DJ Tillu movie review సిద్దు తీన్మార్ ఫెర్ఫార్మెన్స్.. డీజే టిల్లు సౌండ్ మామూలుగా లేదుగా!
సినిమా పరిశ్రమలో ప్రతీ నాలుగైదేళ్లకు ఫిల్మ్ మేకింగ్ ఆలోచనలను మార్చే సినిమాలు, హీరోలు, దర్శకులు వస్తుంటారు. వారి ప్రభావం, ప్రేక్షకుల ఆదరణ వల్ల యువ దర్శకులకు స్పూర్తి, కొత్త ఆలోచనలపట్ల బలమైన నమ్మకం కలుగుతుంది. తెలుగు సినిమా పరిశ్రమలో గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఓ చిన్న ట్రెండ్ క్రియేట్ చేసిన సినిమాల తక్కువే. ఇలాంటి పరిస్థితుల్లో సరికొత్త ఆలోచన, రచనా ప్రతిభ, పాత్రల డిజైన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అనే ఫీలింగ్‌ను రిలీజ్‌కు ముందు డీజే టిల్లు మూవీ క్రియేట్ చేసింది. అయితే రిలీజ్ తర్వాత ఈ సినిమా ఎలాంటి అనుభూతిని కలిగించిందనే వివరాల్లోకి వెళితే..

డీజే టిల్లు కథేంటంటే?
బాల గంగాధర్ తిలక్ అలియాస్ డీజే టిల్లు తన మనసుకు నచ్చే పనిచేసే ఆధునిక పోకడలను అనుసరించే యువకుడు. మ్యూజిక్ అంటే పడిచచ్చే టిల్లు పెళ్లిళ్లు, పేరంటాలు, శుభకార్యాలలో డీజే వాయిస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. దిల్ కుష్‌గా లైఫ్‌ను లీడ్ చేసే టిల్లుకు రాధిక (నేహా శెట్టి) అనే సింగర్ పరిచయం అవుతుంది. ఆమెను చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు. రాధిక కారణంగా ఓ హత్య కేసులో చేతికి బురద అంటించుకొంటాడు.

డీజే టిల్లు సినిమాలో ట్విస్టులు
మ్యూజిక్‌ను ఇష్టపడే డీజే టిల్లు అసలు లక్ష్యం ఏమిటి? రాధికతో పరిచయం తర్వాత ఎలాంటి పరిస్థితులను, సమస్యలను ఎదుర్కొంటాడు? రాధిక కారణంగా ఎందుకు హత్యకేసులో ఇరుక్కొంటాడు? ఈ కథలో ప్రిన్స్ సిసిల్, పోలీస్ ఆఫీసర్ (బ్రహ్మానందం), నర్రా శ్రీను పాత్రలకు రాధిక కు కనెక్షన్ ఏమిటి? చివరకు డీజే టిల్లు ఎలా ఈ కేసును బయటపడ్డాడు? చివరకు రాధిక, టిల్లు రిలేషన్‌షిప్‌కు ఎలాంటి ముగింపు లభించింది అనే ప్రశ్నలకు సమాధానమే డీజే టిల్లు సినిమా కథ.

ఫస్టాఫ్ ఎలా ఉందంటే?
మంచి ఎమోషనల్ పాయింట్‌తో ఓపెన్ చేసిన డీజే టిల్లు కథ ఎకాఎకిన సిక్స్ ట్రాక్ హైవే మీద రేసింగ్‌లా మారిపోతుంది. బాల గంగాధర్ తిలక్ తండ్రి చెప్పే సంఘటనలతో కథ ఫన్ రైడింగ్‌గా సరసర దూసుకెళ్తుంంది. అనుక్షణం ముఖం మీద చిరునవ్వును కొనసాగేంచేలా ఫస్టాఫ్ హిలేరియస్‌గా టపటప సీన్లు పడిపోతుంటాయి. సీట్లో కూర్చొన్న ప్రేక్షకుడికి వినోదాన్ని ఆరగించడమే ఓ స్ట్రెస్ అనేంతగా మారిపోతుంది. ఇలా సాగుతూ కామెడీ బేస్ కథనంతో ఓ ట్విస్ట్‌తో తొలి భాగం ముగుస్తుంది.

సెకండాఫ్ పరిస్థితి ఏమిటంటే?
ఇక సెకండాఫ్‌లో దర్శకుడు విమల్, రచయిత సిద్దూ జొన్నలగడ్డ రాసుకొన్న స్క్రీన్ ప్లే, సంభాషణలు, ఎమోషన్స్, కామెడీ సీన్లు సినిమాను మరోమెట్టు ఎక్కించేలా ఉంటాయి. హాస్పిటల్‌లో సీన్లు, బ్రహ్మనందం, ప్రిన్స్, నర్రా శ్రీను, ఫిష్ వెంకట్ ఉన్న సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయి. సెకండాఫ్‌లో కాస్త రొటీన్‌గా మారుతుందనే ఫీలింగ్ కలిగే సమయంలో మళ్లీ కరెక్షన్ చేసుకొని సరైన ట్రాక్ మీదకు రావడం సినిమాకు ప్లస్‌గా మారిందని చెప్పవచ్చుఇక ఇలాంటి హిలేరియస్ సినిమాకు క్లైమాక్స్ ఎలా ఉంటుంది.. ఎక్కడైనా తప్పడుగులు వేస్తారేమో అనే ఆనుమానాలకు కూడా స్కోప్ ఇవ్వకుండా అంతే ఫన్, అంతే ఎమోషన్‌ను మిక్స్ చేసి సీక్వెల్‌కు రోడ్ క్లియర్ చేశారు.

దర్శకుడు విమల్ టేకింగ్
దర్శకుడు విమల్ కృష్ణ, సిద్దూ జొన్నలగడ్డ రాసుకొన్న కథ, స్క్రీన్ ప్లే, సన్నివేశాలు టీమ్ వర్క్ బలాన్ని తెలియజెప్పాయి. దర్శకుడు విమల్ కథను తెరకెక్కించిన విధానం, పాత్రలకు ఎంచుకొన్న నటీనటులు చూస్తే.. అక్కడే సక్సెస్ కొట్టాడనిపిస్తుంది. డెబ్యూ డైరెక్టర్‌గా విమల్‌కు డీజే టిల్లు మంచి లాంచ్ ప్యాడ్ అని చెప్పవచ్చు.

సిద్దూ జొన్నలగడ్డ పెర్ఫార్మెన్స్
సిద్దు జొన్నలగడ్డ గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. తన గత సినిమాల్లో ప్రతిభావంతుడు అనే ముద్ర వేసుకొన్నాడు. కానీ నటుడిగా మరో జోన్‌లోకి ప్రవేశించడానికి డీజే టిల్లును గట్టిగా వాడుకొన్నాడనే విషయం స్పష్టమవుతుంది. నటన, మాటలు, కథ ఇలా బహుముఖ ప్రదర్శనతో ఇండస్ట్రీకి మంచి నటుడు లభించాడనే విషయం ఈ సినిమా క్లారిటీ ఇచ్చింది. సిద్దూ బాడీ లాంగ్వేజ్, పాత్రకు తగినట్టు డ్రస్ కోడ్, పాత్రకు తగినట్టు యాటిట్యూడ్, అవసరమైన చోట అమాయకత్వం, పరిస్థితిని బట్టి చలాకీతనం టిల్లు పాత్రను పర్‌ఫెక్ట్‌గా మార్చాయి.

నేహా శెట్టి, ఇతర నటీనటుల గురించి
ఇక నేహా శెట్టి కూడా మంచి ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నది. బోల్డ్ సీన్లలో సిద్దూతో మంచి కెమిస్ట్రీ కుదిరేలా చేసింది. సిద్దులో ఫెర్ఫార్మెన్స్ బయటకు రావడానికి రాధిక పాత్రలో చక్కటి బిహేవియర్‌ను ప్రదర్శించింది. ఇంకా మిగితా పాత్రల విషయానికి వస్తే.. సిద్దూ తండ్రిగా చేసిన నటుడు (పేరు తెలియదు) సూపర్బ్. సిద్దూతోపాటు సమాంతరంగా టఫ్ పోటిని ఇచ్చాడు. ప్రిన్స్, బ్రహ్మాజీ, నర్రా శ్రీను తమ పాత్రల పరిధి మేరకు మంచి హాస్యాన్ని పంచారు.

టెక్నికల్ టీమ్ ప్రతిభ గురించి
నటీనటులు పెర్ఫార్మెన్స్‌ను పక్కన పెడితే.. సాంకేతిక నిపుణుల ప్రతిభ డీజే టిల్లు సినిమాకు మరో బలంగా మారింది. సాయిప్రకాశ్ సినిమాటోగ్రఫి అద్బుతంగా ఉంది. రేసింగ్ సీన్లు, నైట్ ఎఫెక్ట్ సన్నివేశాలు, టాప్ యాంగిల్ షాట్స్ సన్నివేశాలను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. శ్రీచరణ్ పాకాల, తమన్ మ్యూజిక్ మరో స్పెషల్ ఎట్రాక్షన్. డీజే టిల్లు టైటిల్ సాంగ్ సినిమాకు ఆంథమ్‌గా మారింది. ఇక కీలకమైన ఎపిసోడ్స్‌కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పిక్స్‌గా మారింది. ఎడిటర్ నవీన్ నూలి ఫర్‌ఫెక్ట్ జాబ్ చేసి సినిమాను పరుగులు పెట్టించారు.

సితారా ప్రొడక్షన్ వ్యాల్యూస్
సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ కుటుంబ చిత్రాలకు పేరున్న సంస్థ. కానీ డీజే టిల్లు చూసిన తర్వాత ఆ సంస్థ ప్రతిష్టకు అనుగుణంగానే అత్యున్నత మేకింగ్, కంటెంట్ విలువలతో తెరకెక్కించారు. నిర్మాత నాగవంశీ అనసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ సినిమా రిలీజ్‌కు ముందు ఉన్న అనుమానాలకు చక్కగా సమాధానం ఇచ్చారని చెప్పవచ్చు. సితార బ్యానర్ ఖాతాలో డీజే టిల్లు రూపంలో మరో బ్లాక్‌బస్టర్ చేరడం ఖాయమని చెప్పవచ్చు.

ఫైనల్ జడ్జిమెంట్
డీజే టిల్లు సినిమా పూర్తిగా నాన్ స్టాప్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఆధారంగా సాగే ఫుల్టు, బిందాస్ సినిమా. సిద్దూ జొన్నలగడ్డ మల్టీ టాస్కింగ్ వర్క్, యాటిట్యూడ్, డ్రెసింగ్, లుక్, బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. విమల్ డైరెక్షన్‌లో వెండితెర మీద ఏకపాత్రాభినయం చేశాడంటే అతిశయోక్తి కాదేమో. ఒక కనురెప్ప కొడితే పంచ్ డైలాగ్స్, ఫన్ మిస్ అయిపోతామనే అంత పర్‌ఫెక్ట్‌గా సీన్లు ఉంటాయి. టికెట్‌కు పెట్టిన ప్రతీ రూపాయి డబుల్ పైసా వసూల్. ఇటీవల కాలంలో వచ్చిన ఏకదమ్ పవర్ ప్యాక్డ్ కామెడీ ఎంటర్‌టైనర్. రానున్న రోజుల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసే సత్తా ఉన్న సినిమాగా మారే అవకాశం డీజే టిల్లుకు ఉన్నాయని చెప్పవచ్చు.
Recommended Video

డీజే టిల్లు మూవీలో నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు: సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి, ప్రిన్స్, బ్రహ్మాజీ, ఫిష్ వెంకట్, నర్రా శ్రీను తదితరులు
రచన: విమల్ కృష్ణ, సిద్దు జొన్నలగడ్డ
మాటలు: సిద్దు జొన్నలగడ్డ
సంగీతం: శ్రీచరణ్ పాకాల, తమన్
సినిమాటోగ్రఫి: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలి నేని
పీఆర్వో: లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి. డి. వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశి
దర్శకత్వం: విమల్ కృష్ణ
రిలీజ్ డేట్: 2022-02-12


Click it and Unblock the Notifications











