Deepavali Review మానవ సంబంధాలను, గుండె తడిని గుర్తు చేసే.. దీపావళీ మూవీ రివ్యూ..
Rating: 2.75/5
నటీనటులు: కాళీ వెంకట్, పూ రామ్, దీపన్ వైరమండి తదితరులు
దర్శకత్వం: రా వెంకట్
నిర్మాత: స్రవంతి రవి కిషోర్
సమర్పణ: కృష్ణ చైతన్య
బ్యానర్: శ్రీ స్రవంతి మూవీస్
సినిమాటోగ్రఫి: ఎం జయప్రకాశ్
మ్యూజిక్: తీసన్
ఎడిటర్: ఆనంద్ జెరాల్డీన్
ఆర్ట్ డైరెక్టర్: కేబీ నందూ
ఆడియోగ్రఫి: తపస్ నాయక్
లిరిక్స్: గోసాలా రాంబాబు
రిలీజ్ డేట్: 2023-11-11
పేదరైతు శీనయ్య (పూ రామ్) మనవడు గణేష్ (దీపన్ వైరుమండి) అంటే ప్రాణం కంటే ఎక్కువ ఇష్టం. గణేష్‌కు కర్రోడు అని ప్రేమగా పిలుచుకొనే తన పెంపుడు మేక అంటే ఎంతో ఇష్టం. దీపావళీ పండుగకు తన మనవడికి కొత్త బట్టలు కొనివ్వాలనే కోరికతో పెంపుడు మేకను అమ్మడానికి వీరస్వామి అనే మాసం వ్యాపారికి బేరం పెడుతాడు. అయితే తన పెంపుడు మేకను బేరం పెట్టడంతో గణేష్‌ను బాధపెడుతుంది.

పెంపుడు మేక కర్రోడిని అమ్మిన తర్వాత ఏం జరిగింది? మాసం వ్యాపారి వీరస్వామి మేకను తీసుకెళ్లాడా? మేకను అమ్మాలనే తాత నిర్ణయంతో గణేష్ ఏం చేశాడు? దేవుడికి మొక్కు కొన్న మేక తప్పిపోవడం శీనయ్యకు, వీరస్వామికి ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టింది? చివరకు గణేష్‌కు దీపావళీ పండుగ రోజున శీనయ్య బట్టలు కొనిచ్చాడా? వీరస్వామి, శీనయ్య, గణేష్ జీవితంలో దీపావళీ వెలుగులు విరజిమ్మాయా? అనే ప్రశ్నలకు భావోద్వేగమైన సమాధానమే దీపావళీ పండుగ సినిమా కథ.
మానవ సంబంధాలు, భావోద్వేగాలను మేళవించి దర్శకుడు రా వెంకట్ రాసుకొన్న కథ మూడు రకాల కోణంలో సాగుతుంది. తాత, మనవడు మధ్య ఎమోషనల్ జర్నీ, జీవిత అస్థిత్వం కోసం ప్రయత్నించే మాసం వ్యాపారి, ప్రేమను గెలిపించుకోవడానికి ప్రయత్నించే ప్రేమికుల అంశాలను కథలో జోప్పించిన తీరు ఆయన ప్రతిభకు అద్దం పట్టింది. మూడు కథలను బ్యాలెన్స్‌గా ఎలాంటి తడబాటు లేకుండా ఓ ప్రవాహంలో ముందుకు తీసుకెళ్లడం ఈ సినిమాకు బ్యూటీగా నిలిచాయి. కమర్షియల్ హంగులకు కోసం ప్రత్యేకంగా ప్రయత్నించగా..ఎమోషనల్ అంశాలనే కమర్షియల్‌గా మార్చడం ఈ సినిమా స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపిస్తుంది.

ఇక నటీనటులు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. సినిమాలో పెద్దగా పేరున్న నటీనటులు కనిపించరు. కానీ స్టార్ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా ప్రతీ ఒక్క చిన్న నటుడు కూడా సినిమాను భావోద్వేగంగా మలిచారు. తాతగా పూ రామ్, మనవడిగా దీపన్, వీరస్వామిగా కాళీ వెంకట్ తమ పాత్రల్లో ఒదిగిపోవడమే కాకుండా పూర్తిగా న్యాయం చేశారు.మిగితా క్యారెక్టర్లలో నటించిన వారు కూడా ఆకట్టుకొన్నారు.
సాంకేతిక విషయాలకు వస్తే.. కమర్షియల్ సినిమాకు ఏ మాత్రం తీసిపోకుండా ప్రతీ టెక్నీషియన్ ప్రాణం పెట్టారనిపిస్తుంది. ఎం జయప్రకాశ్ సినిమాటోగ్రఫి విజువల్ ట్రీట్‌గా మార్చింది. కేబీ నందూ ఆర్ట్ విభాగం ప్రతిభ సినిమాను సహజసిద్దంగా ఉండేలా చేసింది. తీసన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు బలంగా మారింది. గోసాల రాంబాబు సాహిత్యం సినిమాకు ఆకర్షణగా మార్చింది.డైలాగ్స్ ఆలోచింప జేస్తాయి. వాణిజ్య విలువలను పాటిస్తూ స్రవంతి రవికిషోర్ అనుసరించిన నిర్మాణ విలువలు సినిమా క్వాలిటీని పెంచాయి.

తెలుగు ప్రేక్షకులకు గుండెలో తడిని, మానవ సంబంధాలను గుర్తు చేసే సినిమాలు అప్పుడప్పుడు తారసపడుతుంటాయి. అలాంటి కోవలో రూపొందిన చిత్రమే దీపావళీ. చీకట్లు అలుముకొన్న ముగ్గురు జీవితాల్లో వెలుగులు నింపిన కథ స్వభావ రీత్యా కొంత స్లోగా సాగినా నిరాశను కలిగించదు. భావోద్వేగాలను గుర్తు చేసే స్వచ్చమైన గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమా. దీపావళీ సినిమాలోని భావోద్వేగాలు ప్రతీ ఒక్కరికి హృదయాన్ని మెలిపెట్టి కొత్త అనుభూతిని పంచుతుంది. అలాంటి అనుభూతులను థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ చేయాలంటే.. ఓ సారి ఈ సినిమాపై లుక్కేయండి.. మిమ్మల్ని ఏ మాత్రం నిరాశపరచదు.


Click it and Unblock the Notifications











