twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బోర్‌ జల్లు

    By Staff
    |

    Chirujallu
    -జలపతి
    చిత్రం: చిరుజల్లు
    నటీనటులు: తరుణ్‌, రిచా, బాలసుబ్రమణ్యం.
    సంగీతం: వందేమాతరం శ్రీనివాస్‌
    నిర్మాత: జి.వి.జి.రాజు
    స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: శ్రీరామ్‌ బాలాజీ.

    చిరుజల్లు పడుతుంటే...చలిలో వేడీ..వేడీ..టీతాగాలనిపిస్తుంది. చిరుజల్లు చిత్రం చూశాక కూడా వెంటనే టీ తాగాలనిపిస్తుంది. తలనొప్పి తగ్గించుకోవాలంటే అదే చక్కటి మార్గం కదా! ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు విడుదలకు ముందే క్రేజ్‌ ను సంపాదించుకున్నాయి. అవీ అన్ని అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి. ప్రేక్షకులను నానా హింస పెట్టాయి. అదే తరహాలో క్రేజ్‌ ఏర్పడిన ఈ చిరుజల్లు కూడా అదే మాదిరిగా నిరాశపర్చింది. సినిమా అంతా బోర్‌. పాత దర్శకులు పాత ఐడియాలతో భయపెట్టిస్తుంటే, కొత్త దర్శకులు కూడా పాత స్క్రీన్‌ ప్లేతో జనాలని అదరగొడుతున్నారు. ఈ చిత్రంలో కథ, కథనం, మాటలు, ఇంకా..ఏమైనా ఉంటే..అవీ..అన్నీ పాతే. రోత కూడా.

    ఈ సినిమా చూస్తున్నంత సేపు ఈ సీన్‌ ఎప్పుడు అయిపోతుందా అనుకుంటాం. మరో సీన్‌ లోనైనా కొత్తదనం ఉంటుందని ఆశ. కానీ మన ఆశలు అడియాసలే. ఇంగ్లీషులో చెప్పాలంటే...a sense of deja vu. ఈ సినిమాలోనూ ప్రతి వాక్యం ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ చెప్పుతుంటారు. వీటికి తోడు సినిమా ముందు ఒక కొటేషన్‌, ఇంటర్వెల్‌ లో ఒక కొటేషన్‌, సినిమా అయ్యాక కొటేషన్‌. సినిమాలోనూ ప్రేమ అంటే త్యాగం అనీ...బోషణం అనీ బోల్డన్నీ కొటేషన్లు, లెక్చర్లు. ఉపన్యాసాల కోసం అయితే మనం ఏదన్నా బుక్‌ కొనలేమా? ఈ సినిమా చూసి కొటేషన్లు నేర్చుకోవాలా?

    తరుణ్‌, రిచా ప్రేమించుకుంటారు. తరుణ్‌ అనాథ. ఏ తోడూ లేకుండానే యుపిఎస్‌ సి కు ప్రిపేర్‌ అవుతాడు. కంప్యూటర్‌, బైక్‌, కోట్‌, సూట్‌ ...ఇలా అన్నీ ఉన్న అసలు సిసలు హీరో. మామూలు ఉద్యొగం ఇంటర్వ్యూ కోసం సూట్‌ వేసుకొని వెళ్ళే కథనాయకుడు. రిచాకు నాన్న(బాలసుబ్రమణ్యం) అంటే ప్రేమ. ఆయన అమ్మ కూడా. బాలు వీరి ప్రేమకు ఒప్పుకుంటాడు. యుపిఎస్‌ సి ఇంటర్వ్యూకు వెళుతున్న తరుణ్‌ ను కొంతమంది కిడ్నాప్‌ చేసి చంపేందుకు ప్రయత్నిస్తారు. ఎవరు చంపాలనుకుంటారు? ఎందుకు చంపాలనుకుంటారు? అనేదే సినిమా.

    ఈ సినిమాలో విలన్‌ ఎవరో ముందేనుంచి మనకు తెలుస్తుంది. ఐనా దాన్నో పెద్ద సస్పెన్స్‌ లాగా దర్శకుడు చివరి వరకూ లా....గిస్తాడు. క్లైమాక్స్‌ లో పేలవంగా దాన్ని విప్పేస్తాడు. తొలిప్రేమ నిర్మాత నిర్మించిన ఈ చిత్రం పేలవంగా పేలిపోయింది. వందేమాతరం సంగీతం సో..సో.. తరుణ్‌ బాగానే చేసినా ఉపయోగంలేని క్యారక్టర్‌. రిచా నటించిందో..లేక ఆమె ఎప్పుడూ అలానే ఉంటుందో తెలీదు. కొత్త దర్శకుడు శ్రీరాం బాలాజీ గురించి ఇంకా చెప్పాలా ప్రత్యేకంగా?

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X