Captain Miller Review ధనుష్ వన్ మ్యాన్ షో.. కానీ సినిమాకు అదే మైనస్.. కెప్టెన్ మిల్లర్ సమీక్ష
Rating: 2.75/5
నటీనటులు: ధనుష్, శివరాజ్‌కుమార్, సందీప్ కిషన్, ప్రియాంక అరుళ్ మోహన్, అదితి బాలన్ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్
నిర్మాత: సెంథిల్ త్యాగరాజన్, అరుణ్ త్యాగరాజన్
సినిమాటోగ్రఫి: సిద్దార్థ నూని
ఎడిటింగ్: నాగూరాన్ రామచంద్రన్
మ్యూజిక్: జీవి ప్రకాశ్ కుమార్
బ్యానర్: సత్య జ్యోతి ఫిల్మ్స్
రిలీజ్ డేట్: 2024-01-26
బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసే ఉద్యమకారుడు అగ్నీశ్వర అలియాస్ అగ్ని (ధనుష్). అయితే ఊహించని విధంగా బ్రిటీష్ సైన్యంలో చేరి గ్రామస్థులను, ఉద్యమకారులను షాక్ గురిచేస్తాడు. ఆ తర్వాత బ్రిటీష్ సైన్యానికి వ్యతిరేకంగా చేయాలని నిర్ణయించుకొని దొంగగా మారుతాడు.
స్వాతంత్రం, స్వేచ్ఛ కోసం పోరాటే చేసే అగ్ని ఎందుకు బ్రిటీష్ సైన్యంలో చేరాడు. బ్రిటీష్ సైన్యంలో చేరిన అగ్ని వారిని ఎందుకు వ్యతిరేకించాడు? బ్రిటీష్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడుతూ దొంగగా ఎందుకు మారాడు. అగ్ని సోదరుడు స్వాతంత్ర్య ఉద్యమకారుడు శివన్న (శివరాజ్ కుమార్) తన లక్ష్యాన్ని సాధించాడా? ఘోరా హరుడు అనే వ్యక్తికి గ్రామానికి, అక్కడ ఉన్న ఆలయానికి ఉన్న సంబంధమేమిటి?

బ్రిటీష్ సైన్యంలో పనిచేసే రఫిక్ (సందీప్ కిషన్) ప్రజల కోసం ఎలాంటి పోరాటం చేశాడు? రాజవంశానికి చెందిన భానుమతి తన కుటుంబంపై ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలని చూసింది? చివరకు తన గ్రామం, తన ఊరిలోని ఆలయం కోసం, తమ ఉనికి కోసం అగ్ని ఎలాంటి పోరాటం చేశాడు? అగ్నిశ్వరకు మిల్లర్, కెప్టెన్ మిల్లర్ అనే పేరు ఎందుకు వచ్చింది? ప్రశ్నలకు సమాధానమే కెప్టెన్ మిల్లర్ సినిమా కథ.

కెప్టెన్ మిల్లర్ విషయానికి వస్తే.. ఓ గ్రామంలో అగ్ర కులాలు, తక్కువ కులాల మధ్య వివక్షను కీలక పాయింట్‌గా మార్చుకొని బ్రిటీష్ పాలన బ్యాక్ డ్రాప్‌తో హైఎండ్ యాక్షన్ చిత్రంగా అరుణ్ మాథేశ్వరన్ రూపొందించారు. ధనుష్‌తోపాటు శివరాజ్ కుమార్, సందీప్ కిషన్, ప్రియా అరుళ్ మోహన్ లాంటి బలమైన పాత్రలను రాసుకొన్నారు. కానీ కథ, కథనంలో క్లారిటీ లేకపోవడం వల్ల బలమైన అంశాలు బలహీనంగా కనిపించేలా చేశాయి. కథను ఐదు భాగాలుగా చెప్పడం, అలాగే పాత్రల పేర్లు సాధారణ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా లేకపోవడం ఈ సినిమాకు అతి పెద్ద మైనస్.
కెప్టెన్ మిల్లర్‌ను సాంకేతికంగా బలంగా తెరకెక్కించారు. కానీ కొన్నిసార్లు లాజిక్‌కు దూరంగా ఉండటం వల్ల ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడలో విఫలమైందనే చెప్పాలి. ఇక యాక్షన్ పేరుతో మితీమీరిన హింస కూడా సినిమాలోని ఎమోషన్స్‌పై దెబ్బ తీశాయి. ఓవరాల్‌గా టాప్ యాక్టర్ల ఫెర్ఫార్మెన్స్ కేవలం సినిమాను కాపాడే ప్రయత్నం చేశాయని చెప్పవచ్చు.
ధనుష్, శివరాజ్ కుమార్ లాంటి యాక్టింగ్ లెజెండ్స్ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. వివిధ రకాల గెటప్స్‌తో ఎప్పటి మాదిరిగానే తన మార్కు నటనతో చెలరేగిపోయాడు. శివన్నగా ఉద్యమకారుడిగా శివరాజ్‌కుమార్ తన పాత్రలో ఒదిగిపోయారు. రఫిక్‌గా సందీప్ సర్‌ప్రైజింగ్ క్యారెక్టర్‌గా ఉంటుంది. ప్రియా అరుళ్ మోహన్ భానుమతిగా భావోద్వేగమైన పాత్రలో మెప్పించారు. గ్లామర్‌పరంగా, యాక్షన్ సీన్లలో కూడా అదరగొట్టేసింది.
కెప్టెన్ మిల్లర్ సినిమా విషయానికి వస్తే.. సాంకేతిక అంశాలు సినిమాను మరో రేంజ్‌లో నిలబెట్టాయి. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ ఈ మూవీ సీన్లను హై రేంజ్‌లో ఎలివేట్ చేశాయి. యాక్షన్ సీన్లలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలో ఎంగేజ్ చేసేలా చేశాయి. ఇక సిద్దార్థ నూని సినిమాటోగ్రఫి ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్. సెంథిల్ త్యాగరాజన్, అరుణ్ త్యాగరాజన్ అనుసరించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి.

కెప్టెన్ మిల్లర్ గురించి ఓవరాల్‌గా చెప్పాలంటే.. టాప్ యాక్టర్ల పెర్ఫార్మెన్స్‌తోపాటు కుల వివక్ష, ఆలయ నిధి రహస్యం, ఎమోషన్స్ ఆధారంగా సాగే యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమాకు కథ, కథనాలు కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. టెక్నికల్ అంశాలు వాటిని సరిదిద్దాయి. కాకపోతే సినిమా సాగదీత, మితిమీరిన హింస ఈ స్టోరీలోని ఎస్సెన్స్ దెబ్బ తీశాయనిపిస్తుంది. ధనుష్, శివరాజ్ కుమార్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకొనే అంశాలు ఉన్నాయి. యాక్షన్, సామాజిక అంశాలతో వచ్చే సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చుతుంది.


Click it and Unblock the Notifications











