Jagame Thandhiram Review: ధనుష్ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే!
Recommended Video
అసురన్, కర్ణన్ లాంటి చిత్రాలతో సత్తా చాటుకొన్న ధనుష్, ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన జగమే తంత్రం చిత్రం నెట్‌ఫ్లిక్స్ ద్వారా నేరుగా రిలీజైంది. లాక్‌డౌన్ కారణంగా రిలీజ్ కాకపోయిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం ఎలా ఉందంటే...

జగమే తంత్రం కథ
తమిళనాడులోని మధురై ప్రాంతంలో గొడవలు, హత్యలతో కాలం వెళ్లదీసే యువకుడు సురులీ (ధనుష్). హత్యలకు పాల్పడుతున్న క్రమంలో అతడి ప్రాణాలు ముప్పు ఏర్పడటంతో ఓ నెల రోజులపాటు ఎక్కడైనా తలదాచుకోవాలని ఊరి పెద్దలు సూచిస్తారు. ఆ సమయంలో బ్రిటన్‌లో గ్యాంగ్‌స్టర్ శివదాసుకు వ్యతిరేకంగా పనిచేయడానికి కిరాయి గుండాగా లండన్‌కు వెళ్లే అవకాశం సురులీకి లభిస్తుంది. అక్కడ ఓ సింగర్ అటీలా (ఐశ్వర్య లక్ష్మీ)ను చూసి తొలి పరిచయంలోనే ప్రేమలో పడిపోతాడు.

కథలో ట్విస్టులు ఎలా ఉన్నాయంటే
బ్రిటన్‌లో అడుగుపెట్టిన తన బాస్ పీటర్ కోసం సురులీ ఏం చేశాడు. గ్యాంగ్‌స్టర్‌గా శివదాసును ఎదుర్కోవడానికి పీటర్‌కు ఎలాంటి సలహాలు ఇచ్చారు. శివదాస్ ఎలాంటి పరిస్థితుల్లో మరణిస్తాడు? శివదాస్ మరణం తర్వాత సురులీ ఎందుకు పశ్చాత్తాపం పడుతాడు. తనని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన సురులీని అటీలా చంపాలని ఎందుకు కుట్ర పన్నుతుంది? తనను చంపడానికి ప్రయత్నించిన అటీలాను ఎందుకు క్షమించాడు? తన బాస్ పీటర్‌కు సురులీ ఎందుకు ఎదురు తిరగాల్సి వస్తుంది అనే ప్రశ్నలకు సమాధానమే జగమే తంత్రం మూవీ కథ.

ఫస్టాఫ్ ఎలా ఉందంటే...
మధురై ప్రాంతంలోని ఫ్యాక్షన్ గ్రూపులో కీలక వ్యక్తిగా సురులీ పరిచయంతో కథ మొదలవుతుంది. ట్రైన్‌ను ఆపి అందులో ఓ వ్యక్తిని హత్య చేయడం లాంటి ఎఫెక్టివ్ సీన్లతో కథలో ఏదో ఊహించని మలుపు ఉంటుందనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే మధురై నుంచి ఓ నెల రోజులపాటు బయటకు వెళ్లాల్సి రావడంతో ఎక్కడికి వెళ్లాలని ఆలోచిస్తున్న సమయంలో లండన్‌కు వెళ్లే ఛాన్స్ రావడంతో ఇక అసలు కథ మొదలుతుంది. లండన్‌లో పీటర్, శివదాసు మధ్య జరిగే గ్రూపు తగాదాలతో కథ పరమ రొటీన్‌గానే సాగుతుంది. పేలవమైన సన్నివేశాలు, కథ, కథనాలు బలహీనంగా ఫస్టాఫ్‌లో కనిపిస్తాయి. శివదాసు మర్డర్ ఆ తర్వాత సురలీపై ఎటాక్‌తో ప్రథమార్థం ముగింపులో కొంత హైప్ క్రియేట్ అవుతుంది. దాంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది.

సెకండాఫ్ ఎమోషనల్‌గా
ఇక సెకండాఫ్‌లో తనను చంపడానికి ప్రయత్నించిన ప్రేయసి అటీలాను నిలదీయడంతో తన ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. తమిళనాడులో శ్రీలంక శరణార్థులు లాంటి ఎమోషనల్ కథతో మొదలై.. లండన్‌లో తలదాచుకొన్న తమిళ శరణార్థుల వరకు స్టోరి షిఫ్ట్ అవుతుంది. సెకండాఫ్‌లో భావోద్వేగమైన సన్నివేశాలతో మూవీ గాడిలో పడిందనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే భావోద్వేగాన్ని కొనసాగించలేక మళ్లీ రోటీన్ గ్యాంగ్ వార్‌తో కథ దారి తప్పినట్టు అనిపిస్తుంది. ఇక పేలవంగా సినిమా ముగియడంతో ప్రేక్షకులకు తీరని నిరాశే మిగులుతుంది.

కార్తీక్ సుబ్బరాజు టేకింగ్
ఇక దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు గత సినిమాలను దృష్టిలో పెట్టుకొంటే ధనుష్‌తో ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. అయితే జగమే తంత్రం సినిమా విషయానికి వస్తే.. ప్రధాన కథకు సంబంధించిన పాయింట్ బాగానే ఉన్నప్పటికీ.. కథనం, సన్నివేశాలను అల్లుకొనే విషయంలో దారుణంగా తడబాటుకు గురయ్యాడనే చెప్పవచ్చు. కథా గమ్యాన్ని చేరుకోవడానికి ఎంచుకొన్న వ్యూహం బెడిసికొట్టిందనే చెప్పవచ్చు. ప్రథమార్థంలో కొన్ని బిల్డప్ సీన్లు, సెకండాఫ్‌లో ఎమోషనల్ కంటెంట్ తప్ప సినిమాలో బలమైన అంశాలు ఏవీ కనిపించవు.

ధనుష్ ఫెర్ఫార్మెన్స్ గురించి
ఇక ధనుష్‌కు ఈ చిత్రంలోని సురులీ పాత్ర కొట్టిన పిండే. అసురన్, కర్ణన్ లాంటి సినిమాల్లో విశ్వరూపం చూపించిన ధనుష్ స్టామినాకు జగమే తంత్రం చిత్రంలో సురులీ పాత్ర ఏ మాత్రం సరితూగదనే చెప్పవచ్చు. కాకపోతే బలహీనమైన పాత్రలో పరకాశం చేసి ఏదో మ్యాజిక్ చేయడానికి ప్రయత్నించిన తీరు ఆకట్టుకొంటుంది. సినిమా గ్రాఫ్ పడిపోయిన ప్రతీసారి తన పెర్ఫార్మెన్స్ నిలబెట్టేందుకు ప్రయత్నించాడు. సెకండాఫ్‌లో హీరోయిన్ కాంబినేషన్ ఉన్న సీన్లలో మంచి నటనను ప్రదర్శించాడు. మొత్తంగా ఈ చిత్ర భారాన్ని తన భుజాలపై మోసి మెప్పించేందుకు ప్రయత్నించాడు.

మిగితా పాత్రల్లో
ఇక హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ పాత్ర నిడివి తక్కువగా ఉండటం వల్ల ఆమె పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సెకండాఫ్ ఆరంభంలో శరణార్థులుగా మారిన కథను చెప్పిన సన్నివేశాల్లో నటన బాగుంది. ఇక శివదాసుగా జోజు జార్జి, పీటర్ స్ప్రోట్‌గా జేమ్స్ కాస్మో, ఇతర పాత్రల్లో ఒకేలా ఉన్నాయి. బాబా భాస్కర్ అతిధి పాత్రలో మెరిసాడు.

సాంకేతిక విభాగాల పనితీరు...
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. శ్రేయాస్ కృష్ణ అందించిన సినిమాటోగ్రఫి చాలా బాగుంది. లండన్, మధురై ప్రాంతాల్లోని వాతావరణాన్ని చక్కగా కెమెరాలో ఒడిసి పట్టుకొన్నాడు. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ కథ, సన్నివేశాలకు తగినట్టుగా ఉంది. పాటలకు పెద్దగా స్కోప్ లేకపోవడం వల్ల తన మార్కును చాటుకోలేకోయాడనే ఫీలింగ్ కలుగుతుంది. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించిన వివేక్ హర్షన్‌కు ఇంకా చేతినిండా పనుందనిపిస్తుంది. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలకు తగినట్టుగా నిర్మాణ విలువలు ఉన్నాయి.

ఫైనల్‌గా చెప్పుకోవాల్సింది ఏమిటంటే..
ఎక్కడ పుట్టామన్నది కాదు.. ఎక్కడ జీవితం కొనసాగిస్తున్నామనేది మనిషికి గుర్తింపు ఉండాలనే బలమైన పాయింట్‌తో రూపొందిన చిత్రం ఆ విషయాన్ని పూర్తిస్థాయిలో ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది. శరణార్థుల చుట్టు తిరిగే కథను ఎమోషనల్‌గా కార్తీక్ సుబ్బరాజు చెప్పలేకపోయాడని చెప్పవచ్చు.
మంచి కథను, ధనుష్ స్టామినాను పూర్తి స్థాయిలో ఉపయోగించకోవడంలో టీమ్ దారుణంగా విఫలమైందనే చెప్పవచ్చు. ధనుష్ అభిమానించే వారికి ఈ సినిమా నచ్చుతుంది. తమిళ వాసన ఎక్కువగా కావడం కూడా తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేని విషయం. తమిళ నేటివిటీ కారణంగా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు కనెక్ట్ కాకపోవచ్చు.

నటీనటులు
ధనుష్, ఐశ్వర్య లక్ష్మీ, జేమ్స్ కాస్మో, జోజు జార్జ్, కలైయరాసన్, బాబా భాస్కర్ తదితరులు
కథ, దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్
నిర్మాతలు: ఎస్ శశికాంత్, చక్రవర్తి, రామచంద్ర
మ్యూజిక్: సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫి: శ్రేయాస్ కృష్ణ
ఎడిటింగ్: వివేక్ హర్షన్
బ్యానర్లు: వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైనర్‌మెంట్
ఓటీటీ రిలీజ్: నెట్ ఫ్లిక్స్
ఓటీటీ రిలీజ్ డేట్: 2021-06-18


Click it and Unblock the Notifications











