Dude Movie Review: ఢ్యూడ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు, నేహా శెట్టి, ఆర్ శరత్ కుమార్, హిృదూ హరూన్, సత్య, రోహిణి, ఐశ్వర్య శర్మ తదితరులు
దర్శకత్వం: కీర్తీశ్వరన్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
సినిమాటోగ్రఫి: నికేత్ బొమ్మి
మ్యూజిక్: సాయి అభయంకర్
ఎడిటింగ్: భరత్ విక్రమన్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
రిలీజ్ డేట్: 2025-10-17
తాను ప్రేమించిన అమ్మాయి (నేహా శెట్టి)తో లవ్ బ్రేకప్ అయిన గగన్ (ప్రదీప్ రంగనాథన్)పై తన మేనమామ, రాష్ట్ర మంత్రి ఆదికేశవులు (ఆర్ శరత్ కుమార్) కూతురు కుందన (మమితా బైజు) మనసు పడుతుంది. అయితే కుందన లవ్ ప్రపోజల్‌ను గగన్ తిరస్కరిస్తాడు. దాంతో హార్ట్ బ్రేక్ అయిన కుందన బెంగళూరుకు వెళ్లిపోతుంది. అయితే గగన్ తన మనసు మార్చుకొని మరదలు కుందనను పెళ్లి చేసుకోవడానికి సిద్దపడుతాడు. దాంతో తన కులం వాడికే ఇచ్చి పెళ్లి చేయాలని ఆదికేశవులు తమ మేనల్లుడు, కూతురికి పెళ్లి ఫిక్స్ చేస్తాడు. అయితే గగన్‌తో పెళ్లికి కుందన అయిష్టపడి సూసైడ్‌కు ప్రయత్నిస్తుంది.

కుందన లవ్‌ను గగన్ ఎందుకు రిజెక్ట్ చేశాడు? ఆ తర్వాత కుందనను ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకొన్నాడు. గగన్‌తో పెళ్లిని ఎందుకు రిజెక్ట్ చేసింది. కుందన ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకొన్నది? చివరకు ఏ పరిస్థితుల్లో కుందనను గగన్ పెళ్లి చేసుకొన్నాడు? పెళ్లికి ముందే కుందన గర్బవతి కావడంతో గగన్ పరిస్థితి ఏమిటి? కుందన ఎవరితో ప్రెగ్నెంట్ అయింది? కుందన బిడ్డకు తండ్రిగా గగన్ ఎందుకు బాధ్యత తీసుకొన్నాడు? చివరకు కుందన, గగన్ బంధం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? కుందన కులాంతర వివాహం తెలిసిన రాష్ట్ర మంత్రి ఆదికేశవులు ఏం చేశాడు? అనే ప్రశ్నలకు సమాధానమే డ్యూడ్ సినిమా కథ.
పరువు హత్యలు, కులాంతర వివాహాలు, ప్రేమ, పెళ్లి అంశాలను కలిపి దర్శకుడు కీర్తీశ్వరన్ రాసుకొన్న పాయింట్ బోల్డ్‌గా ఉంటుంది. అయితే సామాజిక విలువలకు, ప్రస్తుత పరిస్థితులకు చాలా దగ్గరగా ఉండే సన్నివేశాలతో కథను అల్లుకొన్నాడు. కులాంతర వివాహం చేసుకొన్నాడనే కారణంగా సొంత చెల్లినే హత్య చేసిన ఓ అన్న కథను లింక్ చేసి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా సినిమాను మార్చే ప్రయత్నం కొంత మేరకు సక్సెస్ అయిందనిపిస్తుంది. ఫస్టాఫ్‌ను ఫర్వాలేదనే విధంగా డీల్ చేసిన దర్శకుడు సెకండాఫ్‌లో చాలా కన్‌ఫ్యూజన్ కూడిన సన్నివేశాలతో సినిమాను గందరగోళంలో పడేశాడా? అనిపిస్తుంది. కాకపోతే పరువు కోసం హత్యలు చేయకూడదు. కులాన్ని పట్టుకొని వేలాడకూడదు అనే సీరియస్ పాయింట్స్‌ను కన్విన్సింగ్‌గా చెప్పలేకపోయారు అనిపిస్తుంది. కథలో కొత్తదనం లేదు. చాలా సినిమాల్లోని పాయింట్లను కలిపి అతుకుల బొంతగా మార్చారా? అనే అనుమానం కలుగుతుంది.
పరువు హత్యలు, కులాంతర వివాహం అనే కాన్సెప్ట్‌తో రాసుకొన్న కథలో చాలా లోపాలు, క్లారిటీ లేకపోయినప్పటికీ.. టాలెంటెడ్ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్ తన పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఈ సినిమాకు బలంగా మారింది. డిఫరెంట్ వేరియేషన్స్‌తో సినిమాను ప్రదీప్ నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. సినిమాను నడిపించే పూర్తి బాధ్యతను తీసుకొనే క్రమంలో మమితా బైజు, ఇతర క్యారెక్టర్లను కూడా తానే డామినేట్ చేశాడు. క్లైమాక్స్ సన్నివేశాల్లో మమిత బైజు యాక్టింగ్ ఆకట్టుకొనేలా ఉంటుంది. దాంతో మమితా బైజు కూడా పూర్తిస్థాయిలో పెర్మార్మెన్స్‌ను చూపించలేకపోయింది. శరత్ కుమార్ రెగ్యులర్, రొటీన్ విలన్ పాత్రలో కనిపించాడు. కమెడియన్ సత్యకు భార్యగా నేహా శెట్టి డీగ్రేడ్ పాత్రలో కనిపించడం ఓ షాకింగ్. నేహా శెట్టి, సత్య జంట సినిమా చూస్తున్నంత సేపు మింగుడు పడని విషయంగా కనిపిస్తుంది.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. తెలుగు నేటివిటికి ఏ మాత్రం కనెక్ట్ కానీ మ్యూజిక్ సినిమాకు మైనస్. సాయి అభయంకర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంత గొప్పగా ఉండదు. నికేత్ బొమ్మి మంచి సినిమాటోగ్రాఫర్. కానీ ఈ సినిమాలో ఆయన వాడిన లైటింగ్, ఉపయోగించుకొన్న ఆర్ట్ వర్క్, కలర్ ప్యాటర్న్ చాలా డల్‌గా ఉండటం వల్ల సన్నివేశాల క్వాలిటీ చాలా పూర్‌గా ఉంటుంది. సాధారణంగా మైత్రీ మూవీ మేకర్స్ రూపొందించే సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయి. ఈ సినిమా విషయానికి వస్తే.. నాసిరకంగా చుట్టేశారా? అనుమానం కలుగుతుంది. ఈ మధ్య కాలంలో మైత్రీ బ్యానర్‌లో ఇంతగా లో క్వాలిటీతో సినిమా తీయడం రేర్‌గా అనిపిస్తుంది.
ఓవరాల్‌గా డ్యూడ్ సినిమా గురించి చెప్పాలంటే.. ప్రదీప్ రంగనాథన్ షో రన్నర్. ఆయన తప్ప ఈ సినిమాలో పాజిటివ్ పాయింట్స్ ఏమీ కనిపించవు. రకరకాల లోపాలు ఉన్న ఈ సినిమాను కూడా ప్రదీప్ తన పెర్ఫార్మెన్స్‌తో పాజిటివ్‌గా మార్చాడు. ప్రదీప్ రంగనాథన్ ఫ్యాక్టర్ ఈ సినిమాను కాపాడుతుందా? అనేది పెద్ద ప్రశ్న. పాత చింతకాయ పచ్చడి లాంటి పరువు హత్య, కులాంతర వివాహాల కథ బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడంపైనే ఈ సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. తమిళ వాసనలు గట్టిగానే కొట్టే మూవీ ఇది. రానున్న రోజుల్లో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











