ్‌,
    ముఖేష్‌ రుషి, రాజన్‌ పి దేవ్‌, కె. విశ్వనాథ్‌, ఎంఎస్‌ నారాయణ,
    వేణుమాధవ్‌, రఘబాబు, శరత్‌కుమార్‌, సీత తదితరులు
    మాటలు: రాజేంద్ర కుమార్‌
    సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
    ఫోటోగ్రఫీ: చోటా కె నాయుడు
    సమర్పణ: అల్లు అరవింద్‌
    నిర్మాత: మల్లిడి సత్యనారాయణ రెడ్డి
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వివి వినాయక్‌

    పాత కథే అయినా కొత్త హంగులతో కమర్షియల్‌ సినిమాకు కావల్సిన అన్ని అంశాలు కూర్చి వదిలిన వినాయకాస్త్రం 'బన్ని'. బన్ని (అల్లు అర్జున్‌ ముద్దు పేరు)కి మాస్‌ ఇమేజ్‌ తెచ్చే ప్రయత్నం చేసిన ఈ చిత్రంతో తెలుగు సినిమా కొద్దిగా తేరుకోవచ్చు.

    వినాయక్‌ ఇతర చిత్రాల్లో లాగానే ఈ సినిమా కూడా ర్యాగింగ్‌తో ప్రారంభమౌతుంది. బన్ని అనే కొత్త విద్యార్ధి ర్యాగింగ్‌లో భాగంగా ఒక లవ్‌ లెటర్‌ను సీనియర్స్‌ దగ్గర తీసుకుని హీరోయిన్‌ మహాలక్ష్మి( గౌరీ ముంజాలా)కు ఇవాల్సి వస్తుంది. ఆమె వైపు కన్నెత్తి చూడాలంటేనే అందరికీ భయం. అలాంటిది ఒక కుర్రాడు లవ్‌ లెటర్‌ ఇవ్వడంతో ఆమె థ్రిల్‌ ఫీలవుతుంది. ఈ లోగా ఆమె సెక్యూరిటీగా వచ్చిన రఘుబాబు గూండా బ్యాచ్‌ బన్నిపై చేయి చేసుకుంటారు. బన్ని ఫైట్‌ చేసి ఆమెను ఆకట్టుకుంటాడు. ఇలా మొదలైన బన్ని, మహాలక్ష్మిల పరిచయం ప్రేమగా మారుతుంది. ఇద్దరూ అందరి కళ్ళు గప్పి సినిమాలకు, గంగమ్మ జాతరకు డ్యూయెట్స్‌ పాడుకుంటూ తిరుగుతారు. ఈ విషయం ఆమె తండ్రి సోమరాజు( ప్రకాష్‌రాజ్‌)కు తెలియకుండా మేనేజ్‌ చేస్తారు. ఇంతకీ ఇంతలా మహాలక్ష్మిని అతుక్కు పోతున్న ఈ బన్ని ఎవరు? రంగారావు భూపతి ( తమిళ హీరో శరత్‌కుమార్‌) కొడుకు. మళ్లీ భూపతి ఎవరు అంటే ఇంటర్వల్‌.

    ఫ్లాష్‌ బ్యాక్‌కు వెళ్తే రంగారావు భూపతి నాలుగు వేల ఎకరాల యజమాని. పోలవరం ప్రాజెక్టు కోసం 'ఇంద్ర'లో చిరంజీవిలాగా ఆస్ధి మొత్తం పేద రైతులకు పంచమని ప్రభుత్వానికి రాసేస్తానన్న పెద్ద మనిషి. ఆయన చెల్లెలు భర్త సోమరాజు ( ప్రకాష్‌రాజ్‌) విలన్‌ కాబట్టి ఆస్ధి దస్తావేజులు మార్చి, కొంత తన పేరు మీద రాయించుకుని మైశయ్య (ముఖేష్‌ రుషి) అనే కిరాయి హంతకుడి సహాయంతో రంగారావు భూపతిని చంపిస్తాడు. ప్రస్తుతానికి వస్తే బన్ని ఈ కథ వెనుక మామూలుగా ఉన్నా ఒక ప్లాన్‌ ప్రకారం తన మేనత్త సలహాపై ఆమె కూతురైన మహాలక్ష్మిని ప్రేమిస్తాడు. సోమరాజుకి కూతురంటే వల్లమాలిన ప్రేమ కావడంతో బన్ని విషయం తెలుసుకున్నా ఏమీ చేయడు.ఈ లోగా మైసయ్య తన కొడుకుని సోమరాజు కూతురిని చేసుకోమని అడుగుతాడు. సోమరాజు ఒప్పుకోడు. మైసయ్య ఎదురుతిరుగుతాడు. అప్పుడు బన్ని ఎలా తన మావయ్యను రక్షించుకుని , మహాలక్ష్మిని పెళ్ళి చేసుకుంటాడో, పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏ చేస్తాడో అన్నది మిగితా కథ.

    పాటలు మాటలతోనే కాకుండా మంచి షాట్‌ డివిజన్‌తో వినాయక్‌ ఈ సినిమాకు ప్రాణం పోశారు. శరత్‌కుమార్‌ పాత్ర పెదరాయుడిలో రజనీకాంత్‌లా బాగుంది. గోదావరి నదిపై పాడిన పాటల చిత్రీకరణలో గ్రాఫిక్స్‌ బాగున్నాయి. ప్రకాష్‌రాజ్‌, అల్లు అర్జున్‌ మధ్య టీజింగ్‌ సీన్స్‌ 'దిల్‌' చిత్రాన్ని పోలినా బాగున్నాయి. రగుబాబు గుడ్డి వాడి పాత్రలో బాగా నటించాడు.వినాయక్‌ తన ఇతర చిత్రాల్లో లాగానే యాక్షన్‌ ఫ్యాక్షన్‌ ఫార్ములాను అనుసరించి హింసాత్మక సన్నివేశాలను రిపీట్‌ చేయడం బాగుండలేదు. కథలో రెండో మలుపు లోపించడంతో యాంటీ క్లెయిమాక్స్‌ సన్నివేశాలు ఆశించినంతగా పండలేదు. ప్రకాష్‌రాజ్‌ ఎప్పుడూ హీరో వెనక గూండాలను పంపడం, కూతురి సెక్యూరిటీ చూడడం మాత్రమే చేస్తుంటాడు. కూతురికి సెక్యూరిటీ ఎందుకో ఎక్కడా హింట్‌ చేయకపోవడం స్క్రిప్టు లోపమే. పోలవరం ప్రాజెక్టుకై దర్శకుడికి మరింత అవగాహనతో చిత్రాన్ని తీర్చిదిద్ది ఉంటే సామాజిక ప్రయోజనం సిద్ధించేది.

    దట్స్‌తెలుగు రిమార్క్స్‌: కథ పాతదే అయినా మాస్‌ను ఆకట్టుకునే అంశాలున్నాయి. మార్కెట్‌లో ఇతర చిత్రాలు లేకపోవడంతో ఈ సినిమా విజయం ఖాయమన్పిస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X