Extraction 2 Review: కుటుంబాన్ని కాపాడే హై ఓల్టేజ్ యాక్షన్.. 'ఎక్స్‌ట్రాక్షన్ 2' రివ్యూ
టైటిల్: ఎక్స్‌ట్రాక్షన్ 2
నటీనటులు: క్రిస్ హెమ్స్ వర్త్, టినాటిన్, గోల్ షిఫ్టె ఫరహాని, ఆడం బెస్సా, ఓల్గా కురిలెంకో, టోర్నీకి గోగ్రీ చియానీ, ఇడ్రిస్ ఎల్బా తదితరులు
సినిమాటోగ్రఫీ: గ్రెగ్ బాల్డీ
రచన: జో రుస్సో
నేపథ్య సంగీతం: హెన్రీ జాక్‌మన్, అలెక్స్ బెల్చర్
నిర్మాణ సంస్థ: నెట్‌ఫ్లిక్స్
దర్శకత్వం: సామ్ హార్ గ్రేవ్
ఓటీటీ విడుదల తేది: జూన్ 16, 2023
ఓటీటీ వేదిక: నెట్‌ఫ్లిక్స్
మార్వెల్ థోర్ గా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు క్రిస్ హెమ్స్ వర్త్. 2020 సంవత్సరంలో క్రిస్ హెమ్స్ వర్త్ నటించి సాలిడ్ హిట్ కొట్టిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఎక్స్‌ట్రాక్షన్' (Extraction Movie). యాక్షన్ సీక్వెన్స్ తో అదరగొట్టిన ఈ సినిమాకు మూడేళ్ల తర్వాత సీక్వెల్ గా వచ్చింది 'ఎక్స్‌ట్రాక్షన్ 2' (Extraction 2). నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా మరి యాక్షన్ ప్రేమికులను మెప్పించిందా? లేదా? అనే విషయాలు నేటి రివ్యూలో (Extraction 2 Telugu Review) చూద్దాం.
కథ:ఎక్స్‌ట్రాక్షన్ మూవీలో టేలర్ రేక్ (క్రిస్ హెమ్స్ వర్త్) చనిపోయినట్లుగా చూపించి.. క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇస్తారు. మొదటి పార్ట్ ఎండింగ్ నుంచి ఎక్స్‌ట్రాక్షన్ 2 స్టార్ట్ అవుతుంది. బంగ్లాదేశ్ లో బ్రిడ్జిపై నుంచి నదిలో పడిపోయిన టేలర్ రేక్ ఇండియాలోని బెంగాల్ కు తీవ్ర గాయాలతో కొట్టుకువస్తాడు. అక్కడి నుంచి టేలర్ టీమ్ తీసుకెళ్లి చికిత్స అందిస్తుంది. చావు అంచుల దాకా వెళ్లిన టేలర్ రిటైర్ మెంట్ తీసుకుంటాడు. కానీ అతన్ని వెతుక్కుంటూ ఓ మిషన్ వస్తుంది.

హైలెట్స్:జార్జియాలోని ప్రమాదకరమైన జైలు నుంచి కెటెవాన్ (టినాటిన్), ఆమె పిల్లలను కాపాడే ఆ మిషన్ ను టేలర్ ఎందుకు టేకప్ చేశాడు? ఈ మిషన్ లో టేలర్ కు ఎదురైన సవాళ్లు ఏంటీ? టినాటిన్ కు టేలర్ కు ఉన్న రిలేషన్ ఏంటీ? వాళ్లను టేలర్ కాపాడగలిగాడా? వంటి ఆసక్తికర హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చూడాలంటే ఎక్స్‌ట్రాక్షన్ 2 చూడాల్సిందే.
విశ్లేషణ:ఎక్స్‌ట్రాక్షన్ మూవీతో దాని సీక్వెల్ పై అంచనాలు పెరిగాయి. మొదటి పార్ట్ కు మించిన హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో ఎక్స్‌ట్రాక్షన్ 2 సినిమా అంచనాలు పూర్తిగా అందుకుంది. ఇక యాక్షన్ జోనర్ సినిమాల్లో పెద్దగా స్టోరీ ఏమాత్రం ఉండదు. యాక్షన్ సీన్లు ఎలా తెరకెక్కించారన్నదే పెద్ద సవాలు. అందులో డైరెక్టర్ పూర్తిగా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. టేలర్ రేక్ రికవరీ తర్వాత మిషన్ ప్రారంభం, విలన్ క్రూరత్వం వంటి సన్నివేశాలతో థ్రిల్లింగ్ గా కథలోకి వెళ్లిపోతాం.

ప్లస్-మైనస్:ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉండటమే కాకుండా.. ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా పండాయి. అందుకు కారణం నటీనటుల ప్రతిభే. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో ఎమోషన్స్ పెద్దగా వర్కౌట్ కావు. కానీ ఎక్స్‌ట్రాక్షన్ 2లో పాత్రల బ్యాక్ర్ గ్రౌండ్ స్టోరీ పెద్దగా తెలియకపోయినా ఎమోషనల్ గా చాలా బాగా కనెక్ట్ అవుతాం. యాక్షన్ మిషన్ లో పాత్రల మధ్య బాండింగ్ చాలా బాగా చూపించారు. అలాగే ఈ జోనర్ చిత్రాల్లో సినిమాటిక్ లిబర్టీ ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. సినిమాటోగ్రఫీ, విజువల్స్, సాంకేతిక విలువలు అన్నిటికిమంచి యాక్షన్ కొరియోగ్రఫీ అదిరిపోయింది.

ఎవరెలా చేశారంటే?:క్రిస్ హెమ్స్ వర్త్ నటన గురించి తెలిసిందే. థోర్ ఎంతోమంది హృదయాలు గెలుచుకున్న క్రిస్ టేలర్ రేక్ మరోసారి మెస్మరైజ్ చేశాడు. యాక్షన్ సీన్లో మొదటి పార్ట్ కు మించి అదరగొట్టాడు. గోల్ షిఫ్టె ఫరహానికి ఇందులో ఫుల్ లెంత్ యాక్షన్ ఎపిసోడ్స్ దొరికాయి. తను కూడా వావ్ అనిపించింది. నిక్ బ్రదర్ గా ఆడం బెస్సా సైతం ఆకట్టుకున్నాడు. ప్రతి ఒక్కరూ తమ నటనతో పూర్తి స్థాయిలో మెప్పించారు.

ఫైనల్ గా చెప్పాలంటే?:యాక్షన్ ఇష్టపడేవారికి మంచి మీల్స్ వంటిది ఎక్స్‌ట్రాక్షన్ 2. ఫస్ట్ పార్ట్ కంటే మించి స్టంట్స్, వయెలెన్స్ ఉన్నాయి. 2 గంటల నిడివి గల సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా యాక్షన్ సీక్వెన్స్ తో అలరిస్తుంది. మూడో పార్టుకు కూడా హింట్ ఇచ్చిన ఎక్స్‌ట్రాక్షన్ 2ను వీకెండ్ లో ఓ లుక్కేయొచ్చు.


Click it and Unblock the Notifications











