Drinker Sai Movie Review: డ్రింకర్ సాయి మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Rating: 2.75/5
నటీనటులు: ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రం, కిర్రాక్ సీత, రీతు చౌదరి, ఫన్ బకెట్ రాజేశ్, రాజ ప్రజ్వల్, తదితరులు
నిర్మాతలు: బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్
రచన, దర్శకత్వం: కిరణ్ తిరుమలశెట్టి
సినిమాటోగ్రఫి: ప్రశాంత్ అంకిరెడ్డి
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
మ్యూజిక్: శ్రీ వసంత్
కాస్ట్యూమ్ డిజైనర్స్: ఎస్ఎం రసూల్, జోగు బిందు శ్రీ
స్టిల్స్: రాజు వైజాగ్ (SVA)
వీఎఫ్ఎక్స్: సుమరామ్ రెడ్డి.ఎన్
ఆర్ట్: లావణ్య వేములపల్లి
కొరియోగ్రఫీ: భాను, మోయిన్
లైన్ ప్రొడ్యూసర్: లక్ష్మీ మురారి
లిరిక్స్: చంద్రబోస్
బ్యానర్: ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్
రిలీజ్ డేట్: 2024-12-27
సంపన్న కుటుంబంలో పుట్టిన సాయి (ధర్మ) చెడు అలవాట్లకు బానిసై నలుగురు స్నేహితులను పోగేసుకొని జీవితాన్ని జాలీగా గడుపుతుంటాడు. భాగీ (ఐశ్వర్య శర్మ) నేచురోపతి విభాగంలో వైద్య విద్యను అభ్యసిస్తుంటుంది. సాయితో భాగీకి యాక్సిడెంటల్‌గా పరిచయం ఏర్పడుతుంది. భాగీని తొలి చూపులోనే సాయి ప్రేమిస్తాడు. అయితే తనకు ఇష్టం లేకపోయినా ప్రేమిస్తున్నట్టు భాగీ నాటకం ఆడుతుంది. చివరకు ఓ సంఘటనలో సాయి ప్రేమను నిరాకరిస్తుంది.

రిచ్ కిడ్ సాయి ఎందుకు మద్యం, సిగరేట్లకు అలవాటు పడ్డాడు? గొప్ప ఇంటిలో పుట్టినప్పటికీ జలాయిగా వీధుల్లో ఎందుకు తిరుగుతుంటాడు? సాయిని భాగీ ఎలా కలుసుకొన్నది? సాయి ప్రేమను ఆమె ఎందుకు అంగీకరించింది? సాయి ప్రేమను భాగీ ఎందుకు నిరాకరించింది? బ్రేకప్ తర్వాత సాయికి ఎదురైన కఠిన సమస్య ఏమిటి? చివరకు సాయి ప్రేమను అంగీకరించిందా? నిరాకరించిందా? తనకు ఎదురైన సమస్య నుంచి సాయి బయటపడ్డాడా? అనే ప్రశ్నలకు సమాధానమే డ్రింకర్ సాయి సినిమా కథ.
డ్రింకర్ సాయి సినిమా విషయానికి వస్తే.. నేటి తరం యువత అలవాట్లను, జీవనశైలిని ప్రతిబింబించే అంశాలను ఆధారంగా చేసుకొని ఎమోషనల్ ప్రేమకథను జోడించి చేసిన చిత్రం. అయితే కథ, కథనాలు విషయంలో కొత్తదనం ఏమీ కనిపించదు కానీ.. దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి తన కథలో హీరో, హీరోయిన్ల పాత్రలను బలంగా రాసుకోవడంలో సఫలమయ్యాడు. అంతేకాకుండా కొత్త హీరో, హీరోయిన్ల నుంచి తనకు కావాల్సిన నటనను రాబట్టుకొన్న విధానం బాగుంది. దాంతో కొన్ని లోపాలను సవరించే ప్రయత్నం చేశాడనిపిస్తుంది. కథలో పాటలు ఎక్కువ కావడం వల్ల కథా వేగానికి కళ్లెం వేసినట్టు అనిపించడమే కాకుండా అక్కడక్కడా ఎమోషన్స్ బ్రేక్ చేసిందా? అనిపిస్తుంటుంది. చివరకు ప్రేక్షకుడిని కొన్ని అంశాలతో కొత్త టీమ్ మెప్పించడానికి చేసిన ప్రయత్నం అభినందనీయం.

సాయిగా ధర్మ, భాగీగా ఐశ్వర్య శర్మ తమ పాత్రల్లో లీనమై నటించారు. కొత్తవారైనప్పటికీ.. ఎక్కడా తడబాటు, బెరుకు కనిపించకుండా అనుభవం ఉన్న నటీనటుల వలే తన పాత్రలతో మంచి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ధర్మ తన డ్యాన్సులు, ఫైట్స్‌తోపాటు ఎమోషనల్ సీన్లలో పర్‌ఫెక్షన్ చూపించాడు. ఇక ఐశ్వర్య శర్మ భారమైన, ఎమోషన్స్ భారీగా స్కోప్ ఉన్న పాత్రను సునాయసంగా పోషించింది. ఇక అతిథి పాత్రలో కనిపించిన శ్రీకాంత్ అయ్యాంగార్ ఎప్పటిలానే సింగిల్ ఎక్స్‌ప్రెషన్‌తో బోర్ కొట్టించే ప్రయత్నం చేశాడు. సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రం, కిర్రాక్ సీత, రీతు చౌదరి మిగితా వారందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.
నిర్మాతలు బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ డ్రింకర్ సాయి సినిమాను రిచ్‌గా మంచి క్వాలిటీ అవుట్‌పుట్‌ను అందించేలా చేశాయి. మంచి సినిమాను అందించాలనే వారి అభిరుచికి అద్దం పట్టింది. ఇక ఈ సినిమాకు ఫోక్ టచ్‌తో సాగిన పాటలు బాగున్నాయి. శ్రీ వసంత్ మ్యూజిక్, ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫి అదనపు ఆకర్షణ. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ బాగున్నప్పటీకీ.. సినిమా నిడివిని కనీసం 15 నిమిషాలు తగ్గించి ఉంటే ఇంకా కథలో స్పీడ్ పెరిగేదనిపించింది.

బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నప్పటికీ.. హీరోది బ్యాడ్ క్యారెక్టర్ కాదనే మెయిన్ పాయింట్ చుట్టూ అల్లుకొన్న చిత్రం డ్రింకర్ సాయి. చెడు అలవాట్ల బారిన పడిన యువకుడిని ప్రేమ ఏ విధంగా సన్మార్గంలోకి ప్రయాణించేలా చేసిందనే పాయింట్ చుట్టు అల్లుకొన్న ఎమోషన్స్ కొన్ని చోట్ల వర్కవుట్ అయ్యాయి. నేటి తరం యువతకు కావాల్సిన అంశాలు పుష్కలంగా ఈ సినిమాలో ఉన్నాయి. మంచి కాన్సెప్ట్‌తోపాటు కొత్త నటీనటుల సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. ఈ వారం రెగ్యులర్ ఆడియెన్స్ ఈ సినిమాపై ఓ లుక్ వేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications











