డుండుండుం

చిత్రం: డుండుండుం
నటీనటులు: మాధవన్, జ్యోతిక, వివేక్, మణివణ్ణన్
సంగీతం: కార్తీక్ రాజా
నిర్మాత: మణిరత్నం, జి.శ్రీనివాసన్
దర్శకత్వం: ఎన్. అలగం పెరుమాళ్
ప్రేమకథలను విభిన్నంగా, అందమైన కావ్యంగా మల్చడం మణిరత్నం ప్రత్యేకత. ఆయన శిష్యుడు అలగం పెరుమాళ్ కూడా అదే స్టైల్ ను అనుసరిస్తూ తీసిన డుండుండుం కూడా చక్కటి ప్రేమకథా చిత్రం. కథను సాగదీసినా, కథపై గ్రిప్ మాత్రం ఎక్కడా పోగట్టకుండా ఆద్యంతం మంచి కథనంతో సినిమాను నడిపించాడు. కథ, స్క్రీన్ ప్లే లో మణిరత్నం భాగస్వామ్యం కూడా ఉండడంతో కొన్ని చోట్ల దృశ్యాలు అద్భుతంగా అనిపిస్తాయి. రామ్ జీ ఫోటోగ్రఫీ, కార్తీక్ రాజా సంగీతం కూడా తోడవ్వడంతో సినిమా హాయిగా సాగిపోయింది. దక్షిణ తమిళనాడులోని పల్లెటూరు అందాలను రామ్ జీ క్యాప్చర్ చేసిన తీరు బాగుంది. తెరకు నిండుదనం వచ్చింది. తుమ్మ చెట్ల పొదలను కూడా అందంగా చిత్రీకరించారు. కార్తీక్ రాజా ఈ సినిమాకు అందించిన రీరికార్డింగ్ చూస్తే, తెలుగువాళ్ళు చెప్పుకునే గొప్పదనం అంతా తేలిపోతుంది. రీరికార్డింగ్ అంటే డప్పులు కొట్టడం ఈ సినిమా చూసైనా నేర్చుకుంటారా మనవాళ్ళు.
మాధవన్, జ్యోతికలకు పెళ్ళి కుదురుతుంది. పల్లెటూరి అమ్మాయిని చేసుకోవడం మాధవన్ కు ఇష్టముండదు. ప్రేమించి పెళ్ళి చేసుకోవాలని అనుకుంటాడు. జ్యోతిక మద్రాస్ వెళ్ళి ఇంజనీరింగ్ పూర్తి చేయాలనుకుంటుంది. సో వీరిద్దరు కలిసి పెళ్ళి ఆపేందుకు ప్రయత్నిస్తారు. ఎన్ని ప్లాన్ లు వేసినా సక్సెస్ కావు. చివరికి తప్పక చేసుకుందామనుకునే సమయానికి వీరిద్దరి కుటుంబాల మధ్య గొడవలు ప్రారంభమై పెళ్ళి ఆగిపోతుంది. కానీ అప్పటికే వీరిద్దరూ ప్రేమలో పడిపోతారు. ఇది ఫస్ట్ హాఫ్. ద్వితీయార్థం అంతా వీరిద్దరూ కలుసుకునేందుకు చేసే ప్రయత్నం. మాధవన్ డుండుం జ్యోతికతో డుండుండుం అంటాడా?
మాధవన్, జ్యోతికల నటన చాలా నేచురల్ గా ఉంది. ఇద్దరూ చక్కగా చేశారు. వివేక్ పాత్ర కొంచెం ఎక్కువైనా ఆ పాత్ర ఒక్కటే కాస్త కామెడీ క్యారక్టర్. కామెడీ కలపి, కొంచెం నాన్ సీరియస్ గా సినిమాను మలిస్తే సినిమా హిట్ అయ్యేది. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చకపోవచ్చు. అలాగే డైలాగ్స్ నేచురల్ గా లేకపోవడం పెద్ద లోపం. కాకపోతే కార్తీక్ రాజా సంగీతం హాయిగా ఉంది.పెరుమాళ్ కు మంచి భవిష్యత్ ఉంది. పల్లెటూళ్ళ మీద ఆయనకు చక్కటి గ్రిప్ ఉంది.


Click it and Unblock the Notifications











