Curry & Cyanide Review: ఒక మహిళ - 6 హత్యలు.. ఒళ్లు గగుర్పొడిచే డాక్యుమెంటరీ.. కర్రీ అండ్ సైనైడ్ సమీక్ష
కర్రీ అండ్ సైనైడ్: ది జాలీ జోసెఫ్ కేస్
నటీనటులు: రెమో రాయ్, రోజో థామస్, రెంజి విల్సన్, కె.జి. సైమన్, జాలీ జోసెఫ్, మేఘన శ్రీవాస్తవ్, నిఖిలా హెన్రీ, సి.ఎస్ చంద్రిక, బి.ఏ అలూర్ తదితరులు
స్క్రీన్‌ప్లే: షాలిని ఉషాదేవీ
దర్శకుడు: క్రిస్టో టామీ
ఎడిటింగ్: శృతి సుకుమారన్, ప్రవీణ్ ప్రభాకర్
సంగీతం: తుషార్ లాల్
ప్రొడక్షన్: ఇండియా టుడే ఒరిజినల్స్
విడుదల ఫ్లాట్ ఫాం: నెట్ ఫ్లిక్స్ ఓటీటీ
విడుదల తేదీ: 2023-12-22
ఈ మధ్య కాలంలో రియల్ స్టోరీలను బేస్ చేసుకుని సినిమాలు, సిరీసులు, డాక్యూమెంటరీలు వస్తున్నాయి. ఇక ఆ కోవలోనే కర్రీ అండ్ సైనైడ్ డాక్యూమెంటరీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ డాక్యుమెంటరీ 2023, డిసెంబర్ 22 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఓ నిజ జీవిత కథ ఆధారంగా ఈ డాక్యుమెంటరీని క్రిస్టో టామీ.. ఆధ్యంతం ఆసక్తి కలిగించేలా తెరకెక్కించాడు. ఈ రియల్ ఇన్సిడెంట్.. మీడియాలో వార్తలను ఫాలో అయ్యే వారికి తెలిసే ఉంటుంది. కేరళలో జాలీ జోసఫ్ కేసు చాలా మందికి గుర్తుండే ఉంటుంది.

2022లో వెలుగులోకి వచ్చిన ఈ కేసు... దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జాలీ జోసఫ్ అనే మహిళ ఏకంగా 6 హత్యలు చేయడం భయభ్రంతులకు గురిచేసింది. 2002 నుంచి 2016 మధ్య కాలంలో ఆమె ఈ హత్యలను పకడ్బందీగా చేసింది. ఆమె తన కుటుంబ సభ్యులను చంపేందుకు తినే ఆహారంలో సైనేడ్ కలుపుతూ హత్యలకు పాల్పడింది. అయితే ఆమె చేసిన హత్యలు ఎలా బయటపడ్డాయి.. ఆమె హత్యలను ఎందుకు చేసింది... ఒక్కతే చేసిందా.. ఇంకా ఎవరైనా ఆమెకు సాయం చేశారా.. ఇంతకీ ఈ జాలీ జోసఫ్ కేసు డాక్యుమెంటరీగా ప్రేక్షకుల్ని మెప్పించిందా? ఈ డాక్యుమెంటరీ ఎలా ఉంది?
కథ ఏంటంటే.... కేరళలోని కూడతైకి చెందిన జాలీ జోసఫ్ కు అదే ప్రాంతానికి చెందిన రాయ్ థామస్ తో పరిచయం ఏర్పడి.. ప్రేమగా మారింది. ఇక వీరు ఇంట్లో చెప్పి... పెళ్లి చేసుకుంటారు. అయితే ఆమె ఎంకామ్ చేసినట్లు చెప్పి... రాయ్ థామస్ ను పెళ్లాడుతుంది. ఇక రాయ్ థామస్ పేరెంట్స్ (టామ్ థామస్, అన్నమ్మ థామస్) ఇద్దరు టీచర్లుగా పని చేసి రిటైర్డ్ అవుతారు. ఇంట్లో వాళ్లందరూ చదువుకున్న వారు కావడంతో.. మహిళ తన కాళ్ల మీద తాను నిలబడాలనే ఉద్దేశంతో కోడలిని ఉద్యోగం చేయమని అంటుంది. కానీ జాలీకి ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు. ఇక అత్త పోరు పడలేక జాలీ ఎన్ఐటీలో ఉద్యోగం వచ్చిందని చెప్పి... రోజూ బయటకు వెళ్లి వచ్చేది. ఇక భర్త రాయ్ కుటుంబ ఆస్తిమీద కన్నేసిన జాలీ.. ఆస్తిని సొంతం చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే సైనేడ్ హత్యలకు ప్లాన్ వేసింది. 2002లో తన అత్త అన్నమ్మను.. 2008లో మామ టామ్ థామస్ ను, 2010లో భర్త రాయ్ థామస్ ను, ఆ తర్వాత 2012లో అన్నమ్మ థామస్ సోదరుడు మ్యాథ్యూను, 2016లో జూలీ రెండో భర్త అయిన షాజు భార్యను, ఏడాదిన్నర పాపను కిరాతకంగా చంపేసింది. ఇన్ని హత్యలు చేస్తున్నా... ఇంట్లో వాళ్లకు ఎందుకు డౌట్ రాలేదు.. ఎందుకు కేసు పెట్టలేదు.. అసలు ఈ విషయం ఎలా బయటపడిందనే విషయాలు తెలుసుకోవాలంటే.. డాక్యూమెంటరీని చూడాల్సిందే.

విశ్లేషణ... నేషనల్ అవార్డ్ విన్నర్ క్రిష్టినో టామీ ఈ డాక్యుమెంటరీని డైరెక్ట్ చేశారు. కేసుకు సంబంధించి అన్ని వివరాలను బయటకు తీసుకురావటంలో లీగల్ చిక్కులు ఉండటం వల్ల... కొన్ని విషయాలను ప్రేక్షకుల ముందుకు పెట్టలేదని తెలుస్తోంది. డాక్యుమెంటరీ మొత్తం జాలీ జోసఫ్ కుటుంబం వైపు నుంచే చూపించారు. కేసును ఇన్‌వెస్టిగేట్ చేసిన అధికారి కేటీ సిమోన్, జాలీ పెద్ద కుమారుడు రెమో, మరదలు రెంజీ విల్సన్, మరిది రోజో థామస్ లు స్టోరీని కళ్లకు కట్టినట్లు డాక్యూమెంటరీలో వివరించారు. ఇక ఈ డాక్యుమెంటరీలో హత్యలు చేసిన వ్యక్తి గురించి.. అతడి మానసిక పరిస్థితి గురించి వివరిస్తారు. కానీ ఇందులో జాలీ గురించిన మానసిక పరిస్థితి ఎలా ఉందో మాత్రం చెప్పలేదు. ధనిక కుటుంబంలో పుట్టిన జాలీకి ఆస్తి కోసం ఎందుకు హత్యలు చేసిందనే కారణాలను వివరించలేదని తెలుస్తోంది.
చివరగా... కేరళలో జరిగిన వాస్తవ సంఘటనలని కళ్లకు కట్టినట్టు చూపించిన ఈ డాక్యుమెంటరీని ఓటీటీలో ఓసారి చూసేయొచ్చు.


Click it and Unblock the Notifications











