Dooradarshini Movie Review: దూరదర్శని మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: సువిక్షిత్ బొజ్జ, గీతిక రతన్, జెమినీ సురేష్, భద్రం, కిట్టయ్య, బాలరాజు పులుసు, భాస్కర్, విజయ్ కృష్ణారెడ్డి, లావణ్య రెడ్డి తదితరులు
దర్శకత్వం: కార్తికేయ బొమ్మి
నిర్మాతలు: జయశంకర్ రెడ్డి ఎం, పాటిమిద్ది సంతోష్ కుమార్
మ్యూజిక్: ఆనంద్ గుర్రన
సినిమాటోగ్రఫి: సునీల్ పొన్నం
ఎడిటింగ్: సన్నీ
బ్యానర్: వరాహ మూవీ మేకర్స్
రిలీజ్ డేట్: 2026-05--15
మట్టపరు అనే గ్రామానికి చెందిన హరి (సువిక్షిత్ బొజ్జ) వాణి (గీతిక రతన్) ప్రేమించుకొంటారు. సంపన్న కుటుంబానికి చెందిన వాణి, పేదింటి వాడైన హరి మానసికంగా ఒకరినొకరు విడిచి పెట్టి ఉండలేనంతగా దగ్గరవుతారు. వారి ప్రేమకు పేక బాబు (భాస్కర్) ఇళ్లు అడ్డగా మారుతుంది. వాణిపై మనసుపడ్డ పేకబాబు హరితో ప్రేమను జీర్ణించుకోలేకపోతాడు. వాణి అన్నయ్య పరుశురామ్ (విజయ్ కృష్ణారెడ్డి) దృష్టికి తీసుకొస్తాడు. దాంతో హరి, వాణి ప్రేమకు అడ్డంకిగా మారుతారు. దాంతో వారు తమ ప్రేమను గెలుపించుకోవడానికి ఊరి నుంచి లేచిపోతారు.

హరి, వాణి మధ్య ప్రేమ కలుగడానికి కారణమైన అంశాలు ఏమిటి? ఉన్నత చదువులు చదవాలని తండ్రి చేసిన సూచనను హరి ఎందుకు నిరాకరించాడు? పేకబాబు కుట్రలు ఎలా సాగాయి? చెల్లెలి ప్రేమ గురించి తెలుసుకొన్న పరుశురామ్ రియాక్షన్ ఏమిటి? హరి, వాణిలను విడగొట్టడానికి పరుశురామ్ చేసిన ప్రయత్నాలు ఏమిటి? ఏ పరిస్థితుల్లో హరి, వాణి ఊరి నుంచి పారిపోయారు? వాణితో లేచిపోయిన తర్వాత హరి కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటి? హరి, వాణి మట్టపరుకు తిరిగి వచ్చిన తర్వాత గ్రామంలో నెలకొన్న పరిస్థితులు ఏమిటి? హరి, వాణి ప్రేమ కథకు ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే దూరదర్శని సినిమా కథ.
దూరదర్శని సినిమా కథను ఓ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్‌తో ప్రారంభిస్తారు. ఎలివేషన్స్, హైప్, ఊహకు అందని అంశాలకు చోటివ్వకుండా నిజాయితీగా రూరల్ బేస్డ్ లవ్ స్టోరి చెప్పే ప్రయత్నం చేస్తున్నారనే విషయం ఆరంభంలోనే అర్ధమవుతుంది. అయితే ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమకథను అంతా కొత్తవారితోనే రూపొందించడం పెద్ద సవాలే. ఆ సవాల్‌ను స్వీకరించిన తీరు బాగుంది. కానీ కథలో వైవిధ్యం, సన్నివేశాల్లో భావోద్వేగాలు, నటీనటుల క్యారెక్టరైజేషన్లు పక్కాగా ప్లాన్ చేసుకొని ఉంటే బాగుండేదనిపిస్తుంది. రొటీన్, రెగ్యులర్ తరహాలో ఇప్పటికే చాలా సినిమాల్లో చూసిన లవ్ ఎపిసోడ్స్ కొత్తదనాన్ని తెర మీద ప్రేక్షకుడిని కన్విన్స్ చేసేలా లేకపోవడం వల్ల సాదాసీదా ప్రేమ కథ చూస్తున్నామా? అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ చివరి 20 నిమిషాలపాటు సాగే ట్విస్ట్‌తో కూడిన క్లైమాక్స్ కొంత సానుకూలతను తీసుకొచ్చేలా చేసింది. దర్శకుడు, నటీనటులు టీమ్ వర్క్‌గా చేసిన ప్రయత్నం ఫర్వాలేదనిపిస్తుంది.
స్టార్ ఇమేజ్ ఉన్న హీరో, హీరోయిన్ల సినిమాలే థియేటర్లలో ఆడటం గగనమైన ఈ రోజుల్లో సువిక్షిత్ బొజ్జ, గీతిక రతన్ ప్రధాన పాత్రల్లో నటించి ఈ సినిమాను తమ భుజాలపై మోయడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఈ చిత్రంలోని నటీనటులందరూ తాము నమ్మిన పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. జెమిని సురేష్, భాస్కర్, విజయ్ కృష్ణారెడ్డి, లావణ్య రెడ్డి లాంటి వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు రాణించారు. హరి తండ్రిగా నటించిన నటుడు కూడా గుర్తుండిపోయేలా యాక్టింగ్ చేశాడు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమాకు కథ, కథనాలు, డైలాగ్స్‌పై మరింత దృష్టిపెడితే డిఫరెంట్ లవ్ స్టోరి అయి ఉండేది. ఈ సినిమాకు సునీల్ పొన్నం సినిమాటోగ్రఫి ప్లస్ పాయింట్. గ్రామీణ ప్రాంత అందాలను ఫీల్‌గుడ్‌గా చిత్రీకరించారు. సినిమాలో కొంత ల్యాగ్ ఉందని స్పష్టంగా అనిపిస్తుంది. సన్నీ కొంత స్ట్రిక్ట్‌గా నిడివి తగ్గించి ఉంటే స్పీడ్, ఫీల్ పెరిగి ఉండేది. ఆనంద్ గుర్రన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. జయశంకర్ రెడ్డి ఎం, పాటిమిద్ది సంతోష్ కుమార్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. అంతా కొత్తవారు చేసిన ప్రయత్నం బాగుంది. కంటెంట్ విషయంలోనే ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే హానెస్ట్ అటెంప్ట్ అయి ఉండేది.


Click it and Unblock the Notifications