twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బండి ని లాగించటం కష్టమే(రివ్యూ)

    By Staff
    |

    -జోశ్యుల సూర్య ప్రకాష్

    సంస్థ:జి.యస్‌.కె.నెట్‌వర్క్‌
    నటీనటులు:నరేష్‌,తాన్య,మలిష్కా,జయప్రకాష్‌రెడ్డి,
    రావు రమేష్‌,గీతాసింగ్‌,మాస్టర్‌ భరత్‌ తదితరులు
    కెమెరా:అరుణ్ కుమార్
    ఆర్ట్:రమణ
    సంగీతం:వల్లూరి రాజశేఖర్‌
    కధ,స్క్రీన్ ప్లే,మాటలుదర్శకత్వం:వేగేశ్న సతీష్‌
    నిర్మాత:జి.యస్‌.కె.నాయుడు
    విడుదల:డిసెంబర్ పన్నెండు 2008

    ఈ సినిమాలో ఓ ఫన్నీ సీన్ (దర్శకుడి అభిప్రాయం) ఉంటుంది. అడవిలో దొంగలంతా వెళ్తూంటారు. ఇంతలో హఠాత్తుగా పులి గాండ్రింపు వినపడుతుంది.దాంతో అందరూ భయపడి ప్రక్కనున్న చెట్లు గబగబా ఎక్కేస్తారు. అయితే అందులో ఒకడైన అల్లరి నరేష్ మాత్రం ఎక్కడు. కారణం ఏమిటి అంటే మీరు భయపడతారో లేదో నని నేనే పులి గాండ్రింపు ని మిమిక్రీ చేసాను అంటాడు. దాంతో అంతా నరేష్ ని తిట్టుకుంటూ చెట్లు దిగుతారు. సరిగ్గా సినిమా పరిస్ధితీ అలానే ఉంది. దొంగలంతా అడవుల్లో ఎప్పుడో దాచిన నిధిని దోచుకోవటానికి ఓ రైలు బండిలా బయిలుదేరితే భలే ఉంటుంది కదా అని మనం ఊహించుకుని ధియేటర్ కి వెళితే ఉత్తుత్తినే అలా అన్నాం అడవిలో ఏం జరగదు.ఆసక్తి రేపటం కోసం ఆ నేపధ్యం తీసుకున్నాం అంతే అని తేల్చేస్తాడు. అప్పుడు మన పరిస్ధితీ ఆ చెట్లు ఎక్కి దిగిన వాళ్ళ స్థితే...

    ఎప్పుడో నవాబుల కాలంలో తమ తాతలు దొంగిలించి దాచిన నిధిని వారి మనువలు ఒక్కటై ఎలా తిరిగి సాధించుకున్నారనేదే ఈ చిత్ర కథ. నైజాం నవాబులు తమ సంస్ధానాన్ని భారత్ లో విలీనం చేసేటప్పుడు సంపదను రహస్యంగా దాచి కాపాడుకోవాలనికుంటారు. అప్పుడు ముగ్గురు దొంగలు (అలీ,ఎమ్మెస్ నారాయణ,వేణు మాధవ్) దానిని దారిలోనే కొట్టేసి ఆ అడవిలోనే దాచి ఆ స్ధలం చేరుకునే మార్గాన్ని మ్యాప్ రూపంలో గీసుకుంటారు. అంతేగాక నమ్మకం కోసమో(కధ నడవటం కోసమో) దానిని మూడు ముక్కలు చేసుకుని తలా ఒకరి దగ్గరా భద్రపరుచుకుని విడిపోతారు. తర్వాత కాలంలో వారు మనుమలు కృష్ణ(అల్లరి నరేష్),ఐశ్వర్య(తాన్య),డాన్ (డబుల్ వేణు మాధవ్) దొంగల్లా పెరిగి పెద్దయి ఆ నిధి అన్వేషణకోసం బయిలుదేరతారు. మరో ప్రక్క కృష్ణ,ఐశ్వర్య ప్రేమలో పడతారు. ఆలా విడిపోయి ఎక్కడెక్కడో ఉన్న వారంతా ఎలా కలిసారు,అడవికి ఏ ధైర్యంతో బయిలుదేరారు అనేది ఫస్టాప్ అయితే అడివిలో ఏం సాహసాలు చేసి ఆ నిధిని సంపాదించారన్నది సెకెండాఫ్.

    నో లాజిక్‌ ఒన్లీ ఫన్‌ మేజిక్‌.. అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమా ఓసెన్ లెవన్ ప్రేరణతో చేసినట్లనిపిస్తుంది. అయితే అడివిలో దొంగలు ఏం సాహసాలు చేసి నిధిని సంపాదించుకున్నరనే విషయం లేకపోవడమే మైనస్ గా మారి మహా నసగా తయారయ్యింది. ఎందుకంటే ఫస్టాఫ్ పూర్తయ్యే సరికే హీరో,హీరోయిన్ ప్రేమ ఎపిసోడ్ పూర్తయిపోతుంది.అలాగే ఎక్కడెక్కడో ఉన్న దొంగల మనమలంతా కూడా ఒకటవుతారు..చేరాల్సిన ప్లేస్ అయిన అడవికి వచ్చేస్తారు. ఇక మిగిలింది నిధిని సంపాదించటమే. అయితే ఆ నిధి అన్వేషణలో ప్రతికూల శక్తులు వస్తే మజాగా ఉండేది. అది జరగలేదు. దాంతో కథలో సంఘర్షణ కొద్దిగా కూడా లేకుండా పోయింది. ఇక సినిమాకు ప్రాణమైన ఆ మిడిల్ పేజ్ ని అలీ చెత్త కామెడీ,నరమాంస భక్షకుల పాచి కామెడి ఎపిసోడ్లతో నింపేసారు. అంతే ఫినిష్.

    ఇక అల్లరి నరేష్ కి ఇలాంటి దొంగ క్యారెక్టర్స్ కొట్టిన పిండి. అలాగే హీరోయిన్ గా తాన్యా యధా శక్తి కొలిది గ్లామర్ ని ఒలికించింది. మిగతా కామిడీ ప్యాడింగ్ అంతా ఎప్పటిలాగే సీన్ బాగుంటే నవ్వించారు. లేకుంటే సహనాన్ని పరీక్షించారు. ఫైనల్ గా రచయిత నుండి దర్శకుడుగా మారిన వేగిశ్న సతీష్ దర్శకుడుగా సక్సెస్. రైటర్ గా ఫెయిల్యూర్ అనిపిస్తాడు. ఎక్కడా అనుభవం లేని మొదటి దర్శకుడు అనిపించుకోకపోవటం గొప్ప విషయం. మంచి కథ అయితే మంచి సినిమా గ్యారెంటీగా తీస్తాడని భరోసా ఇచ్చేలా చేసాడు. అయితే ఇవివి ప్రభావం చాలా ఉందని బూతు డైలాగులు,సన్నివేశాలు చెబుతాయి. కెమెరా,ఎడిటింగ్ బాగున్నాయి. సంగీతం ఓకె.

    ఇక బొరు కొట్టి ఈ సినిమాకి వెళితే జీవితం కన్నా బోర్ కొట్టేవి చాలా ఉన్నాయన్న ధైర్యం వస్తుంది. అయినా మీకు నచ్చాలంటే ఫస్టాఫ్ చూసి మొహమాటం లేకుండా వచ్చేయటం ఒకటే మార్గం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X