Custody review ఎమోషన్స్ పండని యాక్షన్ డ్రామా! నాగచైతన్య పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?
నటీనటులు: నాగచైతన్య, కృతిశెట్టి, అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి, జీవా, ఆనందిని, రాంకీ, వెన్నెల కిషోర్ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి
సమర్పణ: పవన్ కుమార్
మ్యూజిక్: ఇళయరాజా, యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫి:ఎస్ఆర్ కదీర్
ఎడిటింగ్: వెంకట రాజన్
రిలీజ్ డేట్: 2023 05 12
కస్టడీ కథ ఏమిటంటే?:శివ (నాగచైతన్య) సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్. అదే గ్రామానికి చెందిన కారు డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన రేవతిని ప్రేమిస్తుంటాడు. రేవతికి బలవంతంగా పెళ్లి చేయాలని భావిస్తున్న సమయంలో లేచిపోవాలని డిసైడ్ అవుతారు. అయితే అదే రోజు రాత్రి డ్యూటీ చేస్తున్న శివ.. కారులో తప్ప తాగిన రాజు (అరవింద్ స్వామి), సీబీఐ ఆఫీసర్ జార్జ్ (సంపత్ రాజ్)ను అరెస్ట్ చేస్తాడు. లాకప్‌లోనే ఉండగానే ఐజీ నటరాజ్ (శరత్ కుమార్) ఇద్దరిని చంపడానికి ప్రయత్నిస్తాడు.

కస్టడీలో ట్విస్టులు:శివ పోలీస్ కానిస్టేబుల్ ఎందుకు కావాలనుకొన్నాడు? సీబీఐ ఆఫీసర్ జార్జ్, రౌడీ రాజును నటరాజ్ ఎందుకు చంపాలనుకొన్నాడు? అయితే నటరాజ్ కాల్పులు జరిపిన రౌడీ రాజును శివ ఎందుకు కాపాడాలని అనుకొన్నాడు. శివ జీవితంలో సోదరుడు విష్ణు (జీవా) ఎలాంటి ప్రభావాన్ని చూపాడు? శివ జీవితంలోకి ముఖ్యమంత్రి దాక్షాయిణి ఎందుకు ప్రవేశించింది? ఈ కథలో మిలటరీ ఆఫీసర్ (సింధూర పువ్వు రాంకీ కథ ఏమిటి? చివరకు రౌడీ రాజును రక్షించాడా? తన ముప్పు తిప్పలు పెట్టిన సీఎం, ఐజీలకు ఎలాంట గుణపాఠం నేర్పాడు అనే ప్రశ్నలకు సమాధానమే కస్టడీ సినిమా కథ.

వెంకట్ ప్రభు టేకింగ్:సాధారణమైన కానిస్టేబుల్ జీవితంలోకి ముఖ్యమంత్రి, ఐజీ లాంటి వ్యక్తులు ప్రవేశిస్తే పరిస్థితి ఏమిటి? డ్యూటీ తప్ప మరో ప్రపంచం తెలియని సిన్సియర్ పోలీస్‌ను కెలికితే ఎలా ఉంటుందనే పాయింట్ చుట్టు దర్శకుడు వెంకట్ ప్రభు అల్లుకొన్న కథ, క్యారెక్టర్లు, కథను నడిపించిన విధానం బాగుంది. ఫస్టాఫ్‌లో కొంత లవ్ ట్రాక్‌తో కథ ఆలస్యంగా మొదలవుతుంది. రాజు క్యారెక్టర్, సంపత్ రాజ్ పాత్ర ఎంట్రీ తర్వాత వేగం పుంజుకొంటుంది. ఫస్టాఫ్‌లో అండర్ వాటర్ సీక్వెన్స్ బాగుంటాయి.

ఇక సెకండాఫ్ విషయానికి వస్తే..:కథ మొత్తం సెకండాఫ్‌లో ల్యాండ్ కావడం.. ఆ కథలోకి విభిన్న పాత్రలు రావడంతో గందరగోళం మారుతుంది. బ్రదర్ సెంటిమెంట్‌తో జీవా, ఆనంది క్యారెక్టర్లు, ప్రేమి విశ్వనాథ్, రాంకీ పాత్రలు, అలాగే వైభవ్ స్పెషల్ అప్పీయరెన్స్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్‌గా కనిపిస్తాయి. సెకండాఫ్‌లో లెంగ్త్ ఈ సినిమాకు చిన్న సమస్యగా మారుతుంది. ఏదైతే ఈ సినిమాకు ప్రధానమైన భావోద్వేగం అనుకొంటామో ఆ పాయింట్ స్టోరిని ఫైర్ చేయలేకపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది.

నటీనటుల పెర్ఫారెన్స్ విషయానికి వస్తే:నాగచైతన్యకు శివ క్యారెక్టర్ డిఫరెంట్ అని చెప్పవచ్చు. టాప్ స్టార్లతో కలిసి కథను తన భుజాలపై మోయడమే కాకుండా తన పాత్ర వరకు ఎమోషన్స్ పలికించాడు. లవర్‌గా, తమ్ముడిగా, బాధ్యతాయుతమైన పోలీస్ లాంటి వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు. శరత్ కుమార్, అరవింద్ స్వామి లాంటి నటులతో పోటీపడి నటించాడు. కృతిశెట్టికి పెద్దగా యాక్టింగ్‌కు స్కోప్ లేకపోయింది. అరవింద్ స్వామి ఉన్నంతలో బాగా చేశాడు. సంపత్ రాజ్, శరత్ కుమార్ తమదైన శైలిలో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు.

కస్టడీలో స్పెషల్ ఎలిమెంట్స్:సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్‌లో జీవా, ఆనందిని క్యారెక్టర్లు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. అలాగే రాంకీ, వంటలక్క ప్రేమి విశ్వనాథ్ కొన్ని సీన్లలో మెరిశారు. అలాగే హీరో వైభవ్ కూడా ఓ పాటలో ఆకట్టుకొనేందుకు ప్రయత్నించారు. యాక్షన్‌తోపాటు స్టార్లతో మంచి ప్యాకేజ్‌గా ఈ సినిమాను వెంకట్ ప్రభు తనదైన శైలిలో చిత్రీకరించారు. మిగితా పాత్రల్లో నటించిన నటులు తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.

ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే..:ఇళయ రాజా, యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఈ సినిమాకు పాజిటివ్ పాయింట్. స్పీడ్‌గా సాగే యాక్షన్ డ్రామాకు బ్యాక్ గ్రౌండ్ స్కోరు సన్నివేశాలను ఎలివేట్ చేసిందనే చెప్పాలి. సినిమాటోగ్రఫి అదనపు ఆకర్షణ. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టిపెట్టాల్సి ఉందనిపిస్తుంది. నిర్మాత శ్రీనివాసా చిట్టూరి అనుసరించిన నిర్మాణ విలువలు టాప్ క్లాస్. సెకండాఫ్‌లో టాప్ స్టార్స్‌ను ఎంపిక చేసిన విధానం సినిమాను క్రేజీగా మార్చింది.

ఫైనల్‌గా ఎలా ఉందంటే?:బ్రదర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కస్టడీ. కథకు బలంగా అనిపించే ఎమోషన్స్ పూర్తి స్థాయిలో పండకపోవడం ఈ సినిమాకు కొంత మైనస్. సినిమా నిండా కథను ముందుకు తీసుకెళ్లే పాత్రల్లో స్టార్లు కనిపించడం కొత్తగా ఉంది. వెంకట్ ప్రభు టేకింగ్, నాగచైతన్య పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ఎసెట్. యాక్షన్ డ్రామాను, స్క్రీన్ ప్లే ప్రధానంగా నడిచే సినిమాలను ఇష్టపడే వారికి కస్టడీ నచ్చే అవకాశం ఉంది. అంచనాల లేకుండా వెళితే మంచి అనుభూతిని పంచుతుంది.


Click it and Unblock the Notifications











