Carmeni Selvam Movie Review: కార్మేని సెల్వం మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Rating: 2.75/5
నటీనటులు: సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ తదితరులు
దర్శకత్వం: రామ్ చక్రి
నిర్మాత: అరుణ్ రంగరాజు
బ్యానర్: పాత్‌వే ప్రొడక్షన్స్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: శ్రీ శరవణన్,
మ్యూజిక్: MAAS,
సినిమాటోగ్రఫి: యువరాజ్ దక్షన్,
ఎడిటింగ్: జగన్ ఆర్వీ, దినేష్ ఎస్,
ప్రొడక్షన్ డిజైనర్: శంకర్
డిస్ట్రిబ్యూషన్: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్
రిలీజ్ డేట్: 2026-04-03
కారు డ్రైవర్ సెల్వం (సముద్ర ఖని) భార్య శాంతి (లక్ష్మీప్రియ), కొడుకుతో మధ్య తరగతి జీవితాన్ని అప్పులు, ఆర్థిక సమస్యలతో గడపుతుంటాడు. సంపత్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్) అనే వ్యాపారవేత్త వద్ద పనిచేస్తుంటాడు. భర్తకు చేదోడు వాదోడుగా శాంతి ఇడ్లీ కొట్టు నడుపుతుంటుంది. సంపత్ తన భార్య (అభినయ)తో కలిసి వెకేషన్స్‌కు వెళ్తూ కారును సెల్వంకు అప్పగించి వెళ్తే దానిని క్యాబ్‌గా మార్చి డబ్బులు సంపాదించడం మొదలుపెడుతాడు. కొన్ని కారణాల పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడం వల్ల డబ్బు సంపాదన కోసం షార్జా వెళ్తాడు. కానీ అక్కడ ఉండటం ఇష్టం లేక సొంత గ్రామానికి తిరిగి వస్తాడు.

సెల్వం మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా నడించింది? చేతిలో చిల్లిగవ్వ లేని సెల్వం మధ్య తరగతి అడంబరాలకు ఎందుకు వెళ్తాడు? ధనవంతుడిగా జీవించాలంటే.. ధనికుడిలా ఖర్చు పెట్టాలనే అతడి ఆలోచన ఎలాంటి ఇబ్బందులకు దారి తీసింది? సెల్వం, శాంతి దంపతుల సొంతింటి కల ఎలాంటి సమస్యలకు దారి తీసింది? సెల్వంకు సంపత్ నుంచి ఎలాంటి సహకారం అందింది? డబ్బు సంపాదన కోసం షార్జాకు ఎందుకు వెళ్లాడు? డబ్బులు బాగా సంపాదిస్తున్న సమయంలో తిరిగి సొంత గ్రామానికి ఎందుకు వచ్చాడు? సంపత్ జీవితం సెల్వంకు ఎలాంటి పాఠాన్ని నేర్పింది? అనే ప్రశ్నలకు సమాధానమే కార్మేని సెల్వం సినిమా కథ.
దర్శకుడు రామ్ చక్రి అటెంప్ట్ చేసిన ఈ కథ మధ్య తరగతి జీవితాలను ప్రతిబింబిస్తుంది. సముద్రఖని పాత్ర చుట్టూ అల్లుకొన్న సన్నివేశాలు, పాత్రలు బాగున్నాయి. కానీ కథలో స్పీడ్ లేదు. చెప్పాలనుకొన్న పాయింట్‌ను తిప్పి తిప్పి సాగదీసి చెప్పడం వల్ల స్టోరీలో ఎమోషన్స్ సరిగా ప్లేస్ కాలేదనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో సముద్రఖని క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకొన్నాడు. ఈ కథలో కీలకమైన గౌతమ్ వాసుదేవన్ మీనన్, అభినయ ట్రాక్‌ను వాడుకోకపోవడం వల్ల మరింతగా ఎమోషన్స్ మిస్ అయ్యాయనిపిస్తుంది. మిడిల్ క్లాస్ భర్త పోరాటం, ఫ్యామిలీ కోసం త్యాగాలకు సంబంధించిన విషయాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. సెకండాఫ్‌ను ఎమోషన్స్ దట్టించి చక్కగా డీల్ చేశాడు. దాంతో ఈ సినిమా ఫీల్ గుడ్ మూవీ అనేది మనసుకు హత్తుకొనేలా చేస్తుంది.
సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సముద్రఖని ఎమోషనల్ సీన్లలో సెల్వం పాత్రలో ఒదిగిపోయి నటించారు. ఫ్యామిలీ కోసం తాపత్రయపడే భర్తగా, తండ్రిగా తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. సమాజంలో మనం చూసే బాబాయ్, తండ్రి, మామ లాంటి వ్యక్తుల పాత్రను పోలి ఉండే రోల్‌లో జీవించాడు. గౌతమ్ మీనన్, అభినయ పాత్రలు తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎమోషనల్ కంటెంట్‌ను డెలివరీ చేశారు. లక్ష్మీ ప్రియ మధ్య తరగతి భార్య పాత్రలో ఆకట్టుకొన్నారు.
ఈ సినిమాకు మ్యూజిక్, సినిమాటోగ్రఫి ప్లస్ పాయింట్. సముద్ర తీరంలో వేసిన సెట్, మిడిల్ క్లాస్ వాతావరణం కోసం డిజైన్ చేసిన వాతావరణం, క్యాబ్ సర్వీస్ సీన్లను బాగా క్యాప్చర్ చేశారు. పలు సన్నివేశాలను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ విషయంలో జగన్ ఆర్వీ, దినేష్ ఎస్ ఇంకాస్త కఠినంగా వ్యవహరించాల్సింది. అరుణ్ రంగరాజు నిర్మాతగా అనుసరించిన విలువలు బాగున్నాయి. ఫ్యామిలీ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.


Click it and Unblock the Notifications











