twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాటకాలోడు (దూకుడు రివ్యూ)

    By Srikanya
    |

    -జోశ్యుల సూర్య ప్రకాష్
    చిత్రం: దూకుడు
    బ్యానర్: 14 రీల్స్ ఎంటర్టైనమెంట్స్ష్
    నటీనటులు: మహేష్ బాబు, సమంత, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోనూసూద్, ధర్మవరపు సుబ్రమణ్యం, మాస్టర్ భరత్, ఎమ్ ఎస్ నారాయణ తదితరులు.
    కథ: గోపీ మోహన్
    మాటలు: కోన వెంకట్
    కెమెరా: కె వి గుహన్
    ఎడిటింగ్: ఎమ్ ఆర్ వర్మ
    సహ నిర్మాత: రమేష్ బాబు
    సమర్ఫణ: కృష్ణ ప్రొడక్షన్స్ ప్రెవేట్ లిమిటెడ్
    సంగీతం: తమన్
    నిర్మాతలు: ఆచంట గోపీచంద్, ఆచంట రామ్ & అనీల్ సుంకర
    స్క్రీన్, దర్శకత్వం: శ్రీను వైట్ల

    మహేష్ బాబు లాంటి స్టార్ హీరో విలన్స్ ని ఎదుర్కోవటానికి యాక్షన్ ని నమ్ముకోకుండా, అల్లరి నరేష్ లాగ నాటకాలాడుతూ వాళ్లను బకరాలను చేస్తూంటే ఎలా ఉంటుంది.. చూస్తున్నంతసేపూ నవ్వు వచ్చినా ఆ తర్వాత అరే.. ఇదేంటి..మనమేం చూస్తున్నాం అనిపిస్తుంది. దూకుడు చిత్రం చూస్తున్నప్పుడు అదే ఫీలింగ్ వస్తుంది. సామాన్యంగా యాక్షన్ కామిడీ లు ఎప్పుడూ సేఫ్ జోనే.. అయితే మధ్యలో ఫ్యామిలీని కూడా కలిపేసి అన్ని వర్గాలని ఆకట్టుకోవాలి అన్న ఆశే అటూ ఇటూ కాకుండా చేసేస్తుంది. మహేష్ దూకుడు కి శ్రీను వైట్ల తన టిపికల్ కామిడీతో పాటు 'అతడు' లాంటి ఫ్యామిలీ సెంటిమెంట్, 'పోకిరి' లాంటి పోలీస్ యాక్షన్ కలపి కాక్ టెయిల్ మిక్స్ చేసి వదిలాడు. దాంతో యాక్షన్ సీన్ వచ్చిన వెంటనే కథ ప్యామిలీ ఎపిసోడ్ లోకి మారిపోయి, ఆ కాస్సేపటికే కామిడీ స్కిట్ లా రూపాంతరం చెంది, మరి కొద్దిసేపటికి రొమాన్స్ పండిస్తూంటుంది. కథలో అల్లిన ధ్రెడ్ లు ఒకదానికొకటి కలవకుండా ముందుకెళుతూంటాయి. అంతేగాక ఎప్పటిలాగే శ్రీను వైట్ల ..హీరో ఎవరైతేనేం.. కామిడీ కామన్ అన్నట్లు తన గత సినిమాల్లో పాత్రలనే మళ్ళీ రిపీట్ చేసి వదిలాడు. అవి కొన్ని సార్లు నవ్విస్తే..మరికొన్ని సార్లు ఇబ్బందిపడుతూ మనల్ని పెడతాయి. అయితే కామిడీ క్లిక్ అయితే సినిమా క్లిక్ అయ్యినట్లే అన్నది నిజమైతే ఈ దూకుడు హిట్టులోకి దూకేసినట్లే.

    తండ్రి పగను తీరుస్తూ, పనిలో పనిలో తన డ్యూటీ నెరవేర్చే పోలీస్ కథ దూకుడు. అజయ్(మహేష్)కి చిన్నప్పటినుంచీ దూకుడు ఎక్కువ. అతని తండ్రి ఎమ్మల్యే శంకర నారాయణ(ప్రకాష్ రాజ్) చాలా నిజాయితీ పరుడు, స్వర్గీయ ఎన్టీఆర్ కి వీరాభిమాని. ఆయన తన కొడుకు కూడా తన లాగే ఎమ్మల్యే అయ్యి ప్రజాసేవ చెయ్యాలనుకుంటాడు. ఈలోగా ఆయన ప్రత్యర్ధుల దాడిలో కోమాలోకి వెళ్ళిపోతాడు. దాంతో మహేష్ ప్యామిలీ ముంబైకి షిప్ట్ అయిపోతుంది. అక్కడే మహేష్ పోలీస్ ఆఫీసర్ గా ఎదిగి టర్కీ వంటి దేశాలు వెళ్ళి అండర్ కవర్ ఆపరేషన్స్ చేస్తూంటాడు. పనిలో పనిగా అక్కడ ప్రశాంతి(సమంత)తో ప్రేమలో పడిపోతాడు. టర్కిలో పని పూర్తి చేసుకుని వచ్చిన అతనికి పధ్నాలుగు సంవత్సరాల నుండి కోమాలో ఉన్న తండ్రి కళ్లు తెరచినట్లు తెలుస్తుంది. దాంతో అజయ్ అక్కడికి వెళితే డాక్టర్..హటాత్తుగా షాకింగ్ గా ఉండేవేమీ చెప్ప్దద్దంటాడు. అప్పుడు తండ్రిని బ్రతికించుకోవటం కోసం అజయ్ తన తండ్రి కి నచ్చే విధంగా నాటకం ఆడటం మొదలెడతాడు. అందులో భాగంగా తాను ఎమ్మల్యేనని, ఎన్టీఆర్ ప్రధానమంత్రి అయ్యాడని చెప్పి నమ్మిస్తాడు. మరో ప్రక్క తండ్రిని దెబ్బ కొట్టిన విలన్స్ ను కూడా నాటకం ఆడి నాటకీయంగా తన తండ్రి చేతే ఎలా చంపిస్తాడనేది మిగతా కథ.

    గుడ్ బై లెనిన్ అనే జర్మన్ సినిమాలో ప్లాట్ తీసుకుని అల్లిన ఈ కథలో ఫ్యామిలీ ఎపిసోడ్ అంటే తండ్రి కోమాలోకి వెళ్ళి రావటం,నాటకం ఆడటం అనేది మాత్రం తీసుకున్నారు. అయితే గుడ్ బై లెనిన్ చిత్రం అక్కడ రాజకీయ వాతావరణం పై సామాన్యుల వేదన. జర్మని రెండు భాగాలుగా విడిపోయి బెర్లిన్ గోడ కట్టిన తర్వాత ఆ విభజన ఇష్టం లేని వారి ఆవేదన ని గుర్తు చేస్తూ అక్కడ సమాజాన్ని ప్రతిబింబిస్తూ సినిమా తీసాడు. అయితే ఇక్కడ అలాంటి సామాజికపరమైన ఇష్యూ ఏమీ తీసుకోలేదు. మిగతా సబ్ ప్లాట్లు అయిన లవ్ ట్రాక్, విలన్ ట్రాక్ కథకు కలవ లేదు. ఎంతసేపూ హీరో..విలన్ వెంటబడి అతన్ని చంపాలనే తిరుగుతూంటాడు. విలన్ కి మాత్రం సినిమాలో చాలా వరకూ హీరో ఎవరో తెలియదు.. తెలిసినా తానేమీ చేయకుండా వేరే వారికి పని అప్పచెప్పుతాడు.

    దాంతో విలన్, హీరో మధ్య జరగాల్సిన ట్రాక్ పూర్తిగా దారి తప్పింది. అలాగే తండ్రికి హీరో ఆడుతున్న నాటకం గురించి కూడా చివరి దాకా తెలియదు. దాంతో ఆ ట్రాక్ టెన్షన్ క్రియేట్ చేయదు. లవ్ ట్రాక్ కూడా చాలా స్మూత్ గా హీరోకి అనుకూలంగా సాగిపోతుంది. అలా ఎక్కడక్కడ కథలో హీరోకి పొరపాటున కూడా సమస్యలు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవటమే స్క్రీన్ ప్లేకు సమస్యగా మారి హీరోని ప్యాసివ్ గా మార్చేసింది. అయినా హీరోకి తన తండ్రి అంటే అంత ప్రేమ ఉన్నప్పుడు ఆయన ఆశయమైన ఎమ్మల్యే కాకుండా పోలీస్ ఆఫీసర్ ఎందుకు అవుతాడు.. యాక్షన్ సీన్స్ కోసమా.. అనేది క్యారెక్టరైజేషన్ ని దెబ్బ తీసే అంశం.

    ఇక యాక్షన్ ఎపిసోడ్స్ లో చాలా భాగం.. ఎక్కడో ఉన్న విలన్ ఇండియా రప్పించడం వరకూ పోకిరిని గుర్తు చేస్తుంది. ఇక డైలాగులు అయితే చెప్పనే అక్కర్లేదు పోకిరి ప్రభావం చాలా ఉంది. మిగతా పాత్రల విషయానకి వస్తే బ్రహ్మానందం, ఎమ్ ఎస్ నారాయణ పాత్రలను నమ్ముకుని చాలా సీన్స్ చేసారు. కానీ ఆ రెండు పాత్రలకూ సినిమాల్లో నటించాలనే పిచ్చి ఉండి హీరో చేతిలో బకరాలవటం అనే ఎలిమెంటే తీసుకోవటటంతో రిపీట్ గా చూస్తున్నట్లు ఉంటుంది. విలన్ సుబ్బరాజు పాత్ర ఢీలో జయప్రకాష్ రెడ్డిని గుర్తుకు తెస్తూ సాగుతుంది. ఇక పోకిరీలో ముమాయిత్ ఖాన్ రేంజిలో ఎక్సపెక్ట్ చేసి తీసిన పార్వతీ మిల్టన్ ఐటం సాంగ్ అంతగా కిక్ ఇవ్వదు. ఫస్టాప్ స్పీడుగా మంచి ఫన్ తో వెళ్లిపోయినా, సెకండాఫ్ మాత్రం నట్టుతూ, నసుగుతూ సాగుతుంది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో అల్లరి నరేష్ లాగ నాటకాలాడి విలన్స్ ని బకాలని చేయటం ఆసించే ఎలిమెంట్ కాదు. సమంత విషయానికి వస్తే ఆమె ట్రాక్ సెకండాఫ్ కి వచ్చే సరికి కేవలం పాటలకే పరిమితం అయ్యిపోయింది.పాటల్లో టైటిల్ సాంగ్ ఇప్పటికే హిట్టయ్యింది. చులి బులి పాట కూడా బాగుంది. కెమెరా, ఎడిటింగ్ చాలా షార్పుగా ఉన్నాయి. డైరక్షన్ రెగ్యులర్ శ్రీను వైట్ల ఫందాలోనే సాగింది. ఎంతలా అంటే మహేష్ బాబు డైలాగులు చెప్తూంటే ఢిలో శ్రీహరి చెప్తున్నట్లు ఉండేంత.

    ఇక హైలెట్స్ విషయానికి వస్తే శ్రీను వైట్ల కామిడీనే చెప్పుకోవాలి, అలాగే మహేష్ బాబు స్టైలిష్ నటన కూడసినిమాలో చెప్పించినట్లు కొన్ని సీన్స్ హాలీవుడ్ హీరోనే గుర్తుకొస్తాడు. అలాగే ఫస్ట్ హాఫ్ లో వచ్చిన సమంత, మహేష్ ల మధ్య సన్నివేశాలు కూడా చాలా బాగా ఫన్ తో కలిసి పండాయి. ఎమ్.ఎస్ నారాయణ... యమదొంగ, రోబో, మగధీర స్పూఫ్ లను చేస్తూ చేసిన ఫోటో షూట్ ఎపిసోడ్ కూడా బాగా నవ్వులు పండించింది. బ్రహ్మానందం..రియాలటీ షోల్లో అడిగినట్లుగా ఎస్ ఎమ్ ఎస్ రిక్వెస్టులు అడగటం కూడా రెగ్యులర్ గా టీవీ లు చూసే ప్రేక్షకులను కనెక్టు అయ్యేట్లు చేసింది. వెన్నెల కిషోర్ శాస్త్రి పాత్రలో, శ్రీనివాసరెడ్డి దర్శకుడు పాత్రలో కూడా బాగా చేసారు. ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, నాజర్ వంటి సీనియర్ ఆర్టిస్టుల గురించి కొత్తగా చెప్పుకునేది ఏమీలేదు. విలన్ గా చేసిన సోనూ సూద్ మాత్రం ఎందుకునో సీరియస్ డాన్ గా అనిపించలేకపోయాడు. దానికి కారణం అతని క్యారెక్టర్ ని కామిడీగా కార్టూన్ పాత్రలాగ తీర్చిదిద్దటమే అయ్యుండవచ్చు.

    ఫైనల్ గా కామిడీని మహేష్ ఇమేజ్ కన్నా ఎక్కువగా నమ్ముకుని రూపొందించిన ఈ చిత్రం మహేష్ నుంచి ఓ రేంజి యాక్షన్ ని ఆశించి మాత్రం వెళ్తే నిరాశ పరుస్తుంది. అలా కాకుండా ఓ రెగ్యులర్ శ్రీను వైట్ల కామిడీ సినిమా చూస్తున్నాం, మహేష్ ఇందులో నటించాడు అని మైండ్ లో ఫిక్స్ అయి బ్లైండ్ గా వెళితే బావున్నట్లనిపిస్తుంది. పోకిరిలాగానో, అతడు లాగానో మాత్రం ఎక్సపెక్ట్ చేయద్దు.. ఖలేజా కన్నా బెటర్ అనుకుంటే హ్యాపీగా చూసేయవచ్చు.అసభ్యత,మితిమీరిన హింస లేవు కాబట్టి ఫ్యామిలీలు కూడా ఈ దశరా సెలవుల్లో వెళ్లచ్చు.

    English summary
    Mahesh Babu film Dookudu released today with positive talk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X