Euphoria Movie Review: యుఫోరియా తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్
మూవీ: యుఫోరియా(Euphoria)
నటీనటులు: సారా అర్జున్, భూమికా చావ్లా, గౌతమ్ మీనన్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచిలి, అడ్డాల పృథ్వీరాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకావ్, నవీనా రెడ్డి, సాయి శ్రీనికా రెడ్డి తదితరులు
దర్శకత్వం: గుణశేఖర్
బ్యానర్: గుణ టీమ్ వర్క్స్
నిర్మాతలు: నీలిమా గుణ, యుక్తా గుణ
సమర్పణ: రాగిణి గుణ
మ్యూజిక్: కాలభైరవ
సినిమాటోగ్రఫి: ప్రవీన్ కే పోతన్
ఎడిటింగ్: ప్రవీణ్ పుడి
ఆర్ట్ డైరెక్షన్స్: శ్రీనివాస్ కళింగ
రిలీజ్ డేట్: 2025-01-06
చైత్ర (సారా అర్జున్) సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యే ఉన్నత ఆశయాలు ఉన్న అమ్మాయి. వికాస్ కాలేజీల అధినేత వింధ్య (భూమిక చావ్లా) కుమారుడు వికాస్ (విఘ్నేష్ గవిరెడ్డి). చదువుల్లో టాప్ స్టూడెంట్. ఓ రోజు పబ్‌లో జరిగిన పార్టీలో పరిచయమైన చైత్రను వికాస్ తన నలుగురు ఫ్రెండ్స్ కలిసి గ్యాంగ్ రేప్ చేస్తారు. ఆ కేసులో కోర్టుకు స్వయంగా సాక్ష్యాలు అందజేసి తన కొడుకుకు జీవిత ఖైదు (20 ఏళ్లపాటు) పడేలా వింధ్య చేస్తుంది.
చైత్రను ఎలా నమ్మించి మోసం చేశారు? వికాస్ గ్యాంగ్ చేతిలో రేప్ గురైన తర్వాత చైత్ర మానసిక పరిస్థితి ఏమిటి? యువతిని కొడుకు వికాస్ మానభంగం చేశాడని తెలిసిన తర్వాత వింధ్య మానసిక పరిస్థితి ఏమిటి? లైంగిక దాడికి గురైన మైనర్ బాలిక గురించి వింధ్య పడిన మానసిక సంఘర్షణ ఏమిటి? ఈ కేసును పోలీస్ ఆఫీసర్ జయదేవ్ ( గౌతమ్ వాసుదేవ్ మీనన్) ఎలా దర్యాప్తు చేశారు? జీవిత ఖైదు పడిన తర్వాత వికాస్ జీవితంలో చోటు చేసుకొన్న పరిస్థితులు ఏమిటి? జైలుశిక్ష వికాస్‌ను ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టింది? చివరకు వికాస్ జీవితం ఎలాంటి టర్న్ తీసుకొన్నది? లైంగిక దాడికి గురైన చైత్ర లైఫ్‌లో జరిగిన పరిణామాలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

చూడాలని ఉంది, ఒక్కడు, సైనికుడు, రుద్రమదేవీ లాంటి భారీ చిత్రాలను రూపొందించిన గుణశేఖర్ ఈసారి ప్రస్తుతం సమాజంలో క్లిష్టమైన సమస్యగా మారిన యూత్ కల్చర్ బేస్ చేసుకొని యుఫోరియా మూవీని తెరకెక్కించారు. మత్తు పదార్తాలు, డ్రగ్స్ కల్చర్ వల్ల యువతపై ఎలాంటి ప్రభావం చూపుతుంది. యువత చెడు మార్గాలు పడుతుండటం వల్ల తల్లిదండ్రుల మానసిక పరిస్థితి ఏమిటి అనే కోణంలో రాసుకొన్న కథ, సన్నివేశాలు హృదయాన్ని తట్టిలేపుతాయి. ఫస్టాఫ్‌కు ఆయన అనుసరించిన స్క్రీన్ ప్లే సినిమాను చాలా గ్రిప్పింగ్‌గా మార్చింది. సారా అర్జున్, భూమిక, విఘ్నేష్ ప్రథమార్థంలో పోటీ పడి నటించడంతో సినిమా ఎమోషనల్ జర్నీతో సాగుతుంది.
సాధారణంగా అయితే ఫస్టాఫ్‌లోనే కథ ముగిసింది అనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే సెకండాఫ్‌లో గుణశేఖర్ ఎలా కథను నడిపిస్తాడు అనే విషయం ఛాలెంజింగ్‌గా అనిపిస్తుంది. అయితే పేరెంట్స్ కోణంలో సెకండాఫ్‌లో కూడా టచ్ చేసిన పాయింట్ చాలా బాగుంది. కానీ బలమైన సన్నివేశాలు పడి ఉంటే.. డెఫినెట్‌గా మూవీ నెక్ట్స్ రేంజ్ సినిమా అయి ఉండేది. సెకండాఫ్‌లో కథ పడి లేస్తూ సాగుతుంది. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ కార్డు వరకు సాగిన ఎమోషనల్ డ్రైవ్‌తో మంచి సందేశాన్నే అందించడమే కాకుండా సమాజాన్ని, తల్లిదండ్రులను ఆలోచింపజేసేలా చేస్తుంది.
చైత్రగా సారా అర్జున్ పాత్ర ఈ సినిమాకు ప్రాణంగా మారింది. అత్యంత కీలకమైన క్యారెక్టర్‌లో సారా పలికించిన హావభావాలు, ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమా భారాన్నంత భూమిక తన భుజాలపై మోసింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లలో ఆమె నటించారనే కంటే.. జీవించారనే అనిపిస్తుంది. సగటు తల్లిదండ్రులు తమను తాము ఊహించుకొనే రేంజ్‌లో నటించారు. విఘ్నేష్ కొత్తవాడైనా అనుభవం ఉన్న యాక్టర్‌గా నటించడమే కాకుండా మంచి భవిష్యత్ ఉందని నిరూపించుకొన్నాడు. వికాస్ పాత్రలో పలు వేరియేషన్స్‌ను చక్కగా చూపించాడు. సోహైల్ పాత్రలో అడ్డాల పృథ్వీరాజ్ కూడా తనకు లభించిన అవకాశాన్ని వినియోగించుకొన్నాడు. ఇక ఈ సినిమా హీరో రేంజ్ ఎలివేషన్స్‌తో గౌతమ్ వాసుదేవ్ మీనన్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపిస్తాడు. సిన్సియర్ అండ్ స్ట్రిక్ పోలీస్ ఆఫీసర్ జయదేవ్‌గా తన పాత్రలో ఒదిగిపోయారు. ఈ సినిమాలో నటించిన వారంతా చక్కగా పెర్ఫార్మ్ చేశారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమాను చాలా రిచ్‌గా, క్వాలిటీ విషయంలో రాజీ పడుకుండా తెరకెక్కించారు. ప్రవీణ్ పోతన్ అందించిన సినిమాటోగ్రఫి ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. హైదరాబాద్‌లో నైట్ ఎఫెక్ట్ షాట్స్ చాలా క్లాసీగా ఉన్నాయి. కాల భైరవ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలోని సన్నివేశాలను హైలెట్ చేసింది. ప్రవీణ్ పుడి ఎడిటింగ్ కారణంగా కంటెంట్ ఎలివేట్ కావడమే కాకుండా సన్నివేశాలు చకచకా సాగిపోయాయి. గుణ టీమ్ వర్క్స్ అనుసరించిన నిర్మాణ విలువలు హైక్లాస్‌లో ఉన్నాయి.
యూఫోరియా రెగ్యులర్ సినిమాల కోవలో చెందని ఓ డిఫరెంట్ ఫిలిం. నేటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు పడే మానసిక సంఘర్షణకు అద్దంలా ఉంటుంది. వాస్తవ పరిస్థితులు, సమాజంలో జరుగుతున్న ప్రతికూల పరిస్థితులను దర్శకుడు గుణశేఖర్ భావోద్వేగంగా తెర మీద ఆవిష్కరించారు. ఈ సినిమాను లెక్కలు వేసుకోకుండా చూడాల్సిన చిత్రం. ఈ మూవీ ప్రస్తుతం జనరేషన్ గురించి ఆలోచింపజేసేలా చేస్తుంది. సెకండాఫ్‌లో కొన్ని జాగ్రత్తలు తీసుకొవాల్సి ఉండేదనిపిస్తుంది. ఏది ఏమైనా ప్రతీ ఫ్యామిలీ చూడాల్సిన సినిమా చెప్పొచ్చు. ఈ వారాంతంలో ఓ మంచి ఫ్యామిలీ మూవీ చూడాలనుకొంటే.. యూఫోరియాను ఛాయిస్‌గా ఎంచుకోవచ్చు.


Click it and Unblock the Notifications











