Dhurandhar 2: ఆ రక్తపాతానికి నోబెల్ ప్రైజ్ పక్కా... ధురంధర్ 2పై స్టార్ హీరోయిన్ షాకింగ్ రివ్యూ
ఆదిత్యధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ మూవీ ధురంధర్ ది రివెంజ్ (ధురంధర్ 2) మేనియా దేశం మొత్తాన్ని కమ్మేసింది. నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా ఈ సినిమా వసూళ్ల దుమ్ము దులుపుతోంది. పుష్ప 2, బాహుబలి, జవాన్ తదితర సినిమాల రికార్డులను ఒక్కొక్కటిగా బద్ధలు కొడుతోంది ధురంధర్ 2. ఫస్ట్ వీకెండ్ నాటికే 500 కోట్ల మార్క్‌ను అవలీలగా టచ్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాను వీక్షించిన సెలబ్రిటీలు.. దర్శకుడు ఆధిత్య ధర్, హీరో రణ్‌వీర్ సింగ్, ఇతర నటీనటులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం ధురంధర్ 2పై దారుణమైన కామెంట్స్ చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..
కన్నడ చిత్ర పరిశ్రమలో అగ్రనటిగా గుర్తింపు తెచ్చుకున్నారు దివ్య స్పందన అలియాస్ రమ్య. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. అభి, ఆకాష్, అమృతధారే, సంజు వెడ్స్ గీత వంటి కన్నడ చిత్రాలతో శాండిల్‌వుడ్‌లో స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. అలాగే తమిళంలో సూర్యతో వారణం ఆయిరం, ధనుష్ సరసన పొల్లాదవన్ సినిమాలలో నటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సరసన అభిమన్యు సినిమాలో నటించి తెలుగువారిని కూడా పలకరించింది.

హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే అనూహ్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి సంచలనం సృష్టించింది రమ్య. కాంగ్రెస్ అభ్యర్ధిగా 2013లో జరిగిన మాండ్య లోక్‌సభ ఉప ఎన్నికల్లో గెలిచి ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టింది. అయితే 2014 పార్లమెంట్ ఎన్నికల్లో రమ్య ఓడిపోయారు. అయినప్పటికీ దివ్య స్పందనకు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ బాధ్యతల్ని అప్పగించారు రాహుల్. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న రమ్య పలు అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజుల క్రితం దర్శన్ అరెస్ట్, వీధి కుక్కల అంశాలపై దివ్య స్పందన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ధురంధర్ 2ను వీక్షించిన ఆమె.. సెలబ్రిటీలంతా జేజేలు పలుకుతున్న సినిమాలో ఏం లేదు అన్నట్లుగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది రమ్య.
ఇప్పుడే ధురంధర్ 2 సినిమా చూశాను. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టే విషయాన్ని అందరూ గొప్పగా చెబుతున్నారు. ఈ సినిమాను చూస్తుంటే అంతులేని అధ్యాయాలు, అత్యంత విసుగుపుట్టించే ఓ పాఠ్య పుస్తకాన్ని చదువుతున్నట్లే అనిపించింది. ఒక దశలో మీ మైండ్ పూర్తిగా చేతులెత్తేసి.. మీ కళ్ల ముందు జరుగుతున్న ఘోరాన్ని చూసి, నిరాశతో నవ్వడం తప్పించి ఏం చేయలేని పరిస్ధితి కనిపిస్తుంది. థియేటర్‌లో మీ సమయాన్ని, డబ్బును వృథా చేసుకోకండి.. పాజ్ చేసి ఫోన్‌లో స్క్రోల్ చేస్తూ జీవితంలో తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించుకునే తరహా కంటెంట్ ఈ సినిమా. కేవలం స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలో చూస్తూనే మంచిది అని దివ్య స్పందన అన్నారు.
ఇందులో దర్శకత్వం, డైలాగ్స్, ఎడిటింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, నటన అన్నీ నాసిరకంగా ఉన్నాయి. మార్చి 19న విడుదల తేదీ అని వాళ్లకు ఎవరూ చెప్పలేదేమో లేదా వాళ్లకు తెలిసి కూడా పర్ఫెక్ట్‌గా ఉంది, వదిలేయండి అని అనేసినట్లుగా ఉన్నారు. ధురంధర్ (మొదటి భాగం)లో జనం కేరింతలు కొడుతూ.. చప్పట్లు కొడుతూ, ఉత్సాహంగా కనిపించారు. కానీ ఈసారి మాత్రం ప్రేక్షకులు దేనినీ పట్టించుకోలేదు. థియేటర్‌లో ఉన్న ఈ సామూహిక నిరాశను మీరు స్పష్టంగా అనుభూతి చెందొచ్చు అని దివ్య స్పందన ఎద్దేవా చేశారు.
సినిమాను రణ్‌వీర్ మోశాడని చెబుతున్న ప్రతి ఒక్కరీని అడుగుతున్నా.. అసలు అతను దేనిని మోస్తున్నాడు? నాకు కనిపించిందల్లా అతని జుట్టే. మొదటి భాగంలో అని జుట్టుకు ఒక వ్యక్తిత్వం, ఆకర్షణ, ప్రత్యేకత ఉండేవి. కానీ పార్ట్ 2లో మాత్రం అది ఊరికే ప్రతి దానికి అడ్డుగ ఉంది. బహుశా సహాయ నటుడి నామినేషన్‌కి జుట్టు ఎలిజబుల్ కావొచ్చేమో. అసలు సినిమాలో ఆ హింస ఏమిటీ? ఇది అసలు సినిమాయే కాదు.. చేతికి దొరికిన ఏ వస్తువునైనా ఉపయోగించి, ఎంత తెలివిగా హింసకు పాల్పడవచ్చో తెలిపే ఒక విజువల్ కైపిడి. సిరంజియా, స్పానర్, కత్తులు, ముళ్ల బంతులు, కటార్లు, కొడవళ్లు, గొలుసులు, తుపాకులు, బాంబులు, బాజూకాలు, షట్టర్లు ఇలా ఏద దొరికితే దానిని వాడేశారు అంటూ దివ్య స్పందన మండిపడ్డారు.
దర్శకుడు తనతో తానే నిరంత పోటీపడ్డాడు. ప్రతి సన్నివేశాన్ని, దాని ముందు సన్నివేశం కంటే మరింత హింసాత్మకంగా ఎలా తీయాలనే చూశాడు. అది చివరికి దిగ్భ్రాంతి కలిగించడం మానేసి.. పగలబడి నవ్వేలా చేస్తుంది. రెండు కాళ్లు నరికేసినా, మొండెం మీద కిరోసిన్ పోసినా, ఆ వ్యక్తి ఏదో టెడ్ టాక్ మధ్యలో ఉన్నట్లుగా డైలాగులు చెబుతూనే ఉంటాడు. మెడికల్ సైన్స్‌కి జిందాబాద్. అసలు ఆస్కార్ సంగతి మర్చిపోండి.. ఈ సినిమాకు నోబెల్ బహుమతి రాబోతోందని దివ్య స్పందన సెటైర్లు వేశారు.
క్లుప్తంగా చెప్పాలంటే.. ధురంధర్ 2 దారుణంగా నిరాశ కలిగించింది. ఇది కేవలం నిద్ర తెప్పించే ఒక బోరింగ్ ఇష్యూ, ఒక కామెడీ సినిమా మాత్రమే. మొదటి భాగం మిమ్మల్ని ఉత్సాహపరిచి ఉంటే.. అసలు ధురంధర్ 2 ఎందుకు అని ఆలోచింపజేస్తుంది. రణ్‌వీర్.. నువ్వు ఇంతకటే గొప్పవాడివి, ఆదిత్య ధర్.. అతి జాతీయ వాదం, ప్రచార ఆర్భాటం వంటివి ప్రస్తుతం పూర్తిగా ఔట్‌డేట్ అయిపోయాయి. ఇలాంటి వాటిని వదిలేయ్ అంటూ దివ్య స్పందన చురకలు అంటించారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రణ్‌వీర్ అభిమానులు రమ్యపై విరుచుకుపడుతున్నారు.


Click it and Unblock the Notifications




















