Emergency Movie Review: ఎమర్జెన్సీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: కంగన రనౌత్, అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరీ, మిలింద్ సోమన్, విశాక్ నాయర్, సతీష్ కౌశిక్ తదితరులు
కథ, దర్శకత్వం: కంగన రనౌత్
నిర్మాతలు: జీ స్టూడియోస్, కంగన రనౌత్, రేణు పిట్టి
సినిమాటోగ్రఫి: టెట్సు నగటా
ఎడిటర్: రామేశ్వర్ ఎస్ భగత్
మ్యూజిక్: జీవీ ప్రకాశ్ కుమార్, ఆర్కో (పాటలు), సంచిత్ బల్హారా, అర్కిత్ బల్హారా (బీజీఎం)
బ్యానర్: మణికర్ణిక ఫిల్మ్స్, జీ స్టూడియోస్
రిలీజ్ డేట్: 2025-01-17
భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మరణంతో వారసుడు ఎవరనే చర్చ సమయంలో ఇందిరా గాంధీ (కంగన రనౌత్) పేరు తెరపైకి వస్తుంది. అప్పటికే అస్సాం దురాక్రమణకు చైనా పావులు కదపడాన్ని కనిపెట్టిన ఆ దేశం ప్రయత్నాలకు ఇందిరా చెక్ పెడుతుంది. ఆ తర్వాత శాస్త్రి ప్రధాని కావడం.. ఆయన ఆకస్మిక మరణం చెందడంతో దేశ ప్రధాని పదవిని ఇందిరా చేపట్టాల్సి వస్తుంది. దాంతో అప్పటికే ఆ పదవి కోసం కాచుకు కూర్చున్న సీనియర్ కాంగ్రెస్ నేతలకు ఆ విషయం మింగుడు పడని విధంగా మారుతుంది.

అస్పాంను ఆక్రమించుకొనేందుకు చైనా చేసిన ప్రయత్నాలను ఇందిరా ఎలా తిప్పి కొట్టింది? ప్రధాని పదవి చేపట్టిన తర్వాత పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా యుద్దం ప్రకటించి బంగ్లాదేశ్ అవతరణకు ఎలాంటి సాహసం చేసింది? పాక్‌పై యుద్దం సమయంలో అమెరికా, ఇతర దేశాలకు ఎలాంటి వార్నింగ్ పంపించింది? ఎలాంటి పరిస్థితుల్లో ఎమర్జెన్సీ విధించడానికి ఇందిరా నిర్ణయం తీసుకొన్నది. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన ఇందిరలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి? తన కొడుకు సంజయ్ గాంధీ వల్ల వచ్చిన చెడ్డ పేరును ఎలా చెరిపేసుకొనే ప్రయత్నం చేసింది? ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో స్వర్ణ దేవాలయంపై సైనిక చర్య సమయంలో ఇందిర తీసుకొన్న డేరింగ్, డైనమిక్ చర్యలు ఏమిటి? కొడుకు సంజయ్ మరణంతో ఇందిరా ఎలా కుంగిపోయింది? సిక్కుల కాల్పుల్లో ఇందిర ఎలా నేలకొరిగిందనే ప్రశ్నలకు సమాధానమే ఎమర్జెన్సీ సినిమా కథ.
ఇందిరా అంటే ఇండియా.. ఇండియా అంటే ఇందిరా అనేంత గొప్ప పేరు నేత జీవితాన్ని తెర మీద ఆవిష్కరించాలంటే.. ఏ ఫిల్మ్ మేకర్‌కైనా గట్స్ ఉండాలి. అయితే దేశంలో విధించిన ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) పాయింట్ చుట్టు కథాంశంతో సక్సెస్ కొట్టిందనే అభిప్రాయం కలుగుతుంది. అయితే కొన్ని చోట్ల ఇందిరా ఇమేజ్‌కు, ప్రతిష్టకు భంగం కలిగించేలా చేసిన సీన్లు అభ్యంతరకరంగా మారుతాయి. ఎమర్జెన్సీ కాలంలో ఆమె పాత్రను చిత్రీకరించిన తీరు కొంత అసంతృప్తిని కలుగజేస్తుంది. ఈ విషయాలు తప్పితే కంగన అనుసరించిన స్క్రీన్ ప్లే, ఎంచుకొన్న సన్నివేశాలు అద్బుతంగా తెర మీద పండాయనే చెప్పాలి.

ఇక ఇందిర గాంధీగా కంగన రనౌత్ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారనే చెప్పాలి. మాజీ ప్రధాని నడిచే తీరు, ముఖ కవలికలు, బాడీ లాంగ్వేజ్, ఆహార్యం లాంటి విషయాల్లో చక్కటి శ్రద్దను తీసుకొన్నారు. కేవలం నటిగానే కాకుండా దర్శకురాలిగా కూడా కంగన తన సత్తాను చాటుకొన్నారు. ముఖ్యంగా సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత వచ్చే సీన్లలో ఆమె నటన భావోద్వేగానికి గురి చేస్తుంది. అమెరికాలో రాష్ట్రపతి నిక్సన్‌తో వ్యవహరించే సన్నివేశాలు గూస్ బంప్స్ వస్తాయి.
అటల్ బీహారి వాజ్‌పేయ్‌గా శ్రేయాస్ తల్పాడే, లోకమాన్య జయప్రకాశ్ నారాయణ్‌గా అనుపమ్ ఖేర్, జగ్జీవన్ రామ్‌గా సతీష్ కౌశిక్, ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్ షాగా మిలింద్ సోమన్, తన అంతరంగీకురాలు పుపుల్ జయకర్‌గా మహిమా చౌదరీ, మురార్జీ దేశాయ్‌గా అశోక్ చాబ్రా, సంజయ్ గాంధీగా విశాక్ నాయర్ పాత్రలను బ్రహ్మండంగా తీర్చి దిద్దారు. ఇందిరా రాజకీయ సలహాదారు ఆర్కే ధావన్ పాత్రలో దర్శన్ పాండ్యా తన పాత్రతో చెలరేగిపోయాడు. మిగితా పాత్రల్లో నటించిన వారంతా తమ రోల్స్‌కు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమాకు సినిమాటోగ్రఫి, మ్యూజిక్ అత్యంత బలంగా నిలిచాయి. అలాగే ఎడిటింగ్ విభాగం పనితీరు కూడా చక్కగా ఉంది. జీవీ ప్రకాశ్ పాటలు అందించగా.. సంచిత్, అంకిత్ బల్హారా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పలు సన్నివేశాలను భారీగా ఎలివేట్ చేయడమే కాకుండా కథలో లీనమయ్యేందుకు దోహదపడ్డాయి. జీ స్టూడియో, మణికర్ణిక అనుసరించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి.
ఇందిరా గాంధీ జీవితం ఎన్నో భావోద్వేగాలు, మరెన్నో విషాదాలు, అలాగే వివాదాలతో ముడిపడి ఉన్నది. దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నేతకు ఎదురవ్వని సవాళ్లు ఈ మాజీ ప్రధానిని చుట్టుముట్టాయి. వాటిని సమర్ధవంతంగా ఎదుర్కోవడం వల్లే ఆమె ఉక్కు మనిషి అనే పేరు తెచ్చుకొన్నది. ప్రతిపక్షాలు, స్వపక్షం అనే తేడా లేకుండా తనకు పోటీగా నిలిచిన ప్రతీ ఒక్కరిని తనదైన శైలిలో పక్కకు తప్పించిన నేత. అలాంటీ నేత జీవితాన్ని పక్కాగానే తెరకెక్కించే ప్రయత్నం చేశారు. కానీ కొంత ఎజెండా ప్రభావంతో ఆమె పాత్రను చీప్‌గా, అగౌరవ పరిచే విధంగా చిత్రీకరించడం అభ్యంతరకరంగా కనిపిస్తాయి. ఈ కంప్లయింట్స్ పక్కన పెడితే.. కంగన ఈ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కంగన పెర్ఫార్మెన్స్ కోసం తప్పకుండా థియేటర్‌లోనే చూడాలి. దేశ చరిత్రలో మనకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. ఈ సినిమా తప్పకుండా మంచి అనుభూతినే కాకుండా థ్రిల్లింగ్ మూమెంట్స్ పంచుతుంది.


Click it and Unblock the Notifications











