Dhurandhar Movie Review: దురంధర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేష్ బేడీ తదితరులు
రచన, దర్శకత్వం: ఆదిత్య ధార్
నిర్మాతలు: ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే
సినిమాటోగ్రఫి: వికాస్ నౌలాఖ
ఎడిటింగ్: శివకుమార్ వీ పనికర్
మ్యూజిక్: శాశ్వత్ సచ్‌దేవ్
రిలీజ్ డేట్: 2025-12-05
1999 సంవత్సరంలో కాందహార్ హైజాక్, 2002 సంవత్సరంలో భారత పార్లమెంట్‌పై ఎటాక్ తర్వాత ఇండియన్ ఇంటెలిజెన్స్ చీఫ్ అజయ్ సన్యాల్ (ఆర్ మాధవన్) పాకిస్థాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు, శిబిరాలను విచ్ఛిన్నం చేయడానికి ఓ మిషన్ ఏర్పాటు చేస్తాడు. ఆ స్పెషల్ మిషన్ కోసం దురంధర్ అలియాస్ హమ్జా ఆలీ మజారీ (రణ్‌వీర్ సింగ్) పాకిస్థాన్‌లోకి ప్రవేశపెడుతారు. కరాచీలో మాఫియా డాన్ రెహ్మాన్ డకాయిట్ (అక్షయ్ ఖన్నా) శిబిరంలో చేరిపోతాడు. స్థానికంగా రెహ్మాన్‌తో ఎస్పీ చౌదరీ అస్లాం (సంజయ్ దత్)కు, ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్), స్థానిక రాజకీయ నేత జమీల్ యమాలీ (రాకేశ్ బేడీ) మధ్య జరిగే విభేదాలు, వైరాలను తనకు అనుకూలంగా మలుచుకొని కరాచీ డాన్‌గా హమ్జా పట్టు సాధిస్తాడు.
దురంధర్ అలియాస్ హమ్జా పాకిస్థాన్‌లోకి అడుగు పెట్టడానికి అతడి ప్రయాణం ఎలా సాగింది? రెహ్మాన్ డెకాయిట్ ముఠాలో చేరడానికి ఎలాంటి ప్లాన్స్ వేశాడు? జమీల్ యమాలీ కూతురు (సారా అర్జున్)తో లవ్ ట్రాక్ ఎలా సాగింది? ఎస్పీ చౌదరీ అస్లాంకు రెహ్మాన్‌కు ఉన్న వైరం ఏమిటి? ఎస్పీ చౌదరీ అస్లాం ఆటను దురంధర్ ఎలా కట్టించాడు? అజయ్ సన్యాల్ మిషన్‌ను దురంధర్ ఎలా అమలు చేశాడు? కరాచీ ప్రాంతంలోని రాజకీయాలను దురంధర్ తన ఆధీనంలోకి తెచ్చుకొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే దురంధర్ సినిమా కథ.

పాకిస్థాన్ ఉగ్రవాద దాడులకు ప్రతీకారంగా భారత్ చేపట్టే స్పెషల్ ఆపరేషన్లను కథగా మలచుకొని గతంలో యూరీ, ఆర్టికల్ 370 లాంటి సినిమాలను దర్శకుడు ఆదిత్య ధార్ తెరకెక్కించారు. దేశభక్తి, ఉగ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం అనే కాన్సెప్ట్‌తో అజిత్ దోవల్ పాత్రను స్పూర్తిగా తీసుకొని అజయ్ సన్యాల్ (ఆర్ మాధవన్) చుట్టూ రాసుకొన్న యాక్షన్, స్పై థ్రిల్లర్. భారత వ్యతిరేక ఉగ్ర కార్యకలాపాలకు అడ్డా కరాచీ ప్రాంతంలో దురంధర్ పాత్రను ప్రవేశపెట్టి కథను నడిపించిన విధానం బాగుంది. రెహ్మాన్ పాత్రలో అక్షయ్ ఖన్నా క్యారెక్టర్‌ను క్రూరంగా డిజైన్ చేసిన తీరు సినిమాకు హైలెట్ అనిపిస్తుంది. అస్లాం పాత్ర సంజయ్, ఐఎస్ఐ మేజర్ అర్జున్ రాంపాల్ పాత్రలను పవర్‌ఫుల్‌గా మలిచి ఆసక్తికరమైన ఎపిసోడ్స్‌తో కథలో లీనమయ్యేలా చేశాడు. చాఫ్టర్ వైజ్‌గా కథను చెప్పిన విధానం కొత్తగా ఉంది. కాకపోతే రన్ టైమ్ ఎక్కువగా ఉండటం వల్ల మూవీ సాగదీసినట్టు ఉంటుంది. కరాచీలో భారత కరెన్సీ తయారీ, అజ్మల్ కసబ్, బెనజరీ భుట్టోకు సంబంధించిన కొన్ని సీన్లు కథకు బలంగా మారాయి.
దురంధర్ పాత్రలో రణ్‌వీర్ సింగ్ పవర్‌ఫుల్‌గా కనిపించాడు. రణ్‌వీర్‌కు కమ్ బ్యాక్ మూవీగా చెప్పుకోవచ్చు. ఫస్టాఫ్‌లో అండర్ డాగ్‌గా కనిపించిన దురంధర్ పాత్ర.. సెకండాఫ్‌లో యాక్షన్ పార్ట్‌తో చెలరేగిపోయాడు. ఇక ఈ చిత్రంలో అక్షయ్ ఖాన్నా తన స్టైల్ విలనిజంతో మరోసారి ఫుల్ మార్కులు కొట్టేశాడు. రణ్‌వీర్‌తో పోటాపోటీగా నటించాడు. సంజయ్ దత్, ఆర్ మాధవన్ బలమైన పాత్రలతో తమ మార్కును వదిలేశారు. కరాచీ ప్రాంత రాజకీయ నేతగా రాకేష్ బేడీ ఆకట్టుకొన్నాడు. సారా అర్జున్‌కు పెద్దగా నటించడానికి స్కోప్ లేకపోయినా.. గ్లామర్‌తో సరిపుచ్చుకొన్నది.
దురంధర్ సినిమాకు మ్యూజిక్ ప్లస్ పాయింట్. శాశ్వత్ సచ్‌దేవ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలోని సన్నివేశాలను ఎలివేట్ చేశాయి. వికాశ్ నౌలాఖ సినిమాటోగ్రఫి బాగుంది. కరాచీ వాతావరణాన్ని తెర మీద సహజం కనిపించేలా చిత్రీకరించారు. శివకుమార్ పనికర్ ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఆదిత్య ధార్ జ్యోతి దేశ్‌పాండే అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
పాకిస్థాన్‌లోని ప్రధాన నగరాలాను స్థావరంగా చేసుకొని భారత్‌లో ఉగ్ర కార్యకలాపాలను చేసే ముఠాలను విచ్చిన్నం చేసే కథతో రూపొందిన చిత్రం దురంధర్. అజిత్ దోవల్ క్యారెక్టర్‌ను స్పూర్తిగా తీసుకొని రాసుకొన్న కథలో దురంధర్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. హింస, యాక్షన్ సన్నివేశాలు బీభత్సంగా ఉంటాయి. యాక్షన్ లవర్స్‌కు, దేశభక్తి ప్రధానంగా సాగే సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. తప్పకుండా థియేటర్‌లోనే చూడండి.


Click it and Unblock the Notifications











